Magazines

జనాభా లెక్కల్లో వికలాంగుల వివరాలు నమోదు చేయాలి

45 నిమిషాల క్రితం

ఎం.అడివయ్య డి
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
కోఠిలోని సెన్సెస్‌ డైరెక్టరేట్‌ ఎదుట వికలాంగుల ధర్నా
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యాలు కలిగిన వికలాంగుల వివరాలను నమోదు చేయాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కోఠిలోని కేంద్రీయ సదన్‌లో ఉన్న సెన్సెస్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట వికలాంగులతో కలిసి ధర్నా నిర్వహించారు. వికలాంగుల హక్కులను కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సెన్సెస్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 వికలాంగుల హక్కుల చట్టం 21 రకాల వైకల్యాలను అధికారికంగా గుర్తించిందని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏడు రకాల వైకల్యాల ఆధారంగా దేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉన్నట్టు నమోదైందన్నారు. 2016 చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ఆధారంగా లెక్కలు సేకరిస్తే వికలాంగుల జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే 2027 జనాభా లెక్కల్లో కేవలం తొమ్మిది రకాల వైకల్యాల వివరాలను మాత్రమే నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అంధత్వం, వినికిడి వైకల్యం, మాట సంబంధిత వైకల్యం, శారీరక వైకల్యం, మేధో వైకల్యం, మానసిక వైకల్యం, యాసిడ్‌ దాడి బాధితులు, దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధులు, రక్త సంబంధిత రుగ్మతలు ఉన్నవారి వివరాలను మాత్రమే నమోదు చేయడం వల్ల మిగిలిన వారు లెక్కల్లోకి రాకుండా పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటిజం, నిర్దిష్ట అభ్యాసన వైకల్యాలు, మరుగుజ్జుతనం, కుష్టువ్యాధి నుంచి కోలుకున్నవారు, చెవిటి-అంధులు, బహుళ వైకల్యాలు కలిగినవారి వివరాలను కూడా నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని రకాల రక్త సంబంధిత రుగ్మతలను ఒకే విధంగా లెక్కించడం వల్ల ఆయా గ్రూపుల వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రావని చెప్పారు. వికలాంగుల వివరాలను సమగ్రంగా సేకరించకపోతే విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, పునరావాసం, సామాజిక భద్రతతో పాటు వారికి అందే వివిధ ప్రభుత్వ సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. తెలంగాణలో 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 10,48,822 మంది వికలాంగులు ఉన్నట్టు నమోదైందన్నారు. డిసేబిలిటీ స్టడీస్‌ రిపోర్ట్‌ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో చేపట్టే జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వికలాంగుల వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌, రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కె.నాగలక్ష్మి, రాజు, పి.బాలేశ్వర్‌, వికలాంగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్