Thursday, April 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమహిళా బిల్లుపై కపట ప్రేమ

మహిళా బిల్లుపై కపట ప్రేమ

- Advertisement -

చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యం సామాజిక న్యాయం, సమానత్వం అనే రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉంది. ప్రజాస్వామ్య సౌధానికి సగభాగమైన మహిళలకు రాజకీయంగా చట్టసభల్లో సముచిత స్థానం దక్కాలన్న దానికి ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లు అమలు చేయాలని ఎప్పట్నుంచో కోరుతూ వస్తున్నాయి. దాని ప్రకారం మహిళా రిజర్వేషన్‌ బిల్లు 2023లో పార్లమెంటు ఆమోదం పొందింది. రాజ్యాంగంలో భాగమైంది. కానీ, ఎప్పటినుంచి అమలులోకి తెస్తామని మాత్రం చెప్పకుండా దాటవేసింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు హడావిడిగా కసరత్తు చేపట్టింది. లోక్‌సభ స్థానాల పెంపుదలకు ఉద్దేశించిన మూడు బిల్లులతో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కూడా ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు జరగబోయే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించి చట్టం రూపంలోకి తేబోతు న్నట్టు ప్రకటించింది. 2029లోనే అమలు చేస్తామని అంటోంది. వాస్తవానికి మహిళా రిజర్వేషన్‌ బిల్లుకూ, నియోజకవర్గాల పునర్వి భజన బిల్లులకూ సంబంధం లేదు. పార్టీలను సమావేశ పరచకుండా బిల్లులను లోతుగా అధ్యయనం చేసే అవకాశం సభ్యులకు ఇవ్వ కుండా హడావిడిగా సమావేశాలు నిర్వహిం చడం వెనుక బీజేపీ కపటనీతి ఏంటో అర్థమవుతుంది. దీనికి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన కారణం. దీన్ని చూపి ఆ వర్గాల ఓటర్లలో సానుభూతి పొందడం తప్ప మరోటి కాదు. గతంలో ఎన్నికలు జరిగిన ప్రతీ సందర్భంలోనూ కులం, మతం, యుద్ధం ఏదో ఒక విభజనను ముందుకు తెచ్చి దాని ద్వారా బీజేపీ లబ్దిపొందింది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలుచేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది.
ఉభయ సభల సభ్యులు ఎన్నికల్లో తలమునకలైవున్న సందర్భంలోనే ఈ ప్రత్యేక సమావేశం జరపాలనడం మోడీ ప్రభుత్వానికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటుందని అనుకోలేం. నిజంగానే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 ఎన్నికల్లోనే అమలు చేయాలని నరేంద్ర మోడీ సర్కారు అభిమతమైతే ఆ బిల్లు ఆమోదించిన 2023 సెప్టెంబర్‌లోనే ఆ పనిచేసేవారు. తాజా జనాభా లెక్కల ప్రాతిపదికపై డీలిమిటేషన్‌ జరిపాకనే కొత్త చట్టం అమలు చేస్తామని గతంలో ఈ పాలకులే స్పషం చేశారు. జనగణన, డీలిమిటేషన్‌ గురించి అంతగట్టిగా చెప్పినవారు ఇప్పటివరకు ఆ పని పూర్తి చేయనేలేదు. దాదాపు మూడేండ్ల వుతున్నా డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించ లేదు. జనగణన పూర్తిస్థాయిలో ప్రారంభమే కాలేదు. అవేమీ చేయకుండా ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లులు ఆమోదింప చేసుకుని.. జనగణన, డీలిమిటేషన్‌ పూర్తయ్యాకే అంటున్నా రంటే మహిళల పట్ల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవు తోంది. జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌డీఏ పక్షాలు రాజకీయ లబ్ధిపొందడం కోసమే ఇదంతా చేస్తున్నారన్నది స్పష్టం.
ఇంత కీలకమైన చట్టాన్ని అమలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీలను, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయడం అత్యవసరం. కానీ అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవడం, ప్రతిపక్షాల అభ్యంతరా లను పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి అంశాలు ప్రభుత్వం ఏకపక్ష ధోరణిని సూచిస్తున్నాయి. నిజంగా మహిళల సాధికారత పట్ల కట్టుబడి ఉంటే, 2023లోనే చట్టం ఆమోదం పొందిన వెంటనే అమలు దిశగా చర్యలు తీసుకోవాల్సింది. ప్రభుత్వం ముందుగా పేర్కొన్నట్టు మహిళా రిజర్వేషన్‌ అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)తో ముడిపెట్టడం మరో వివాదాస్పద అంశం. ఈ రెండు ప్రక్రియలు పూర్తి కాకుండా రిజర్వేషన్లు అమలు చేయలేమని చెప్పడం ఒకవైపు; మరోవైపు ఆ ప్రక్రియలను వేగవంతం చేయడంలో స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం మరోవైపు. ఇప్పటికీ జనగణన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. డీలిమిటేషన్‌ కమిషన్‌ నియామకం కూడా ఆలస్యమవుతోంది. దీంతో ప్రభుత్వం చెప్పే కారణాలపై నమ్మకం లేదు.
మహిళా రిజర్వేషన్‌ ప్రక్రియకు జనగణన, నియోజక వర్గాల పునర్విభజన అంశాలతో ముడిపెట్టకుండానే అమలు చేయాలి. ఎందుకంటే నియోజకవర్గాల పెంపు విషయంలో వివిధ రాష్ట్రాలకు అభ్యంతరాలుండడం సహజం. అంతేగాక జనాభా వృద్ధిరేటు విషయంలోనూ రాష్ట్రాల మధ్య చాలా తేడాలున్నాయి. ఇటువంటి అనేక చిక్కులు తలెత్తుతాయి. రాష్ట్ర అసెంబ్లీల నియోజకవర్గాల విభజన, సంఖ్యను పెంచడం వంటి ప్రతిపాదనలున్నందున రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరపాలి. విస్కృత చర్చల అనంతరం ఏకాభిప్రాయం ద్వారా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా విశాల సమాజ హితం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. మహిళా రిజర్వేషన్‌ను అనవసరమైన షరతులతో ముడిపెట్టకుండా అమలు చేసే మార్గాలను పరిశీలించాలి.అందుకు ప్రజాఒత్తిడి అవసరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -