పత్తి, వరికి నీటిగండం...ఇతర పంటలదీ అదే పరిస్థితి
వరి దిగుబడి భారిగా తగ్గే అవకాశాలున్నాయన్న శాస్త్రవేత్తలు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
రిజర్వాయర్లల్లోనూ అంతంత మాత్రంగా నీరు
రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో కరవు ఛాయలు
అప్పుల ఊబిలో రైతన్న.. ఆదరణ కోసం ఎదురుచూపులు
పలు ప్రాంతాల్లో నవతెలంగాణ పరిశీలన
ఆశల సాగులో ఆకాశం వైపు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతన్న గుండె ఇప్పుడు బీటలు వారిన నేలలా మారిపోయింది. పసిడి పంటలు పండాల్సిన పొలాల్లో ఎండిపోయిన పైర్లను చూస్తూ, కంటిపాపలా కాపాడుకున్న చేలను కన్నీళ్లతో తడుపుతున్న దృశ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో గుండెలను పిండేస్తున్నాయి. ‘ఎల్‌నినో’ రక్కసి విసిరిన కరువు విపత్తుకు లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి, పెసర పైర్లు నిలువునా మాడిపోతుంటే అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్నారు. అప్పులు తెచ్చి పోసిన పెట్టుబడులు కూడా ఎళ్లే పరిస్థితి లేక.. అప్పులు తీర్చే మార్గం తెలియక ఆందోళనకు గురవుతున్నారు. మబ్బుల ఊరింపులు, కరెంట్ కోతలు, భూగర్భ జలాల అడుగంటిపోయి అన్నదాతను నిలువునా అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. రెండు మూడ్రోజులపాటు కురిసిన వర్షాలు రైతులను ఏ విధంగానూ ఆదుకోలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 55.59 లక్షల ఎకరాల్లోనే వరి పంట సాగైంది. యాదాద్రి, నల్లగొండ, సిద్దిపేట, నిజామాబాద్, సూర్యాపేట, జనగామ, తదితర జిల్లాల్లో గతం కంటే వరి సాగు తగ్గింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 67.30 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 1.50 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. కోటి టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. ఈ సారి 37 లక్షల టన్నులు తగ్గి.. 1.13 కోట్ల టన్నులకు మాత్రమే దిగుబడి పరిమితం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రమే ధాన్యం దిగుబడిలో ముందంజలో ఉంటుందని అంటున్నారు. రాబోయేకాలంలో వర్షాలపైనే పంటల దిగుబడి ఆధారపడి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలపై ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నవతెలంగాణ రైతుల పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
నవతెలంగాణ-మొఫిసిల్ యంత్రాంగం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏడాదీ పసిడి పంటలతో కళకళలాడే పొలాలు ఈసారి తీరని కరవు ఛాయలతో బీడువారాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉత్పన్నమైన 'ఎల్‌నినో' ప్రభావం వ్యవసాయ రంగాన్ని నిలువునా దెబ్బతీసింది. జూన్ నెలలో కురిసిన వర్షాలకు సంబరపడి, ఎంతో ఉత్సాహంగా విత్తనాలు చల్లిన రైతులకు తరువాతి నెలలు కోలుకోలేని శోకాన్ని మిగిల్చాయి. సెప్టెంబర్ నెలాఖరు వచ్చినా తగినంత భారీ వర్షాల జాడ లేదు. జిల్లాలోని 21 మండలాల్లో దాదాపు 20 మండలాలు తీవ్ర లోటు వర్షపాతంతో అల్లాడుతుండగా, ఎర్రుపాలెం మండలం అత్యంత దారుణంగా 62 శాతం లోటు వర్షపాతంతో తీవ్ర కరవు ప్రాంతంగా మారింది. కారేపల్లి, కామేపల్లి మండలాల్లో చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేక పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి.
తలకిందులైన సాగు లక్ష్యాలు
ఈ వానాకాలం సీజన్ లో దాదాపు 5.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, కేవలం 4.29 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. ప్రధాన సాగునీటి వనరైన నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల కాకపోవడంతో వరి సాగు పడిపోయింది. దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని భావిస్తే, 1.60 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. తొలి వర్షాలకు ఆశగా వేసిన పత్తి పంట ఖమ్మం జిల్లాలో 2.34 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 2.36 లక్షల ఎకరాల్లో సాగైనప్పటికీ, ప్రస్తుతం పూత, కాత దశలో నీటి తడులు లేక భానుడి తాపానికి ఎదుళ్లచెరువు వంటి అనేక ప్రాంతాల్లో వడబడిపోతోంది. వేరుశనగ, చెరకు, మొక్కజొన్న, కంది పంటలు ఎండిపోతున్నాయి.
అడుగంటిన భూగర్భ జలాలు
సాగునీటి ప్రాజెక్టులు ఎండిపోవడం, వర్షాలు మొహం చాటేయడంతో రైతులు బోర్లపైనే ఆధారపడ్డారు. అయితే విపరీతమైన ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల నుంచి నీరు సరిగ్గా రావడం లేదు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో అమలవుతున్న విద్యుత్ కోతలు అన్నదాతల నడుము విరుస్తున్నాయి. వ్యవసాయానికి రోజుకు 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో లోకల్ కటింగ్స్, నిర్వహణ లోపాల పేరుతో రోజుకు 5 నుంచి 7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని రైతులు అంటున్నారు.
దుక్కి దున్నడం దగ్గర నుంచి విత్తడం వరకు ఎకరానికి పత్తికి 30 వేల నుంచి 40 వేల వరకు, వరికి 25 వేల కంటే పైనే ఖర్చు చేశారు. కానీ ప్రకృతి సహకరించకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి దాపురించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితిని ప్రభుత్వం అత్యంత అత్యవసర సమస్యగా పరిగణించాల్సి ఉంది. లోటు వర్షపాతం ఉన్న మండలాలను వెంటనే "కరవు మండలాలుగా" అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు.
లోటు వర్షాలతో ఎండుతున్న పంటలు
ఎల్‌నినో ప్రభావం నల్లగొండ జిల్లా వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు కీలక దశలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఈ సీజన్‌లో సుమారు 20–30 శాతం వరకు లోటు నమోదైనట్లు వ్యవసాయ, వాతావరణ శాఖల లెక్కలు సూచిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబరులో సుదీర్ఘ పొడి వాతావరణం నెలకొనడం పంటలపై ప్రభావం చూపింది. నల్లగొండ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 11.23 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుత వానాకాలం సీజన్‌లో దాదాపు 9.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు . పత్తి సుమారు 5.5 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వర్షాలు సకాలంలో కురవకపోవడం, వరుసగా పొడి రోజులు కొనసాగడంతో పత్తి పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రారంభంలో వర్షాలు, అందుబాటులో ఉన్న నీటితో పంటలు కొంతమేర ఆశాజనకంగా కనిపించినా.. ఆ తర్వాత వర్షాల విరామం సమస్యగా మారింది. చెరువులు, కుంటలకు తగినంత వరద నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రస్తుత సీజన్‌లో వర్షాల పంపిణీ అసమానంగా ఉండటం, దీర్ఘకాలిక పొడి విరామాలు ఏర్పడటం వల్ల పంటలకు అవసరమైన సమయంలో తేమ అందడం లేదు.
ఉమ్మడి వరంగల్‌లో రిజర్వాయర్లు వెలవెల
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. దేవాదుల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసి రిజర్వాయర్లను నింపకపోతే పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉంది. ఎల్ నినో ప్రభావం తో వర్షాలు లేక తాగునీరు కరవవుతుంది. దేవాదుల ప్రాజెక్టు నుండి గోదావరి నీటిని విడుదల చేస్తేనే భీమ్ గన్ పూర్, సలివాగు, రామప్ప, ఘనపురం, ధర్మసాగర్ రిజర్వాయర్లకు నీరు చేరుతుంది. తొలి దశలో గోదావరి నీటిని విడుదల చేశారు.







కామెంట్‌లు (0)