పౌర సమాజం వ్యవస్థలను కాపాడుకోవాలి
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వేదిక ఏర్పాటు సందర్భంగా వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యాంగ విలువల్ని కాపాడేందుతకు తమ వంతు కృషి చేస్తామని పలువురు వక్తలు ప్రకటించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకునేందుకు పౌరసమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వేదిక ఆవిర్భవించింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎం.కోదండరాం, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ, సామాజిక వేత్త డాక్టర్ గోపాల్‌రెడ్డి, న్యాయవాది జ్యోతి కిరణ్, పాలసీ రీసెర్చర్ బత్తిని దీప్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రస్తుత పాలకులు ప్రజాస్వామ్యం నచ్చట్లేదనీ, అందుకు దాన్ని విచ్ఛిన్నం చేసే పనులకు పూనుకుంటున్నారని విమర్శించారు. అందులో భాగంగానే రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థలపై ఒక క్రమ పద్ధతిలో నిర్వీర్యం చేస్తూ పోతున్నారనీ, అదే సమయంలో ప్రజలకు వాటిపై విశ్వాసం కోల్పోయేలా చేస్తున్నారని ఎండగట్టారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలేవీ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఎత్తిచూపారు. పాలనలో ఫాసిస్టు లక్షణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ పనితీరులో పారదర్శకత లోపించిందనీ, ఎలాంటి లెక్కాపత్రాలు లేకుండా లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతరత్న అవార్డులు పొందినవారు...దేశంలోనే ప్రసిద్ధి పొందిన మేధావులు...సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు కూడా ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన దౌర్భాగ్యమేంటని ప్రశ్నించారు. పాలకుల విధానాలను ప్రశ్నించేలా ప్రజల్ని చైతన్యపరిచేందుకు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వేదిక పనిచేస్తుందని హామీనిచ్చారు. విద్యా, వైద్యం, ప్రజా సంక్షేమం, తాజా పరిస్థితులపై నిరంతరం చర్చలు జరపడంతో పాటు ప్రజాసమస్యలపై పాలకులను నిలదీసేందుకు పౌరసమాజం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం ఈ వేదిక ద్వారా నిరంతరం పోరాడుతామని ప్రకటించారు.





కామెంట్‌లు (0)