ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆరు ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బొల్లె జగదీశ్వర్
రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆరు ఉమ్మడి జిల్లాల నేతలతో దశల వారీగా సమావేశమయ్యారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సంద ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకమని అన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేయాలని సూచించారు. నమోదుకు సంబంధించి పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు.
నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్
విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా ఉన్నదని కేటీఆర్ అన్నారు. వారు రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను గమనిస్తున్నార ని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ద్రోహం చేసిందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని హెచ్చరించారు. ఆ వ్యతిరేకత బీఆర్‌ఎస్‌కు అనుకూల ఓటుగా మారేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
సమన్వయంతో పనిచేయాలి
రెండు రోజుల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశమవుతామని కేటీఆర్ అన్నారు. ఆయా జిల్లాల నేతలతో విడివిడిగా భేటీ అయి ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.
పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా బాధ్యతలు, కార్యాచర ణపై దిశానిర్దేశం చేస్తామని వివరించారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పరిధిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు.
ఈసారి పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అభ్యర్థి ఎవరైనా ఎన్నిక పార్టీ గుర్తుపైనే జరుగుతుందనీ, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)