నవతెలంగాణ-వనపర్తి
వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేసి, రైతులకు వీలైనంత త్వరగా ఖాతాల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా మండలాల్లోని ఐకెపి, పి ఏ ఎస్ ఎస్ సెంటర్ల వారీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిస్థితిపై ఆరా తీసి అధికారులకు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేసి, రైతులకు వీలైనంత త్వరగా ఖాతాల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కాంట చేసి తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు కావలసినన్ని లారీలను పంపాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కావలసినని లారీలను అందించి సహకరించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నేటి నుంచి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు చర్యలు తీసుకోవాలని, వాహనాలలో లోడ్ చేసిన ధాన్యం పైన కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. ఏ ఏ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని వాహనాలు అవసరము అని కలెక్టర్ ఆరా తీసి, ధాన్యం రవాణా కోసం అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తి చేసి, రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ ఆంజనేయులు, డిఆర్డిఓ ఉమాదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



