తరచూ ప్రమాదాలు.. ఇప్పటివరకు 9 మంది మృతి
వాహనాల స్పీడ్‌కు అడ్డుకట్ట ఏది?
కానరాని స్పీడ్ గన్లు, రాడార్ కెమెరాలు
పూర్తికాని ధంసలాపురం ఆర్వోబీ పనులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రయాణ కష్టాలను తీరుస్తూ హైదరాబాద్-వైజాగ్ మార్గంలో దూరం, సమయాన్ని ఆదా చేసే ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే.. ప్రారంభమైన కొద్ది నెలల్లోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేగం, నిర్లక్ష్యం, అసంపూర్తి పనుల వల్ల వాహనదారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గత ఐదు నెలల వ్యవధిలోనే ఈ 165 కిలోమీటర్ల పరిధిలో సుమారు 15 ప్రధాన రహదారి ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ దుర్ఘటనల్లో ఇప్పటివరకు తొమ్మిది మంది తమ ప్రాణాలను కోల్పోగా, మరో పది మందికి పైగా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఒక నిత్య ప్రమాద నిలయంగా మిగిలిపోయే ముప్పు ఉంటుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులకు సుదీర్ఘకాల నిరీక్షణ తర్వాత లభించిన గొప్ప వరం ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్ 365). తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో ఉన్న దేవరపల్లి వరకు సుమారు 165 కిలోమీటర్ల మేర నిర్మితమైన ఈ నాలుగు వరుసల రహదారి రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ నూతన రహదారి అందుబాటులోకి రావడంతో వైజాగ్, రాజమండ్రి వెళ్లే వాహనదారులకు మైలేజీ పరంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయంలో ఏకంగా రెండు గంటల సమయం ఆదా అవుతోంది. వ్యాపార, పర్యాటక, అత్యవసర ప్రయాణాలకు ఈ మార్గం అత్యంత అనుకూలంగా మారడంతో ప్రారంభమైన నాటి నుంచే వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి.
వాహనాల స్పీడ్‌కు అడ్డుకట్ట లేదు
ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణాలు.. అందులో వాహనదారుల అతివేగం, అధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైవేపై కార్లకు గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్లు, భారీ లారీలకు 80 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించినప్పటికీ, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే నాథుడే కరువయ్యాడు. నిర్ణీత పరిమితికి మించి గంటకు 120 నుండి 150 కిలోమీటర్ల ఆకాశాన్నంటే వేగంతో వాహనాలు దూసుకెళ్తున్నా అడ్డుకట్ట వేసేందుకు స్పీడ్ గన్లు గానీ, రాడార్ కెమెరాలు గానీ ఏర్పాటు చేయలేదు. నేషనల్ హైవే అధికారులు లేదా ట్రాఫిక్ పోలీసులు కనీస పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతో డ్రైవర్లు స్వేచ్ఛగా నియమాలు ఉల్లంఘిస్తున్నారు. వేగాన్ని నియంత్రించే సాంకేతిక వ్యవస్థలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు కొరవడటంతో చిన్నపాటి పొరపాటు కూడా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
పనులు పూర్తికాకుండానే హైవే ప్రారంభం
రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే తొందరపడి ప్రారంభించడం కూడా ఈ దుస్థితికి మూలకారణంగా నిలుస్తోంది. దాదాపు 90 శాతం పనులు పూర్తయినప్పటికీ, మిగిలిన 10 శాతం కీలకమైన నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు దంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణం ఒకవైపు మాత్రమే పూర్తయింది. రెండో వైపు పనులు ఇంకా జరుగుతుండటంతో ఒకే వంతెనపై రెండు వైపుల వాహనాలను అనుమతించాల్సి వస్తోంది. ఇక్కడ వన్ వే ట్రాఫిక్‌ను దారి మళ్లించడం వల్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తీవ్ర అయోమయం నెలకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పలు కీలక కూడళ్ల వద్ద నిష్క్రమణ (ఎగ్జిట్) రోడ్లు, అండర్ పాస్‌లు పూర్తి కాకపోవడం, సైన్ బోర్డులు లేకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది.
ప్రమాదాలను నియంత్రించే చర్యలు చేపట్టాలి
రాబోయే రోజుల్లో రవాణా సాఫీగా సాగాలన్నా, ప్రజల్లో విశ్వాసం కలగాలన్నా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), రవాణా శాఖ, పోలీస్ యంత్రాంగం తక్షణమే సంయుక్త కార్యాచరణ ప్రకటించాలి. నిరంతర పెట్రోలింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలి. దంసలాపురం ఆర్‌ఓబీతో పాటు పెండింగ్‌లో ఉన్న 10 శాతం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
హైవే నిర్మాణంలోనూ లోపాలు
ఇంజినీరింగ్ లోపాలు, అక్రమ పార్కింగ్ విధానాలు కూడా ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయి. తల్లంపాడు నుంచి దేవరపల్లి వరకు కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో రహదారి వెడల్పు అకస్మా త్తుగా తగ్గిపోవడం (కన్జెక్షన్) వల్ల వేగంగా వచ్చే వాహనదారులు కంగారు పడుతున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో ఒక వాహనం నిలిచిపోతే, పక్క నుంచి సురక్షితంగా వెళ్లేందుకు తగినంత స్థలం లేకపోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. ఎలాంటి ప్రాథమిక హెచ్చరిక లైట్లు లేదా రిఫ్లెక్టర్లు లేకుండా దట్టమైన చీకట్లో నిలిపేస్తున్న ఈ లారీలను వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు గమనించలేక తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నాయి.






కామెంట్‌లు (0)