Magazines

అమెరికా చెరవీడిన ఇరాక్‌‌!

57 నిమిషాల క్రితం

Iraq Freed
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం

బుధవారం నాడు చివరి అమెరికా సైనిక బృందం తట్టా బుట్టా సర్దుకొని ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ వైమానిక కేంద్రం నుంచి వెళ్లిపోవటంతో రెండు దశాబ్దాలకుపైగా కొనసాగిన దురాక్రమణకు తెరపడింది. నరక విహార యాత్ర ముగిసిందని డోనాల్డ్ ట్రంప్ వర్ణించాడు. తమ దేశం, సమాజాన్ని సర్వనాశనం చేసిన పీడా విరగడైందని షియా, సున్నీలు అనే తేడా లేకుండా ఇరాకీలు సంబరాలు జరుపుకున్నారు. అమెరికా మిలిటరీ వైదొలగటం ఇరాన్ పలుకుబడి మరింతగా పెరగటానికి దోహదం చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాక్‌లో ఉన్న తమ అనుకూల సాయుధ బృందాల విజయం అమెరికాకు ఎదురు దెబ్బ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. మొత్తం పశ్చిమాసియా నుంచి అమెరికా గెంటివేతకు నాంది అని కూడా వర్ణించింది. ఇప్పుడు ఇరాక్ అంతర్గత పరిణామాలు ఎలా ఉంటాయి, అంతర్జాతీ యంగా ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే చర్చ మొదలైంది. బాత్ పార్టీ అధినేత సద్దామ్ హుస్సేన్ అధ్యక్షుడిగా ఉన్న ఇరాక్ మారణా యుధాలను గుట్టలుగా సమీకరించి ఆ ప్రాంత దేశాలకు ముప్పుగా పరిణమించిందనే తప్పుడు ప్రచారంతో అమెరికన్లు దురాక్ర మణకు పాల్పడ్డారు. ‘ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్’ ముసుగులో 2003లో అమెరికా సేనలు దురాక్రమణకు పాల్పడి అదే ఏడాది సద్దామ్‌ను బంధించి ఉరి తీశాయి. మరుసటి ఏడాది అక్కడ ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2011 వరకు తిష్టవేసి వైదొలిగాయి. ఆ తరువాత ఐసిస్ ఉగ్రవాదులు చెలరేగటంతో 2014లో తిరిగి ప్రవేశించి బుధవారం వరకు అక్కడే ఉన్నాయి. ఐసిస్ ఉగ్రవాదులను 2017లోనే అంతం చేసినట్లు ప్రకటించినప్పటికీ తొమ్మిదేండ్ల పాటు అమెరికా మిలిటరీ అక్కడ ఉంది.

విదేశీ మిలిటరీ దేశం నుంచి వైదొలగాలని 2020లోనే ఇరాక్ పార్లమెంట్ తీర్మానించినప్పటికీ అమలు జరిపే సత్తా ప్రభుత్వానికి లేకపోయింది. అది అటు ఇరాన్, ఇటు అమెరికా రెండింటితో సంబంధాలను నెరిపింది. ఇరాన్ మిలిటరీ అధికారి సులేమానీ ఇరాక్ వచ్చినపుడు అమెరికా కుట్రచేసి హత్య చేయగా, దానికి వ్యతిరేకంగా ఇరాన్ అనుకూల సాయుధ బృందాలు అమెరికన్లపై దాడులు చేశాయి. గతేడాది, ఈ సంవత్స రం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడుల తరువాత కూడా ఈ బృందాలు అమెరికా సేనలపై, సౌదీ అరేబియాపై దాడులకు పూనుకున్నాయి. పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు కావటం, ఇరాక్‌లోని అనేక ప్రాంతాలపై ఇరాన్ అనుకూల బృందాల పట్టు పెరగటం వంటి పరిణామాలతో రెండేళ్ల క్రితమే అధ్యక్షుడు జో బైడెన్ అక్కడి నుంచి వైదొలగాలని నిర్ణయిం చాడు. తాజా పరిణామాలతో ట్రంప్ యంత్రాం గం దానిని అమలు చేసింది. రెండు దశాబ్దాల దురాక్రమణ సమయంలో భారీగా నష్టపోవ టంతో పాటు నాలుగున్నర వేల మంది అమెరికా సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇరాక్ జనాభా 95శాతం ముస్లింలే. వారిలో అరవైశాతంపైగా షియాలు, 35శాతం సున్నీలు ఉన్నారు. సున్నీ అయిన సద్దామ్ హుసేన్ అధికారానికి వచ్చిన తరువాత ప్రత్యర్థి పార్టీలోని షియాలను అణచి వేశాడు. 1979లో ఇరాన్ మతపెద్ద అయాతుల్లా ఖొమైనీ నాయకత్వంలో అక్కడి అమెరికా అనుకూల రాజు షాను అధికారం నుంచి తొలగించారు. దాంతో 1980దశకంలో ఏడు సంవత్సరాల పాటు సద్దామ్‌కు ఆయుధాలు అందించిన అమెరికన్లు ఇరాన్‌పై యుద్ధం చేయించారు.

కువైట్‌ను ఆక్రమించేందుకు సద్దామ్ పూనుకోవటాన్ని సాకుగా తీసుకొని అమెరికా, ఇతర దేశాలతో కలసి 1991లో తొలిసారి ఇరాక్‌పై దాడి చేసింది.ఇరాక్‌లో ఉన్న చమురు సంపదలను కొల్లగొట్టటం ఆర్థిక లక్ష్యం కాగా, ఇరాన్‌కు పక్కలో బల్లెం మాదిరి నిత్యం కవ్వించేందుకు తన మిలిటరీని అక్కడ తిష్టవేయించటం రెండవ ఎత్తుగడ. ఇరాక్‌లోని చమురు సంపదను సద్దామ్ హుసేన్ హయాంలో జాతీయం చేశారు. అమెరికా దాన్ని ఆక్రమించగానే బిపి, ఎక్సాన్ మోబిల్ వంటి కార్పొరేట్ సంస్థలకు చమురు వెలికితీతను అప్పగించారు. అమెరికన్ దళాలు ఇరాక్‌ను వీడిపోయిన తరువాత అంతరించిపోయిందనుకున్న ఐసిస్ తిరిగి తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి అమెరికా ఆక్రమణ సమయంలోనే అంతకు ముందులేని ఇస్లామిక్ తీవ్రవాదులు అక్కడ తలెత్తారు. పశ్చిమాసియాలో ఆల్‌ఖైదా, తాలిబాన్ల వంటి ఉగ్రవాదుల పెరుగుదల, సిరియాలో అసాద్ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు ఉగ్రవాదులను కిరాయికి రప్పించి సాయుధ దాడులు చేయించిన చరిత్ర తెలిసిందే. అమెరికా పట్ల వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్న కారణంగా ఇరాక్‌లోని తిరుగుబాటుదార్లకు ఇరాన్ సాయం అందించటం బహిరంగ రహస్యం} తాజా పరిణా మాలపై వెలువడిన స్పందనలను చూసినపుడు ఇరాక్‌పై ఇరాన్ అనేక విధాలుగా ప్రభావం చూపనుందనే విశ్లేషణలు వెలువ డ్డాయి. అక్కడి సమాజం సామాజిక కోణంలో పునరేకీకరణ అయితే షియా వర్గం వారు తిరిగి అధికారానికి రావచ్చు, అది ఇరాన్‌కు మిత్రపక్షంగా ఉండవచ్చు. అదే జరిగితే అమెరికా తిరిగి రంగంలోకి దిగి కుర్దిస్తాన్ కోసం ఆందోళన చేస్తున్న వారికి మద్దతిచ్చే అవకాశాలనూ తోసిపుచ్చలేము. సామ్రాజ్యవాదం తన ఓటమిని అంత తేలికగా అంగీకరించదు!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్