“మనమంతా అమాయకంగా పుడతాము. కానీ, పెరుగుతున్న కొద్దీ మూర్ఖులుగా మారి, అలాగే కొనసాగుతూ ఉండాలంటే మాత్రం కష్టపడాల్సి ఉంటుంది’’ బెంజమిన్ ఫ్రాంక్లిన్, అమెరికా వ్యవస్థాపక పితామహుడు, రచయిత, శాస్త్ర వేత్త, రాజనీతిజ్ఞుడు.
మన దేశంలో అరెస్సెస్, బీజేపీ వారు ఈ విషయంలో చాలా చాలా కష్టపడుతున్నట్టున్నారు. దేశంలో ఎటునుంచి ఎటు చూసినా ఈ విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంది.
‘‘అయోధ్య రామాలయంలో ప్రజలిచ్చిన కానుకలు దోపిడి కావడానికి కారణం మోడీయే! ఎందుకంటే అలాంటి హీనమైన దోపిడీకి కారణమైన వారిని నియమించింది మోడీనే! రాముడి విగ్రహం గానీ, భగవంతుడికి భక్తితో సమర్పించిన కానుకలు గానీ, భద్రంగా చూసుకోవలసిన వారే దోపిడీ చేస్తే ఎలా? అందుకని, ఈ విషయం మీద మొత్తానికి మొత్తంగా విచారణ జరిపి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి’’- అన్నది బయటివారు ఎవరో కాదు, వారి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి - సుబ్రహ్మణస్వామి ప్రకటించాడు -
అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం, దోపిడీ వివాదం పక్కదారి పట్టించేందుకు ఆలయ ట్రస్ట్ పది రోజుల ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభించింది. భగవంతుడికి క్షమాపణలు చెప్పుకుంటూ, పారాయణాలు నిర్వహించు కోవాలని నిర్ణయించుకుంది. క్షమాపణలు.. లేని భగవంతుడికి కాదు, ఈ దేశ ప్రజలకు చెప్పాలని తెలియని మందబుద్ధులు వీరు.
తెలియకపోవడం కూడా కాదు, అమాయక ప్రజల్ని మోసం చేయడానికి ఇదొక ఎత్తుగడ! కుట్రలు, కుతంత్రాలు అలవాటై పోయిన ఈ దేశ నాయకులకు తాము ఏం చేయాలో తెలియక కాదు. సరైన దర్యాప్తు చేయించి, దోచుకొన్న సొమ్ము వెనక్కి తేవడం- దోషులకు శిక్షలు పడేట్లు చేయడం చేయలేని ఈ ప్రభుత్వం కొనసాగడం ఇంకా అవసరమా? అని ఈ దేశపారులు ముఖ్యంగా జెన్. జి - ఆలోచిస్తున్నారు. అవసరమైనప్పుడు ఉద్యమిస్తున్నారు కూడా!
వారి బీజేపీ పార్లమెంట్ మెంబరు, కేంద్ర మాజీ మంత్రి అయిన సుబ్రహ్మణ్యస్వామి మరికొన్ని ఇంటర్వ్యూలలో ఎన్నో సంచలన విషయాలు ప్రకటిస్తున్నాడు. ఆయన ఆబద్దాలు ప్రచారం చేస్తున్నాడని అనుకుంటే మోడీ ప్రభుత్వం దర్వాప్తు జరిపించి, ఆయనకు శిక్షపడేట్టు చేయాలికదా? చేయకుండా కుక్కిన పేన్లలా పడి ఉన్నారంటే సుబ్రహ్మణ్యస్వామి మాటల్లో యదార్థం ఉందనే కదా అర్థం?
“ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను యోగి అని, సన్యాసి అని పిలవడం అపచారమని’- శంకరాచార్య అవి ముక్తేశ్వరానంద సరస్వతి పిలుపునిచ్చాడు. కారణం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్నంత జంతువధ భారతదేశంలో మరెక్కడా జరగడం లేదన్నది ఆయన వాదన! మాంసం ఎగుమతి చేస్తున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అందువల్ల, గోవధ గురించి మాట్లాడే నైతికహక్కు యోగి ఆదిత్యానాథ్‌కు ఎలా ఉంటుందీ? ఈ వివరాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే గనక, ‘యోగి’, ‘సన్యాసి’ - వంటి బిరుదులు తగిలించుకుని తిరగడం ఆదిత్యనాథ్‌కు తగదు.
ఆయన గోరక్షకుడు కాదు, గోభక్షకుడు! హిందూమతానికి ధర్మానికీ, సన్యాస ఆశ్రమానికి విరుద్ధమైన పనులు చేస్తూ, ఆదిత్యనాథ్ గోరక్షణ గురించి మాట్లాడడం కేవలం మూర్ఖత్వం తప్ప, మరొకటి కాదు - అన్నాడు అవిముక్తేశ్వరానంద సరస్వతి. ఆవు మూత్రం పందొమ్మిది రకాల వ్యాధుల్ని నివారిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రకటనలు చేస్తున్నాడు. ఆరెస్సెస్, బీజేపీ వారు ఆ ఆవు మూత్రమే తాగి తమ తమ రోగాలు నయం చేసుకోవచ్చు కదా? అమాయక జనాన్ని ప్రభావితం చేసేట్లు ఇలాంటి ప్రకటనలు చేయడం ఎందుకూ?- ఇలాంటి వారికా తాము అధికారం కట్టబెట్టామని.. ఇకనైనా దేశ ప్రజలు ఆలోచించుకోవాలి! లాక్‌డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి అష్టకష్టాలు పడి ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న వలస కూలీల నుంచి కరోనా నిబంధ నల పేరుతో స్వాధీనం చేసుకున్న ఐదువేల నాలుగు వందల సైకిళ్లను ఆదిత్యనాథ్ ప్రభుత్యం రూ.ఇరవై ఒక్క లక్షలకు అమ్ముకుంది. ఇంతకన్నా హేయమైన విషయం, దుర్మార్గమైన విషయం మరేదైనా ఉంటుందా? లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలకు ఉచితంగా రైలు, బస్సుసౌకర్యం కల్పించలేని ప్రభుత్వం, ఎక్కడెక్కడి నుండో వారు తొక్కుతూ తెచ్చుకున్న సైకిళ్లను స్వాధీనం చేసుకుని, అమ్ముకుంటుందా? ప్రస్తుత ప్రభు త్వాలు సిగ్గూ ఎగ్గూ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పడానికి ఇంకా ఏ ఉదాహరణ కావాలి?
అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూపై సిబిఐ - దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఎందుకంటే- రూ.1270 కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టులు తన కుటుంబ సభ్యులకు, బంధువులకూ ఈ ముఖ్యమంత్రి పెమా ఖండూ అప్పనంగా కట్టబెట్టాడు. ఒక మాజీ బీజేపీ నాయకురాలు, మాజీ ఐఏఎస్ భార్య సీమా పాత్ర అరెస్టయింది.
ఆమె చేసిన నేరం ఏమిటంటే- ఇంట్లో పనిచేసే పనిమనిషి సునీతను చిత్రహింసలకు గురిచేసింది. ఆమె ఒంటినిండా గాయాలు చేసింది. వేడివేడి వస్తువులతో ఆమె ఒళ్లు కాల్చింది. దానితో ఆ సీమా పాత్ర ఆహం చల్లారలేదు. ఏకంగా పనిమనిషి సునీత నాలికతో తన టాయిలెట్ శుభ్రం చేయించుకుంది. బాధలు భరించలేని పనిమనిషి సునీత పోలీసులను ఆశ్రయించింది. అది తెలిసి, మాజీ బీజేపీ నాయకురాలు సీమా పాత్ర పరారైంది. చివరకు పోలీసులు వెతికి పట్టుకున్నారు. పనిమనిషి చెప్పినట్లుగా, ఆమె ఒంటిమీద గాయాల్ని పోలీసులు గమనించి, చర్యలు చేపట్టారు. కొర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. తమ పార్టీ అధికారంలో ఉందన్న అహంకారంతో, మనుషుల మన్నది కూడా మరిచి కొందరు ఇలా ప్రవర్తిస్తుంటారు. దేశభక్తి, ప్రజాసేవల గురించి మాట్లాడే బీజేపీ నాయకులే ఇలా చేస్తే, ఇక సామాన్యులు బతికేది ఎట్లా?
శారీరక శ్రమకు విలువ తెలియని సినీనటి కంగనా రనౌత్ రైతు ఉద్యమం కొనసాగుతున్న ప్పుడు, అక్కడ ఒక 82 ఏండ్ల వృద్ధ మహిళను ఎద్దేవా చేసింది. మహిందర్ కౌర్ అనే పంజాబీ వృద్ధ మహిళ, నడుము వంగిపోయినా కర్ర సహాయంతో నడుస్తూ రైతు ఉద్యమంలో చురుకుగా పాల్గొని తోటి రైతులకు స్ఫూర్తి దాయకంగా ముందు నిలబడింది. అప్పటి ఆమె ఫొటోను ‘టై౦’ - మాగజైన్ ప్రచురించింది. ఆ ఫొటో చూసినా కంగనా రనౌత్ నోరు పారేసుకుంది. ‘‘వంద రూపాయలు పారేస్తే, అలాంటి వారంతా పోయి అక్కడ ఉద్యమ కారులుగా కూర్చుని ఫోజులిస్తుంటారని’’- సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిం చింది.
అయితే, ఆ విషయం ఆ వృద్ధ మహిళకు తెలిసి, కంగనాను కోర్టుకీడ్చింది. దాంతో కంగనా ముక్కునేలకు రాసి, బెయిల్ కోసం ఆ వృద్ధమహిళలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమంటే తనను అపహస్యం చేసింది బీజేపీ పార్లమెంట్ మెంబరని ఆ పంజాబీ వృద్ధ మహిళ భయపడలేదు. ధైర్యంగా తన హక్కుల కోసం కోర్టు తలుపు తట్టింది.
కోర్టు కూడా న్యాయబద్దంగా వ్యవహరించింది. పొగరూ, కండకావరమూ తగ్గించుకుని, బీజేపీ ఎంపీ కంగనా పంజాబ్‌లోని బతిండా కోర్టుకు హాజరై, తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. ‘‘రైతు ఉద్యమకారుల నిరసనని తను, సరిగా అర్థం చేసుకోలేక పోయానని.. నిజానికి ఏతల్లి అయినా తల్లేనని - ఆమె పంజాబ్ ప్రాంతానిదైనా, హిమాచల్ ప్రాంతానిదైనా, తనకు ఒక్కటేనని - తను ప్రతితల్లినీ గౌరవిస్తాననీ’’.. బెయిల్ కోసం విధిలేక మాట మార్చింది. ఆరెస్సెస్, బీజేపీలలో చేరిన వారంతా ఇలా విషప్పురుగులు ఎందుకవుతారో తెలియడం లేదు.
జెన్.జి. ఉద్యమకారుల గురించి, కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల గురించి, మోడీ అనుచరులు ఆరెస్సెస్, బీజేపీ వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఎంత హీనంగా ఉన్నాయో గమనించండి!
- మురికి కాలువతరం (Gutter Generation)-అని అన్నది..
కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ.
- వైరస్ తరం - అని అన్నవాడు నితిన్ నబీన్, బీజేపీ అధ్యక్షుడు.
- అద్దెకు తెచ్చుకున్న తొత్తులు- అని అన్నది దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎం
- ఉగ్రవాదులు - అని అన్నవాడు ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ విద్యామంత్రి
- వారంతా పంక్చర్ రిపేర్ చేసేవారు- అని అన్నది రమేష్ బిధూరి.
ఇదీ వారి నాగరికమైన, అవగాహన గల, అర్థవంతమైన వ్యక్తీకరణ!
‘‘జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ ఉద్యమం రాజ్యాంగ విరుద్ధం, అంతేకాదు రాజద్రోహం కూడా!” అని అన్నవాడు అరెస్సెస్ కో వర్కింగ్ ప్రసిడెంట్ అతుల్ లిమాయే. దీనికి రచయిత ఆశోక్ కుమార్ పాండే మంచి సమాధానం ఇచ్చాడు. ‘‘యాభై సంవత్సరాలుగా ఈ దేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయని వారు, రాజ్యాంగం రూపొందించిన ప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారు ఏ ముఖం పెట్టుకుని రాజ్యాంగం గురించి, దేశం గురించి మాట్లాడుతున్నారూ? ’’ అని ప్రశ్నించాడు.. దేశ ప్రజల అంతరాత్మకు అద్దంపట్టిన మాట చెప్పారు ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రాయ్- ‘‘సుమారు పాతికేండ్లుగా నిర్మించుకున్న మోడీ ప్రతిష్ట రెండు వారాల్లో బొద్దింకల బారిన పడింది. ఒక రకంగా ఇది ఎన్నికల కన్నా పెద్ద విజయం!! కాక్రోచ్ జనతా పార్టీ- అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ పునాదుల్ని కుదిపేసింది!’’ అని-వాస్తవంగా ఈ దేశ ప్రజలు ప్రత్యక్షంగా గమనించింది కూడా ఇదే- ఇప్పుడు SIR విషయంలో జరిగిన అవకతవకల్ని నిరసిస్తూ, ఙ్ఞానేష్ కుమార్ రాజీనామాను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ మరొక ఉద్యమానికి సమాయత్తమౌతూ ఉంది!
- నేషనల్ బుక్ ట్రస్ట్ పూర్వ సలహా సంఘ సభ్యులు, జీవ శాస్త్రవేత్త.
ప్రొ. దేవరాజు మహారాజు






కామెంట్‌లు (0)