నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలో షిగెల్లా (ప్రేగులకు సోకే ప్రమాదకరమైన బ్యాక్టీరియా) సోకి ఐదుగురు మృతి చెందారు. మార్చిలో ఒకరు, జూన్ నలుగురు షిగెల్లా సోకి చనిపోయారని ఆ రాష్ట్ర వైద్యశాఖా మంత్రి కె. మురళీధరన్ మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు షిగెల్లా కేసులు 146 నమోదయ్యాయి. వాటిల్లో 70 కేసులు గత నెల జూన్‌లో నమోదయ్యాయని ఆయన అన్నారు. షిగెల్లా, నిపా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కన్సల్టెంట్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని మురళీధరన్ వెల్లడించారు.
కాగా, ‘వైరల్, అమీబిక్ వ్యాధులను నివారించడానికి మేము ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ఎస్.ఎస్. లాల్ దీనికి అధ్యక్షత వహిస్తారు. మేము ప్రతి వారం సమావేశమై, నివేదికలను సమీక్షించి, అధికారులకు తగిన సూచనలు ఇస్తాము. అటువంటి వ్యాధులను శాశ్వతంగా నివారించే మార్గాలపై కూడా ఈ కమిటీ పరిశోధన చేస్తుంది’ అని ఆయన అన్నారు. ఈ ఏడాది నిఫా వైరస్‌ని కట్టడి చేయడంలోప్రభుత్వం విజయం సాధిస్తుంది. ల్యాబ్‌కు పంపిన 38కి పైగా నమూనాలలో కేవలం ఒకరికి మాత్రమే పాజిటివ్ అని తేలింది. అతను వెంటిలేటర్‌పై ఉన్నాడు అని ఆరోగ్యశాఖా మంత్రి పేర్కొన్నారు.
సోమవారం కన్నూర్ జిల్లా మోకేరి గ్రామ పంచాయతీలో షిగెల్లోసిస్ కేసులు రెండు నమోదయ్యాయి. నాలుగేళ్లు, ఎనిమిదేళ్ల చిన్నారులకు షిగెల్లోసిస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడున్న పరిస్థితిని అంచనా వేయడానికి మోకేరి గ్రామ పంచాయతీలో త్వరిత స్పందన బృందం సమావేశమైందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఏ పాఠశాలలోనైనా.. డయేరియా కారణంగా చిన్నారులు పాఠశాలకు హాజరుకాకపోవడం వంటి కేసులున్నాయా అని వారు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. ఆరోగ్య శాఖ వ్యాధి మూలాలను పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. షిగెల్లా అపరిశుభ్రమైన తాగునీరు, ఆహారం, అపరిశుభ్రమైన చేతుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి కె.సి. సచిన్ సూచించారు. జ్వరం, వాంతులు, కడుపునొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ ఇన్ఫెక్షన్‌ని నివారించడానికి ఆహారం తీసుకునే ముందు, టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని, వేడినీటిని తాగాలని వైద్యులు సూచించారు.



