Magazines

ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్‌‌ జడ్జితో 
విచారణకు సిద్ధమా?

52 నిమిషాల క్రితం

inquiry
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం

అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, బీజేపీ

మూడేండ్లయినా 
ఆరు గ్యారెంటీల అమలేదీ?
మోడీ చెప్పినట్టు రైతుల ఆదాయం రెట్టింపయ్యిందా!

రేవంత్‌‌రెడ్డి నల్లమల పులి కాదు... చంద్రబాబు పిల్లి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

బీఆర్‌ఎస్‌‌లో చేరిన కాంగ్రెస్,
 బీజేపీ నాయకులు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అడ్డగోలుగా హామీలిచ్చి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె తారక రామారావు (కేటీఆర్‌) ‌విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు మూడేండ్లయినా అమలు కాలేదన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి నల్లమల పులి కాదనీ, చంద్రబాబు దగ్గర పిల్లి అని ఎద్దేవా చేశారు. తన ఆస్తులు, ఆయన ‌కుటుంబ ఆస్తులపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు సిద్ధమా? అని ముఖ్యమంత్రికి సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోడీ ప్రకటించారనీ, 2026 వచ్చినా వారి ఆదాయం రెట్టింపు అయ్యిందా?అని ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఆరు గంటలు కూడా కరెంటు రావడం లేదని అన్నదాతలు గోస పడుతున్నారని చెప్పారు. రైతుబంధు రావడం లేదనీ, యూరియా దొరకడం లేదనీ, నీళ్లు వస్తలేవని ఆవేదన వ్యక్తం చేశారు.


పాత రోజులు తెచ్చిన కాంగ్రెస్‌
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి “వెనకటి రోజులు మళ్లీ తెస్తా” అని చెప్పారనీ, ఇప్పుడు సాగునీరు లేని రోజులు, కరెంట్ రాని రోజులు తిరిగి తెచ్చారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు మోసం చేసేవాళ్లనే నమ్ముతారని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కమిషన్‌ వేశార‌నీ, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేశారనీ, ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంపై కేసులు పెట్టారనీ, బ్యాంకు ఖాతాల వ్యవహారాలపై విచారణ జరిపారనీ, అయితే వీటి నుంచి ఏమి తేల్చారని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఈ అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.


చేనేత కార్మికుల సమస్యలపై స్పందనేది?
సిరిసిల్ల పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చేనేత కార్మికుల సమస్యలపై స్పందించకుండానే వెళ్లారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్లలో పలువురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, విద్యార్థుల స్కూల్ యూనిఫాం ఆర్డర్లు నిలిచిపోయాయని వివరించారు. నేతన్న బీమా పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారనీ, నేతన్న బీమాపై ప్రకటన చేస్తారని ఆశించినా సీఎం వాటి గురించి ప్రస్తావించలేదని అన్నారు. ఇంకోవైపు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పర్యటించారని విమర్శించారు. అక్కడ పోలీసులు తప్ప ప్రజలు లేరని చెప్పారు.


హోటల్‌ ‌గురించి అఫిడవిట్‌‌లో చెప్పా
తాను చదువుకుని అమెరికాలో ఆరేండ్లు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో రాజశేఖర్‌‌రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో హోటల్ వ్యాపారం ప్రారంభించానని కేటీఆర్‌ అన్నారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, వ్యాపార వివరాలను స్పష్టంగా వెల్లడించానని గుర్తు చేశారు. తాను అఫిడవిట్‌లో చెప్పిన విషయాన్నే సీఎం రేవంత్‌‌రెడ్డి మళ్లీ ప్రస్తావించారని అన్నారు. వ్యాపారం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు.


అంబేద్కర్‌ అభయహస్తం అమలేదీ?
మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మూడేండ్లలో ఎన్ని హామీలు అమలు చేశారని కేటీఆర్‌ అడిగారు. తాము దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తే, అంబేద్కర్‌ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి ఎన్ని నిధులు కేటాయించారని నిలదీశారు. మైనార్టీలకు రూ.నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు. ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌ల పరిస్థితి ఏంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.


దేశంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు వచ్చిందా?
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్, ప్రతి ఇంటికి నల్లా, ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వంటి హామీల పరిస్థితి ఏంటని నిలదీశారు. అన్ని వర్గాలకూ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్