Magazines

ప్రశ్నించే కలాలు.. గళాలు

1 గంట క్రితం

Questioning pens... and voices.
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 4 నిమిషాల చదవడం

రితికా చోప్రా... ఈ పేరు ఇప్పుడు భారతీయ జర్నలిజంలో చర్చకు వచ్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌‌లో ఆమె నేతృత్వంలో వెలువడిన తాజా పరిశోధనాత్మక కథనాలు భారత ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలపై తీవ్రమైన ప్రశ్నలను ప్రజల ముందుంచాయి. ఎన్నికల సంఘంలోని ముగ్గురిలో సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అనే ఇద్దరు సభ్యులు గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో నిర్ణయాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆ దర్యాప్తు వెల్లడించింది. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఓటర్ల డేటాబేస్‌పై నియంత్రణ, ఎన్నికల సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంశాలపై ఆ అభ్యంతరాలు ఉన్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అంతర్గత పత్రాలను పరిశీలించి వెల్లడించింది.


ఇది ఒక్క సంచలన కథనం కాదు. రితికా చోప్రా దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాలు, ప్రభుత్వ పాలన, ప్రజా విధానాలు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై దృష్టి కేంద్రీకరించిన జర్నలిస్టు. కోల్‌కతాలో పుట్టిన ఆమె 2006లో హిందుస్తాన్ టైమ్స్‌‌లో ఇంటర్న్‌గా జర్నలిజం ప్రారంభించారు. తర్వాత మైల్ టుడే, ది ఎకనామిక్ టైమ్స్ రాజకీయ బ్యూరోలో పనిచేశారు. 2015లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌‌లో చేరారు. అక్కడ జాతీయ విద్యా సంపాదకురాలిగా, ప్రభుత్వ వ్యవహారాల జాతీయ బ్యూరో చీఫ్‌గా, జాతీయ విద్యా ఎడిటర్‌గా పనిచేసి ప్రస్తుతం ముంబై రెసిడెంట్ ఎడిటర్‌గా ఉన్నారు.


పలు అవార్డులు అందుకున్న జర్నలిస్టు

రితికాకు వచ్చిన అవార్డుల జాబితా కూడా ఆమె జర్నలిజం విస్తృతిని తెలియజేస్తుంది. 2021లో రాజకీయాలు, ప్రభుత్వంపై రిపోర్టింగ్‌కు రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు పొందారు. 2022లో ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా అవార్డ్‌ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం లభించింది. 2024లో గ్రీష్మా కుతార్‌తో కలిసి చామేలీ దేవి జైన్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు హర్యానా పంచాయతీ ఎన్నికల్లో నిరక్షరాస్యుల పోటీపై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని పరిశీలించిన కథనానికి యూఎన్‌ఎఫ్‌పీఏ–లాడ్లీ మీడియా అవార్డు, ఇంజినీరింగ్ విద్య నాణ్యతపై ‘డీవాల్యూడ్ డిగ్రీ’ సిరీస్‌కు ఏసీజే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అవార్డ్స్‌లో ప్రత్యేక ప్రస్తావన లభించాయి. ది ఎకనామిక్ టైమ్స్‌‌లో పనిచేసిన సమయంలో కూడా ఆమెకు రెండు వర్డ్‌స్మిత్ అవార్డులు లభించాయి.


వ్యవస్థ లోపల ఏం జరుగుతుంది?

రితికా చోప్రా ప్రత్యేకత ఏమిటంటే.. రాజకీయ నాయకుల ప్రకటనలను మాత్రమే వార్తలుగా మార్చడం కాదు. అధికార వ్యవస్థ లోపల ఏం జరుగుతుందో పత్రాలు, అధికారిక రికార్డులు, నిర్ణయ ప్రక్రియలను అనుసరించి వెలికి తీయడం. ఎన్నికల సంఘంపై ఆమె గత పరిశోధనలకు 2021 రామ్‌నాథ్ గోయెంకా అవార్డు రావడమే దీనికి ఉదాహరణ. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పని తీరు, మోడల్ కోడ్ ఉల్లంఘనలపై చర్యల్లో కనిపించిన ఆలస్యం, కమిషన్‌లోని విభేదాలపై ఆమె చేసిన ప్రత్యేక కథనాలకు ఐపీఐ అవార్డు లభించింది. తాజా దర్యాప్తులో కూడా అదే పద్ధతి కనిపిస్తుంది. ‘ఫాం -6’ లో కొత్త ఓటర్ల నుంచి తల్లిదండ్రులు, తాతముత్తాతల వివరాలకు సంబంధించిన కొత్త ప్రకటనను చేర్చడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అంతర్గత రికార్డులను ఆధారంగా చేసుకుని ఆమె వెల్లడించారు. మరో కథనంలో ఓటర్ల జాబితా నిర్వహణకు ఉపయోగించే ‘ఈసీఐ- నెట్’ సాఫ్ట్‌వేర్, దాని కేంద్రీకృత నియంత్రణపై కమిషనర్ల ఆందోళనలను వెలుగులోకి తెచ్చారు. గోవాలో సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన ఓటర్లు జాబితాలోకి రాలేకపోయిన ఘటనను కూడా ఆమె పరిశీలించారు.


అడుగడుగునా అడ్డంకులెదురైనా

తెలుగు జర్నలిజంలో సీనియర్ జర్నలిస్టు సి.వనజ ప్రయాణం కూడా మహిళా జర్నలిస్టులు ఎదుర్కొన్న అడ్డంకులకు ఒక ఉదాహరణ. రాజకీయ రిపోర్టింగ్‌లో మహిళలకు అవకాశాలు పరిమితంగా ఉన్న కాలంలో ఆమె ఆ రంగంలోకి వచ్చారు. అసెంబ్లీ, రాజకీయ పరిణామాలపై రిపోర్టింగ్ చేస్తూ తన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. దండకారణ్యంలో మావోయిస్టుల ‘జనతన సర్కార్‌’ పై చేసిన రిపోర్టింగ్‌కు రామ్‌నాథ్ గోయెంకా అవార్డు రావడం ఆమె పరిశోధనాత్మక జర్నలిజానికి గుర్తింపు. అలాగే తులసీ చందు.. సంప్రదాయ మీడియా నుంచి డిజిటల్ జర్నలిజం వైపు వచ్చిన మరో ముఖ్యమైన ఉదాహరణ. రాజకీయాలు, మత సామరస్యం, అవినీతి, సామాజిక సమస్యలపై ఆమె స్వతంత్రంగా వీడియో విశ్లేషణలు చేస్తూ పెద్ద ప్రేక్షక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. అదే సమయంలో ఆన్‌లైన్‌లో తీవ్రమైన వేధింపులు, బెదిరింపులను ఎదుర్కొన్నట్లు మీడియా సంస్థలు నమోదు చేశాయి. ఆమెకు లాడ్లీ మీడియా అవార్డులు పలుమార్లు లభించాయి.


పరిశోధాత్మక కథనాలతో...

జాతీయ స్థాయిలో సుచేతా దలాల్.. ఆర్థిక, పరిశోధనాత్మక జర్నలిజానికి చిరస్మరణీయమైన పేరు. 1992 హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుల్లో ఆమె ఒకరు. ఆర్థిక రంగంలోని సంక్లిష్టమైన మోసాలను సాధారణ పాఠకుడికి అర్థమయ్యే భాషలో వివరించడం ఆమె ప్రత్యేకత. రిటు సరిన్ అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జర్నలిజంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన మరో పేరు. పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్, ఫిన్‌సెన్ ఫైల్స్, పాండోరా పేపర్స్ వంటి అంతర్జాతీయ దర్యాప్తుల్లో ఆమె భాగస్వామ్యం ఉంది. నేహా దీక్షిత్ లింగం, సామాజిక న్యాయం, మానవ హక్కులు, రాజకీయాలు వంటి అంశాలపై దీర్ఘకాలిక పరిశోధనాత్మక కథనాలు చేశారు. బర్కా దత్ కార్గిల్ యుద్ధం నుంచి సంఘర్షణ ప్రాంతాలు, విపత్తులు, రాజకీయాల వరకు ఫీల్డ్ రిపోర్టింగ్‌కు గుర్తింపు పొందారు. ధన్యా రాజేంద్రన్ ది న్యూస్ మినిట్ వ్యవస్థాపక సంపాదకురాలిగా డిజిటల్ జర్నలిజంలో మహిళా నాయకత్వానికి ఉదాహరణగా నిలిచారు. సుప్రియా శర్మ సామాజిక, మానవహక్కుల అంశాలను పరిశోధనాత్మకంగా రిపోర్ట్ చేశారు. చామేలీ దేవి జైన్ అవార్డు అనేక మంది మహిళా జర్నలిస్టుల కృషిని గుర్తించింది.


ప్రశ్నించే గొంతులు

రాజకీయ విశ్లేషణ రంగంలో నీరజా చౌదరి ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. దశాబ్దాలుగా ప్రధానమంత్రులు, రాజకీయ పార్టీలు, అధికార కేంద్రాల నిర్ణయ ప్రక్రియను విశ్లేషించిన ఆమె రచనలు భారత రాజకీయాల అంతర్గత స్వభా వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ తాయి. సెవంతి నినన్, నిరుపమా సుబ్రమణియన్, అర్ఫా ఖానుమ్ షెర్వాని, రోహిణి మోహన్, ప్రియాంక దూబే వంటి మహిళా జర్నలిస్టులు కూడా రాజకీయాలు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఘర్షణలు, పౌర హక్కులపై తమదైన ముద్ర వేశారు. ఈ మహిళలందరిలోనూ ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది.. అదే ప్రశ్నిం చడం. అధికారంలో ఉన్నవారిని మాత్రమే కాదు, అధికారాన్ని నియంత్రించే సంస్థలను కూడా ప్రశ్నించడం. అయితే మహిళా జర్నలిజం విజయాలను కేవలం వ్యక్తిగత ధైర్యానికి పరిమితం చేయకూడదు. లింగ వివక్ష, కార్యాలయ అసమానత, ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు, ఉద్యోగ భద్రత, స్వతంత్ర జర్నలిజానికి ఆర్థిక పరిమితులు వంటి సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి.


ప్రశ్నలతో పరిశీలించే సామర్థ్యం

రితికా చోప్రా తాజా దర్యాప్తు ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె కథనం లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం తన అధికారిక స్పందనలో 14 నోట్ల ఉనికి, తేదీలు, విషయాలను ఖండించలేదు. అయితే వాటిని ‘సూచనలు’గా పేర్కొంటూ గత ఏడాది నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని తెలిపింది. అంటే కథనం వెలుగులోకి తెచ్చిన పత్రాలు ఒకవైపు, వాటిపై ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ మరో వైపు ఉన్నాయి. ఈ రెండింటినీ ప్రజలు పరిశీలిం చడం, సంబంధిత సంస్థలు స్పష్టమైన సమాధా నాలు ఇవ్వడం ప్రజాస్వామ్య పారదర్శ కతకు అవసరం. అందుకే మహిళా జర్నలిజం అంటే కేవలం మహిళల సమస్యలపై రాయడం కాదు. దేశంలోని అత్యంత శక్తివంతమైన సంస్థ లను కూడా పత్రాలతో, ఆధారాలతో, ప్రశ్నలతో పరిశీ లించే సామర్థ్యం. రిటికా చోప్రా తాజా దర్యా ప్తు ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. వనజ నుంచి తులసీ చందు వరకు, సుచేతా దలాల్ నుంచి రిటు సరిన్ వరకు, నేహా దీక్షిత్ నుంచి నీరజా చౌదరి వరకు సాగిన ఈ ప్రయాణం భారత జర్నలిజంలో మహిళల పాత్రను ‘వార్తలు చెప్పేవారు’ అనే స్థాయి నుంచి ‘అధికారా న్ని ప్రశ్నించే ప్రజాస్వామ్య కాపలాదారులు’ అనే విస్తృత స్థాయికి తీసుకెళ్లిన పరిణామాన్ని చూపిస్తుంది.

- డాక్టర్‌. కోలాహలం రామ్ కిశోర్.
9849328496


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్