నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఓటమి పాలయ్యారు. క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూ ఫీ చేతిలో 11-12, 21-18, 21-10 తేడాతో పరాజయం చవిచూశారు. అనంతరం సింధు మాట్లాడుతూ.. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తగినంత విశ్రాంతి సమయం ఇవ్వకుండా వరుసగా మ్యాచ్‌లు నిర్వహించారని విమర్శించారు.
24 గంటల వ్యవధిలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి రావడం కేవలం మానసిక సన్నద్ధతకు సంబంధించిన అంశం కాదని సింధు పేర్కొన్నారు. సుదీర్ఘ మ్యాచ్‌ల అనంతరం శరీరానికి తగిన విశ్రాంతి అవసరమని, విశ్రాంతి లేకపోవడంతో అలసట కారణంగా కాళ్లు కదపడం కూడా కష్టమవుతుందని తెలిపారు. తాను మెరుగైన ఆటతీరు కనబర్చానని, అయితే మ్యాచ్‌ల నిర్వహణ సమయాలు మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదని అన్నారు.
శనివారం సింధు రెండు మ్యాచ్‌లు ఆడారు. రెండో మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు ముగిసింది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు చెన్ యూ ఫీతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సింధు ఓటమి పాలయ్యారు. మరో భారత షట్లర్ ఉన్నతి హుడా సైతం మ్యాచ్‌ల షెడ్యూలింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే రోజు రెండు, మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో క్రీడాకారులు అలసిపోయారని పేర్కొన్నారు. అయితే క్వార్టర్ ఫైనల్లో తన ఓటమికి షెడ్యూల్‌ను కారణంగా చూపబోనని ఆమె స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)