ఖమ్మంలో ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభల సందర్భంగా బహిరంగ సభ
కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలి
స్వామినాథన్ కమిషన్ అమలు చేయకపోవడంతో రైతులకు
ఏటా రూ.3 లక్షల కోట్ల నష్టం : ఏఐకేఎంఎస్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి
డాక్టర్ ఆశిష్ మిట్టల్, అధ్యక్షులు వేములపల్లి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత వ్యవసాయ రంగానికి ఉరితాళ్లుగా మారుతున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ మజ్జూర్ సభ (ఏఐకేఎంఎస్) జాతీయ 4వ మహాసభల సందర్భంగా సోమవారం సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత వ్యవసాయాన్ని బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టేలా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పాదకాలపై కార్పొరేట్ ఆధిపత్యం పెరిగిపోవడం వల్ల విత్తనాలు, ఎరువులు, విద్యుత్, యంత్రాల ధరలు ఆకాశాన్నంటాయని ఆరోపించారు. మార్కెట్లపై కంపెనీల పెత్తనం పెరగడం వల్ల పంటలకు సరైన ధర రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో గ్రామీణ పేదలు, దళితులు, ఆదివాసీల భూములను ఆక్రమించడం, బలవంతంగా నిర్వాసితులను చేయడం, ఆదివాసీల అటవీ హక్కులపై దాడులు చేయడం నిత్యకృత్యంగా మారిందని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతు కూలీల ఐక్యత, సుదీర్ఘ పోరాట త్యాగాల ఫలితంగానే కేంద్రం దిగొచ్చి ఆ చట్టాలను ఉపసంహరించుకుందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు రియల్ ఎస్టేట్, భారీ గనుల తవ్వకాలు, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, భారీ ఆనకట్టల పేరుతో భూమి, నీరు, అడవులను దోచుకుంటున్నాయని అన్నారు. వీటికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కార్పొరేట్ విధానాలపై ఐక్య పోరాటాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల భారత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని రక్షించుకోవడానికి దేశంలోని రైతు సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పూర్తిగా తుంగలో తొక్కిందని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయకుండా రైతాంగానికి తీవ్ర ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల దేశవ్యాప్తంగా రైతాంగం ప్రతి సంవత్సరం రూ. 3 లక్షల కోట్లు నష్టపోతోందని గణాంకాలతో వివరించారు. గ్రామీణ పేదలకు జీవనోపాధిగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో వీబీ గ్రామ్ జీని ప్రవేశపెట్టారని ఆరోపించారు. అనంతరం అమరుడైన నాగన్న కుమారుడు పరకాల అజయ్ ఆలపించిన ఉద్యమ పాటల ఆడియో సీడీని ఆవిష్కరించారు. రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సభలో ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు నిర్భయ్ సింగ్, సుశాంత్ ఝా, వి. కోటేశ్వర రావు, వై.వి. చలపతి రావు, మండల వెంకన్న, బండారు ఐలయ్య, బిక్షపతి,, చిట్టిపాటి వెంకటేశ్వర్లు,, సెల్వరాసు, స్టాలిన్, శంభు ప్రసాద్, ధర్మపాల్, కేదార్ సభార్, డెబ్జిజిత్, రాబిన్, తదితర జాతీయ, రాష్ట్ర నాయకులు, రైతులు పాల్గొన్నారు.
వేములపల్లి వెంకట్రామయ్య
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి
50 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)