తిరువనంతపురం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన కొడియేరి బాలకృష్ణన్ లేనిలోటు వ్యక్తిగతంగా తనకు, అలాగే పార్టీకి పూడ్చలేని లోటును మిగిల్చిందని పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ అన్నారు. కొడియేరి బాలకృష్ణన్ వర్థంతి సందర్భంగా పినరయి విజయన్ ఆయనకు నివాళులు అర్పిస్తూ..ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఎలాంటి సంక్షోభాలు, ఇబ్బందులు ఎదురైనా కొడియేరి చిరునవ్వుతో వాటిని ఎదుర్కొనేవారని తెలిపారు. పార్టీపై జరిగిన దాడులను ఉక్కు సంకల్పంతో ఎదుర్కొన్న ఆయన.. ఆ విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధపడేవారు కాదని పేర్కొన్నారు.
మంచి పాలకుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్‌గా, సమర్థవంతమైన నిర్వాహకుడిగా కొడియేరి తనదైన ముద్ర వేశారని పినరయి విజయన్ అన్నారు. తీవ్ర తుఫానులు ఎదురైనా పార్టీని చెక్కుచెదరకుండా కాపాడిన కెప్టెన్ కొడియేరి అని కొనియాడారు. శాసనసభలో ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన.. అధికార, ప్రతిపక్ష బెంచీల్లో ఉన్న సమయంలోనూ మంచి పార్లమెంటేరియన్‌గా విశేష గుర్తింపు పొందారని తెలిపారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో పోలీసు శాఖలో చేపట్టిన సమగ్ర సంస్కరణలు, పర్యాటక రంగానికి తీసుకొచ్చిన కొత్త ఊపుతో కొడియేరి మంచి పాలకుడిగా పేరు సంపాదించారని చెప్పారు.






కామెంట్‌లు (0)