Magazines

మత్స్యశాఖ అవినీతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి

46 నిమిషాల క్రితం

టీఎంకేఎంకేఎస్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

ఆ సొమ్ము రికవరీ చేయండి : మంత్రి వాకిటి శ్రీహరి, సీఎస్‌‌కు టీఎంకేఎంకేఎస్‌ ‌బృందం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మత్స్యశాఖలో జరుగుతున్న అవినీతిపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్‌) ‌కోరింది. అవినీతి, పథకాల అమలు, నిధుల దుర్వినియోగం, మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికలు, పరిపాలనా సమస్యలు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేసింది. ఈమేరకు బుధవారం పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొరెంకల నర్సింహ, లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు తడబోయిన కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని బృందం వినతిపత్రం అందజేసింది. ‘మత్స్య శాఖలో కొన్నేండ్లుగా వివిధ పథకాల కింద నిధుల వినియోగం, అవినీతి, అక్రమాలు, చెరువులు, నీటి వనరుల లీజులు, చేపల విక్రయ వాహనాలకు సంబంధించిన టెండర్లు, పెండింగ్‌లో ఉన్న విచారణలు, ఫిర్యాదులు, మత్స్యశాఖ ఆస్తుల రక్షణ, నిబంధనలను పక్కనపెట్టి అనర్హులకు పదోన్నతులు కల్పించడం, చేప పిల్లల టెండర్లు, కొనుగోళ్లు, సరఫరాదారుల ఎంపిక, చేప పిల్లల ధరలు, నాణ్యత, పరిమాణం, చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసే ప్రక్రియను పర్యవేక్షించడం వంటి అనేక అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయి ’ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (2018 -2026) నుంచి తెలంగాణ మత్స్యశాఖకు ఐఎఫ్‌‌డీఎస్‌, ఆర్‌‌కేవీవై, బీఆర్‌ఎస్‌, పీఎంఎస్‌ఎస్‌‌వైతోపాటు ఉచిత చేప పిల్లల పథకం కింద సుమారు రెండువేల కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న 33,456 నీటి వనరుల ద్వారా మత్స్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ. 229 కోట్ల వార్షిక ఆదాయం సమకూరుస్తుందని పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లోని మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది చెరువులు, కుంటలకు సంబంధించిన లీజు మొత్తాలను అధికారిక ప్రభుత్వ ఖాతాల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారా? లేదా? అనే విషయాన్ని విచారించాలని కోరారు. ఆ నిధులను కొన్ని జిల్లాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారా? అనే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. మత్స్యకారుల అభివృద్ధి కేవలం కాగితాలపై కనిపించకుండా, వారి నిజ జీవితాల్లో కూడా ప్రతి ఫలించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్