నవతెలంగాణ - హైదరాబాద్ : సీపీఐ(ఎం) అగ్రనేత, కేరళ సామాజిక, రాజకీయ రంగాల్లో కీలకంగా వ్యవహరించిన కొడియేరి బాలకృష్ణన్ స్మరణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. త్రిశూర్ జిల్లా కమిటీ కార్యాలయంలోని అజికోడన్ స్మారకంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ జెండా ఎగురవేశారు. పయ్యాంబలంలోని కొడియేరి స్మృతి మండపం వద్ద కేంద్ర కమిటీ సభ్యుడు ఈపీ జయరాజన్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించారు. ఏకేజీ సెంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ జెండా ఎగురవేశారు. పార్టీ బ్రాంచ్‌లలో ప్రభాత భేరీ, పుష్పాంజలి, జెండా ఆవిష్కరణ, సంస్మరణ ప్రసంగాలు నిర్వహించారు.

పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంలో శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కొడియేరి విశ్రాంతి లేకుండా పనిచేశారని ఎంవీ గోవిందన్ అన్నారు. కేరళం రాజకీయాల్లో అత్యంత సౌమ్యమైన, అదే సమయంలో బలమైన నాయకత్వంగా కొడియేరి నిలిచారని పేర్కొన్నారు. ఆయన అందరికీ ఆదర్శమని ఈపీ జయరాజన్ అన్నారు.
కొడియేరి బాలకృష్ణన్ మృతి వ్యక్తిగతంగా తనకు, అలాగే పార్టీ ఉద్యమానికి పూడ్చలేని లోటును మిగిల్చిందని పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ అన్నారు. ఎలాంటి సంక్షోభాలు, ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొనే సామర్థ్యం కొడియేరికి ఉండేదని తెలిపారు. పార్టీపై జరిగిన దాడులను ఉక్కు సంకల్పంతో ఎదుర్కొన్నారని, ఆ విషయంలో ఎలాంటి రాజీకి ఆయన సిద్ధపడేవారు కాదని పినరయి విజయన్ పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)