Magazines

పన్ను కడ్తా... కానీ పౌరుడ్ని (ఓటర్ని) కాను

1 గంట క్రితం

I pay taxes... but I am not a citizen (voter).
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 3 నిమిషాల చదవడం

కేతిగాడు : అరె జుట్టుపోలుగా మీ బి.జె.పోళ్లు ఓట్ల తనిఖీ ఏమోగాని పదమూడు శాతం ఓట్లు గల్లంతు అయిపోతున్నాయెహె. దాదాపు పదమూడు కోట్లమంది ఓట్లు పోవడమంటే మాటలారా..? ఓసారి ఓట్ల జాబితాలో ఓటెక్కేక చచ్చేదాగ్గాని ఓటు పోదు. అలాంటిది.. ఆ సర్టిఫికెట్‌ ‌పట్రా.. ఈ సర్టిఫికెట్‌ ‌పట్రా, ఫలానా టైముకు విచారణకు రా.. రకరకాల మెసేజ్‌‌లు, నోటీసులు.. మళ్లీ అవి ఇంగ్లీషులో. ఇదేమన్నా న్యాయంగా వుందారా..?
జుట్టుపోలుగాడు : నోర్ముయ్యెహె.. దేనికైనా ఓ పద్ధతి, ఓ విధానం ఏడ్చి చస్తాయి కదా. ఎన్నికల కమిషన్‌ అది పాటిస్తుంది. అందులోనూ మనం కంప్యూటర్‌ ‌యుగంలో జీవిస్తున్నాం. ఓసారి అన్నీ ఫీడ్‌ ‌చేశాక దాని ప్రకారం అది నడుస్తుంది. ఈ మాత్రానికే ఇంత ఇదైపోతే ఎలా..?
కేతిగాడు : అంటే ఏందిరా నీవనేది? సెల్‌ ‌ఫోనుండి, ఇంగ్లీషు వచ్చినోళ్లనే ఓటర్లుగా లెక్కేస్తారా..? లేనోళ్ల సంగతేంది? మారుమూల గ్రామాల్లోని పేదలు, ఆదివాసీలు, వలస కూలీల సంగతేంది? జుట్టుపోలుగాడు : అన్నీ సక్రమంగా వుంటే ఓటుండుద్ది. లేకుంటే పోతుంది.
కేతిగాడు : ఎంత తేలిగ్గా చెప్పావురా. ప్రజాస్వామ్య దేశంలో మనిషుండి ఓటు లేకపోతే చచ్చేంత అవమానం. అభిమానం. నీలాంటోడికి ఆ విలువ తెలియదులే.
జుట్టుపోలుగాడు : ఏం తెలియదు? ఎవడికైనా ఓటు కావాలంటే ఆ ఓటరే జాగ్రత్త పడాలి. అదే మా బి.జె.పి. రూలు. ఇరవై ఏళ్లకోసారి జరిగేది ఇప్పుడు మా సర్కార్‌ ‌చేయిస్తుంది.
కేతిగాడు: పాపం పల్లెల్లో ఓట్ల కోసం ఎన్నిపాట్లు పడుతున్నారో గమనించావురా? మనం తెలుగోళ్లం. ఇంగ్లీషులో స్పెల్లింగ్‌ ‌మిస్టేక్‌‌లు వున్నాయని, తండ్రుల పేర్లు, భర్తల పేర్లు, సక్రమంగా లేవని, అడ్రస్‌‌లు, బూతులు మారాయని, మధ్యమధ్యలో మీరు ఓట్లేయలేదని.. ఇలా నానా యాగీ చేస్తూ.. ఇష్టమొచ్చినట్టు నోటీసులు పంపితే ఎలా? ఓటు దక్కించుకోవడం కోసం పనులు మానుకుని ఆఫీసులు చుట్టూ పేదలు కాళ్లరిగేలా తిరగడం ఏమన్నా బాగుందారా? జుట్టుపోలుగాడు : ఎవడికోసం? ఓటు కావాలంటే తప్పదు మరి! కేతిగాడు : అరె మెంటల్‌‌నాకొడకా.. దేశానికి ఉప ప్రధానిగా పన్జేసిన వృద్ధనేత అధ్వానికి సైతం ‘సర్‌’ నోటీసులొచ్చాయి. అలాగే విదేశాంగ మంత్రి జై శంకర్‌‌కు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు కూడా నోటీసులొచ్చాయి తెల్సా..? జుట్టుపోలుగాడు : ఇప్పటికైనా ఒప్పుకుంటావా? సర్‌‌కు అంటే ఓటర్ల జాబితా తనిఖీ ప్రక్రియకు తన, పర భేదం లేదని...
కేతిగాడు : అదేమన్నా గొప్పనుకుంటున్నావురా..? ఇలా పెద్దపెద్దోళ్లకు, మంత్రులకు నోటీసులు వస్తున్నాయంటే ‘సర్‌’ ఎంత గుడ్డిగా, మూర్ఖంగా వ్యవహరిస్తుందో అందరికీ అర్థమవుతుంది. ప్రజాస్వామ్యానికి విశ్వగురువు అని చెప్పుకుంటున్న ఈ భారతదేశంలో సర్‌ ‌వ్యవహారాన్ని చూసి కొందరు నవ్వుకుంటున్నారు. కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరు ఇదేం గొడవరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ పరిశీలకులు మాత్రం ఇది ‘పకడ్బంధీగా జరుగుతున్న ఓట్ల చోరీ కుట్ర’గా విమర్శిస్తున్నారు. ఢిల్లీలో 53.73 శాతం, చండీగఢ్‌‌లో 52.58 శాతం ఓట్లు గల్లంతయ్యాయి. ఆ తర్వాత మూడో స్థానం మన తెలంగాణాది. సగానికి సగం 48.90 శాతం మన ఓట్లు గల్లంతు అవుతున్నాయి. సర్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో.. అర్హత వున్నవాళ్ల ఓట్లు ఎలా గల్లంతు చేస్తుందో, ఊరు పేరు లేని వారికి తప్పుడు మార్గంలో ఎలా ఓట్లు ఇస్తుందో రాహుల్‌‌గాంధీ పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రోగ్రాంతో రుజువు చేసినా మీ బీజేపీ నేతలకు సిగ్గూఎగ్గూ లేదు. దున్నపోతు మీద వాన కురిసినట్టు ఎన్నికల కమిషన్‌ ‌వ్యవహరిస్తుంది.
జుట్టుపోలుగాడు : ఇంతకీ ఏమంటావురా..?
కేతిగాడు : ఏం అనేది ఏముంది? ఈ దేశంలోని ప్రజలందరూ పన్నులు కడ్తున్నారు. తల్లి గర్భం నుండే ఆ పన్నులమోత ప్రతి పౌరుడిపై పడుతున్నది. ఆ తల్లులు తినే ఆహారం, మందులపై సర్కారుకు పన్నులు చెల్లిస్తున్నాం. పెరిగి పెద్ద అవుతున్నాం. ప్రతి సందర్భంలో పన్నుల మోత మనకు తప్పడం లేదు. కానీ ఓటెయ్యడానికి వెళ్తే నీకు ఓటు లేదు, నీవు ఈ దేశం ఓటరువే కాదంటే ఎలా? నేను కట్టే పన్నులతోనే సర్కారు నడుస్తుంది. నాకు మాత్రం సర్కారును ఎన్నుకునే ఓటు హక్కు వుండదా? ఇదేం న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం? గతంలో షారూఖ్‌‌ఖాన్‌ ‌సినిమా ఒకటి వచ్చింది. ‘మై నేమ్‌ ఈజ్‌ ‌ఖాన్‌ - ఐ యామ్‌ ‌నాట్‌ ‌టెర్రరిస్ట్‌’. అలా ‘ఐ యామ్‌ ‌టాక్స్‌ ‌పేయర్‌. బట్‌ ‌నాట్‌ ఓటర్‌’.

బంగారక్క : ఇలాంటి వాళ్లు కోట్లల్లో వున్నారంటే, కోట్లమందిని ఓట్ల కోసం ఇలా ఇబ్బంది పెడ్తున్నారంటే.. ఇదో పెద్ద కుట్ర అని వేరే చెప్పక్కర్లా. పన్ను కట్టండి, పౌరులు కారంటే ఎలా? పౌరుడంటేనే ఓటరు. ప్రజాస్వామ్యం ఇలా తిరగబడుతుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. చివరకు ఎన్నికల కమిషన్‌లోనే ‘సర్‌’ పై తిరుగుబాటు వచ్చింది. ప్రతిదానికి ‘ఆధార్‌’ చెల్లుబడి అవుతున్నప్పుడు ఓట్ల జాబితాకి ఎందుకు చెల్లుబాటు కాదు. ఓట్ల చోరీతో, సీట్ల చోరీతో ఎ.వి.ఎం. మిషన్‌‌ల తప్పుడు భాగోతాలతో పబ్బం గడపొచ్చు అని భ్రమపడ్తున్నారు బీజేపీ పాలకులు. శాశ్వత అధికారం కోసం వాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ప్రజల అనుభవాలతో, ఆలోచనలతో ప్రజా ఉద్యమాలు పరవళ్లు తొక్కుతాయనే సత్యాన్ని మరుస్తున్నారు. నడుస్తున్న జెన్‌ ‌జీ ఉద్యమమే పెద్ద ఉదాహరణ. ఈ దేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఈ దేశ ప్రజలకు, యువతకు తప్పకుండా వుంటుంది.

కె.శాంతారావు, 99597 45723

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్