తెలుగు సినీ పరిశ్రమకు వెన్నెముకగా భావించే 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల వ్యవస్థలో అంతర్గత పోరు రచ్చ కెక్కింది. ఫిలిం ఫెడరేషన్‌లోని అధికార వ్యవహారశైలి, టాలీవుడ్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ (తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ అక్రమాలు, యూనియన్లలో జోక్యం, ఎన్నికల ప్రక్రియ, కార్మికుల హక్కులు, చిత్రపురి హౌసింగ్ సొసైటీ వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఒకవైపు ఫెడరేషన్‌పై నియంతృత్వ పోకడల ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, సభ్యత్వాలు, ఇళ్ల కేటాయింపులు, విచారణ నివేదికలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. చిత్రపురి సాధన సమితి నాయకులు, 24 క్రాఫ్ట్స్–చిత్రపురి కాలనీ బాధితుల ప్రతినిధులు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఫిల్మ్ వింగ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులు, తెలంగాణ సినిమా వేదిక సభ్యులు తదితరులు కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫెడరేషన్‌లో జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్న పరిణామాలపై తక్షణ చర్యలు తీసు కోవాలని, చిత్రపురి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తీవ్రంగా మండిపడ్డారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ అక్రమాలపై కేసులు పెట్టి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇలాంటి మోసగాళ్లను వదిలిపెట్టకూ డదన్నారు. ఈ నేపథ్యంలోనే డాన్సర్స్ అసోసియే షన్‌లోని అంతర్గత పోరు చర్చనీయాంశమైంది.






కామెంట్‌లు (0)