ప్రాణహిత అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి
రాష్ర్ట మంత్రి వర్గంలో చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే జీహెచ్‌ఎంసీతో పాటు పెండిండ్‌లో ఉన్న వరంగల్, ఖమ్మం మొదలగు కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించాలని రాష్ర్ట మంత్రి వర్గం నిర్ణయించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఓట్ల తొలగింపును క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీఎల్‌ఏలు మరింత చురుగ్గా సర్ ప్రక్రియలో పాల్గొనాలని, ఆ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇదే విషయమైన రేవంత్ రెడ్డి... తన మంత్రివర్గ సహచరులతో సమాలోచనలు చేశారు. దీంతోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లకు పెంచేందుకు వీలుగా మహారాష్ర్టను ఒప్పించేందుకు మరోసారి ఆ రాష్ర్టంతో సమావేశం నిర్వహించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ విషయమై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరపాలని సీఎం నిర్ణయించారు.







కామెంట్‌లు (0)