85 టీఎంసీలకు పడిపోయిన రిజర్వాయర్ నీటిమట్టం
నవతెలంగాణ-
మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
శ్రీశైలం రిజర్వాయర్ జల కళ తప్పుతోంది. వర్షాలు కురిసి వరదలతో నదులు ఉప్పొంగాల్సిన సమయంలో రిజర్వాయర్ నీటిమట్టం 215.807 టీఎంసీల నుంచి 85 టీఎంసీలకు పడిపోయాయి. పడిపోతున్న నీటి పరిమాణాలు వచ్చే వేసవికి హెచ్చరిక లాగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వేసవిలో తాగు సాగు నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరులో కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం లేకపోవడంతోపాటు ప్రతిరోజూ వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. మరో నెల రోజుల్లో నీటిమట్టం 830 అడుగులకు తగ్గుతుందని, నీటి నిల్వలు క్రస్ట్‌గేట్ల దిగువకు చేరుకుంటాయని నిపుణులు చెపుతున్నారు.. బుధవారం ఎగువ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి ద్వారా నీరు విడుదల కాకపోగా, తెలంగాణలో జెన్‌కో విద్యుదుత్పత్తి చేసేందుకు 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని సాగర్‌కు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి ఆవిరి రూపంలో మరో 158 క్యూసెక్కులు పోయినట్టు నమోదైంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 850 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 85.75 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 12583 క్యూసెక్కులు నీటిని వాడుతున్నారు.
ఎల్‌నినో ప్రభావం
కసిరెడ్డి నారాయణరెడ్డి-ఎమ్మెల్యే కల్వకుర్తి- నాగర్ కర్నూల్ జిల్లా
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదయింది. దీంతో కాలువలు, నదులు పారలేదు. రిజర్వాయర్‌లు, చెరువులు నిండలేదు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులకు ప్రవాహం తగ్గింది. జూరాల, శ్రీశైలంలో నీటిమట్టాలు తగ్గాయి. వచ్చే వేసవిలో తాగునీటికి కటకట తప్పదు. ప్రతి పౌరుడూ నీటిని పొదుపుగా వాడాలి.
ముందు చూపు లేక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఒడిసి పట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు న్నాయి. వరదలు వచ్చినప్పుడు రిజర్వాయర్లు చెరువులను నింపుకుంటే తాగు, సాగునీటి సమస్య వచ్చేది కాదు. పై నుంచి వరదలు వచ్చే సమయంలో ప్రధాన రిజర్వాయర్లను నిప్పుకోవడంలోనూ తాత్సారం చేయడం వల్ల నేడు తాగునీటి సమస్య ఏర్పడే అవకాశాలున్నాయి.







కామెంట్‌లు (0)