నవతెలంగాణ-హైదరాబాద్: ఉజ్జయినీలోని షాహీ మసీదు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సోమవారం భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా రోడ్డు విస్తరణ పేరుతో షాహీ మసీదులో కొంత భాగాన్ని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 600 ఏళ్ల చారిత్రక కట్టడాన్ని రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూల్చివేతకు ప్రభుత్వం ప్రయత్నించడం చట్ట ఉల్లంఘనకు దారితీస్తుందని అన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వారసత్వ కట్టడాన్ని పరిరక్షించాలని, రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని ప్రత్యామ్నాయ ప్రాంతం నుంచి సేకరించాలని సూచించారు.







కామెంట్‌లు (0)