Magazines

క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

1 గంట క్రితం

Quick-commerce
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్ధాల కట్టడికి ఫుడ్ సేఫ్టీ వింగ్ (TG SAFE) దాడులు ముమ్మరం చేసింది. ఇటీవల నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్లు లపై దాడులు చేసి పలు రకాల కల్తీ ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. తాజాగా క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డార్క్ స్టోర్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ వింగ్ (TG SAFE) దాడులు చేపట్టింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, డ్రాప్‌క్స్ లాజిస్టిక్స్ వంటి ప్రముఖ క్విక్-కామర్స్ సంస్థలకు చెందిన మొత్తం 16 డార్క్ స్టోర్లలో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.


ఈ తనిఖీల్లో కొన్ని స్టోర్లలో బూజు పట్టిన చీజ్ ప్యాకెట్లు, కాలీఫ్లవర్‌లో పురుగులు, ఫంగస్ పట్టి పాడైపోయిన కూరగాయలు, మంచులా గడ్డకట్టిన ప్యాకేజ్డ్ వస్తువులు కనిపించాయి. అలాగే కూలింగ్ స్టోర్ రూమ్స్ ఉష్ణోగ్రతల్లో లోపాలకు తోడు సరైన స్టోరేజీ పద్ధతులు పాటించకపోవటం బయటపడింది. ఈ ఆకస్మిక తనిఖీల కోసం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ ని రంగంలోకి దించారు.


ఈ దాడుల్లో రూల్ ఫాలో అవ్వని డార్క్ స్టోర్ల FSSAI లైసెన్సులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. పెట్ బషీరాబాద్, సైదాబాద్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్టోర్లు, చౌక్ మహమ్మద్ ఖాన్, పత్తర్ గట్టి, చార్మినార్‌లోని ఫ్లిప్‌కార్ట్ అవుట్లెట్లు, రామకోటిలోని జెప్టో స్టోర్లపై ఈ సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఈ చర్యలు కేవలం పేర్కొన్న నిర్దిష్ట స్టోర్లకే వర్తిస్తాయని, డ్రాప్‌క్స్ లాజిస్టిక్స్‌పై ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు లేవని స్పష్టం చేశారు. కల్తీపై అనుమానంతో మొత్తం 15 నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. ఈ తనిఖీల సందర్భంగా 3 స్టోర్లకు మెరుగుదల నోటీసులు, మరో 5 స్టోర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసుల అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్