Thursday, April 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిహార్ముజ్‌ జలసంధిలో ఫలించని అమెరికా వ్యూహం!

హార్ముజ్‌ జలసంధిలో ఫలించని అమెరికా వ్యూహం!

- Advertisement -

ఒక వైపు ఇరాన్‌, మరోవైపు అమెరికా హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నాయి. తన మిత్రదేశాల నౌకలను ఇరాన్‌ అనుమతించగా ఎవరినీ వదిలేదని అమెరికా ప్రకటించింది. అయితే ఆచరణలో ఇరాన్‌ రేవులకు వెళ్లే వాటిని మాత్రమే అడ్డుకుంటు న్నట్లు వార్తలొచ్చాయి. అమెరికా చర్యకు ఏ ఒక్క దేశమూ మద్దతు ప్రకటించకపోగా ఇది నష్టం కలిగించేదిగా ఉందని సౌదీ అరేబియా అమెరికా మీద వత్తిడి తెస్తున్నది. ‘ఇక మాటల్లేవ్‌, మాట్లాడుకోవాటాలు లేవు, ఇరాన్‌ కావాలన్నా ఖాతరు చేయం’ అన్నట్లుగా మాట్లాడిన అమెరికా ఇప్పుడు దిగొచ్చి మరోసారి చర్చలకు సిద్ద పడినట్లు సమాచారం. కాల్పుల విరమణ విరామాన్ని పొడిగించేం దుకు రెండు దేశాలూ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు. ఈనెల 16న మలి విడత చర్చలు జరుగుతాయని, అయితే అవి ఇస్లామాబాద్‌లోనా జెనీవాలోనా అన్నది ఇంకా ఖరారు కాలేదని అమెరికా అధికారవర్గాలు చెప్పినట్లు ఏపి వార్తా సంస్థ పేర్కొన్నది. పీఠముడిగా మారిన అణు శుద్ధి కార్యక్రమాన్ని కావాలంటే ఐదేళ్లపాటు వాయిదా వేస్తాం తప్ప శాశ్వతంగా నిలిపివేసేది లేదని ఇరాన్‌ చెప్పగా ఇరవై సంవత్సరాల పాటు నిలిపివేయాలని అమెరికా కోరుతున్నదని చెబుతున్నారు. పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా ఒక మెట్టు దిగివచ్చినట్లే. హార్ముజ్‌లో విఫలమైన వాషింగ్టన్‌ చైనాను ఇబ్బంది పెట్టేందుకు మలక్కా జలసంధి దిగ్బంధనానికి చూస్తున్నది. చైనా రవాణా ప్రధానంగా ఆ మార్గం నుంచే నడుస్తున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు అమెరికా తెరలేపినట్లే.
నిజానికి 1968లోనే అణుబాంబులను తయారు చేయబో మంటూ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై ఇరాన్‌ సంతకం చేసింది.1979లో జరిగిన పరిణామాల్లో అమెరికా అనుకూల నిరంకుశరాజు షాను గద్దె దింపి అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం సుప్రీంనేతగా అయాతుల్లా ఖొమేనీ ఎన్నికైనప్పటి నుంచి అమెరికా కుట్రలకు తెరలేపింది. ఇరాక్‌ను రెచ్చగొట్టి 1980 నుంచి పదేళ్లపాటు యుద్ధం చేయించింది. తరువాత అనేక ఆంక్షలు విధించి ఆర్థికంగా దెబ్బతీసేందుకు చూసింది. ఇరాన్‌లోని కర్దు తెగవారిని రెచ్చగొట్టి ప్రత్యేక కర్దిస్తాన్‌పేరుతో వారికి ఆయుధాలనందించి తిరుగుబాట్లు చేయిస్తూనే ఉంది. ఈ పూర్వరంగంలో ఎన్‌పిటిని పక్కన పెట్టి తాము అణుకార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని ఇరాన్‌ ప్రకటించింది. దీంతో ఆంక్షలు ఎత్తివేస్తామని, శాంతియుత ప్రయోజనాలకు తామే సహకరిస్తామం టూ 2015లో అమెరికా ఒప్పందం చేసుకుంది. తరువాత మూడేళ్లకే డోనాల్డ్‌ ట్రంప్‌ దాన్నుంచి వైదొలిగి ఆంక్షలను మరింత తీవ్రతరం కావించాడు.అమెరికా బెదిరింపులకు భయపడి మనదేశం 2019 నుంచి ఇరాన్‌ చమురు దిగుమతులను నిలిపివేసింది. చైనా మాత్రం కొనసాగి స్తున్నది. గతేడాది పన్నెండు రోజుల దాడుల్లో ఇరాన్‌ అణుకేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించిన అమెరికా ఈ ఏడాది తిరిగి అణుకేంద్రాల పేరుతో మరోమారు ఇజ్రాయిల్‌తో కలసి దాడులకు పూనుకుంది. ఎప్పటికప్పుడు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ఇరాన్‌ను రెచ్చగొడు తున్నది. ఈ పూర్వరంగలో గురువారం నాడు రెండవ దఫా చర్చలు జరుగుతాయా, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది చూడాల్సి ఉంది.

హార్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిన ఇరాన్‌ను విమర్శించిన అమెరికా తానే ఎందుకు సోమవారం రాత్రి నుంచి దిగ్బంధనానికి పూనుకున్నదనే ప్రశ్న తలెత్తింది. చైనాకు చమురు సరఫరా నౌకలను, మనతో సహా ఇతర మిత్రదేశాల టాంకర్లను ఇరాన్‌ అనుమతి స్తున్నది. దాడులతో లొంగేట్లు కనిపించటం లేదు. అందువలన మొత్తంగా ఇరాన్‌ చమురు, గ్యాస్‌ నౌకలను అడ్డుకొని ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా అటు ఇరాన్‌ మరోవైపు చైనాను తనదారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడతో అమెరికా పూనుకుంది. ఇది చాలా ప్రమాదకరమైన వైఖరని చైనా హెచ్చరించింది. తమ సార్వభౌ మత్వాన్ని ఉల్లంఘించటమే అని ఇరాన్‌ ప్రకటించింది. తాజా పరిణామాల్లో అమెరికాకు ఒక మద్దతుదారుగా ఉన్న సౌదీ అరేబియాకు ఇప్పుడు సెగతగిలినట్లు కనిపిస్తోంది. హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ రేవులను అమెరికా మిలిటరీ దిగ్బంధనం చేయటాన్ని పునరాలోచించాలని వత్తిడి తెస్తున్నట్లు అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాసింది.ఈ చర్య ఆ ప్రాంతంలో సంక్షోభం మరింత ముదరటానికి దోహదం చేయనుందని ఎర్రసముద్రం- అరేబియా సముద్రాలను కలిపే బాబ్‌ ఎల్‌ మండాబ్‌ జలసంధి కూడా దిగ్గంధనానికి గురైతే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర గల్ఫ్‌ దేశాలు కూడా అదే బాట పట్టవచ్చు. ఎమెన్‌లోని ఇరాన్‌ అనుకూల హౌతీ సాయుధశక్తి రాజధాని సనాతో సహా కీలకమైన ప్రాంతాలను అదుపులో ఉంచుకుంది. గతంలో గాజాపై ఇజ్రా యిల్‌ దాడులు చేసినపుడు హౌతీలు నౌకలను అడ్డుకున్న సంగతి తెలిసిందే. అమెరికా గనుక తెగేదాకా లాగితే బాబ్‌ ఎల్‌ మండాబ్‌ జలసంధి దిగ్బంధనానికి పూనుకోవచ్చనే వార్తలు గతంలోనే వచ్చాయి. అది గనుక మూతపడితే సూయజ్‌ కాలువ గుండా ద్వారా జరిగే నౌకా రవాణా నిలిచిపోవటం అనివార్యం. తమ నౌకలకు ఏదైనా ఇబ్బంది కలిగితే గల్ఫ్‌లోని ఏ దేశ రేవు కూడా సురక్షితంగా పనిచేయజాలదని ఇరాన్‌ హెచ్చరిం చింది. ఈ కారణంగా గల్ఫ్‌ దేశాలు అమెరికా మీద వత్తిడి తెస్తున్నట్లు చెప్పవచ్చు. అవి అమెరికాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంతవరకు బహిరం గంగా ఇరాన్‌కు వ్యతిరేకంగా రంగంలోకి రాలేదు. తమకు కలుగుతున్న ఆర్థిక నష్టం గురించి అవి ఆందోళన చెందుతున్నాయి.

బస్తీమే సవాల్‌ అని అన్ని దేశాల మీద తొడగొడుతున్న ట్రంప్‌ ఇప్పుడు పోప్‌ లియో మీద కూడా విరుచు కుపడ్డాడు. ఇరాన్‌పై దాడులకు ముందు తనను ఆశీర్వదిం చాలంటూ పాస్టర్లు, పూజారులను ఆహ్వానించాడు. ఇప్పుడు పోప్‌పై ధ్వజమెత్తటానికి కారణం ఏమిటి? చరిత్రను చూస్తే అనేక మంది నేతలు పోప్‌తో విబేధించి ధ్వజమెత్తిన ఉదంతాలు ఉన్నాయి. ఇదే ట్రంప్‌ పోప్‌ ఫ్రాన్సిస్‌తో కూడా ఘర్షణ పడ్డాడు. పోప్‌లియో చేసిన తప్పిదం ఏమంటే అడ్డగోలుగా ఇరాన్‌ మీద చేసిన దాడిని విమర్శించటమే. యుద్ధాలకు మద్దతుగా మతాన్ని వినియోగించటాన్ని కూడా తప్పు పట్టారు. ట్రంప్‌ వ్యాఖ్యల తరువాత తాను బెదిరింపులకు భయపడేది లేదని శాంతికోసం మరింత గట్టిగా మాట్లాడుతూనే ఉంటానని, హింసను వ్యతిరేకిస్తానని పోప్‌ స్పందించారు. కొద్ది నెలల క్రితం అమెరికా రక్షణశాఖ అధికారులు పోప్‌ రాయబారిని పిలిపించి అమెరికా వ్యూహాత్మక వైఖరులకు అనుగుణ్యంగా నడవాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి భిన్నంగా ట్రంప్‌ వైఖరిని తప్పు పట్టటమే తాజా బెదిరింపులకు కారణం అని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా పోప్‌ బలంగా తయారవుతు న్నారన్న కారణంగా ట్రంప్‌ రెచ్చిపోతున్నట్లు కొందరు వర్ణించారు. చివరికి నియంతలు హిట్లర్‌, ముస్సోలినీ కూడా ఇంత బాహాటంగా పోప్‌ల మీద ధ్వజమెత్తలేదని, ఉదారవాదులైన కాథలిక్కుల మద్దతుతో రెండుసార్లు గెలిచిన ట్రంప్‌ మాట్లాడేటపుడు నోరు దగ్గర పెట్టుకోవాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ వేదాంతం గురించి పోప్‌ చెబుతున్న భాష్యాన్ని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సవాలు చేశాడు. జాగ్రత్తగా మాట్లాడాలని బెదిరించాడు. అయాచిత సలహాలు ఇస్తున్నారంటూ ధ్వజమెత్తాడు. కత్తిపట్టిన వారి పక్షాన దేవుడు ఉండడని ఎలా చెబుతారని ప్రశ్నించాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హింసకు పాల్పడటాన్ని నైతికంగా వేదాంతం సమర్ధిస్తున్న దని, నాజీ జర్మనీ నుంచి ఐరోపాను మిత్రదేశాలు రక్షించేందుకు పూనుకోవటమే దానికి ఒక ఉదాహరణ అంటూ న్యాయ మైన యుద్ధాలను సమర్ధించిన వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందంటూ ఇరాన్‌పై దాడులను వాన్స్‌ సమర్ధించాడు.

ప్రపంచీకరణ, సరఫరా వ్యవస్థలపై పరస్పరం ఆధారపడు తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొనసాగు తున్నంత కాలం ఆర్థిక యుద్ధాల్లో గెలిచేవారెవరూ ఉండరని లోకానికి అర్ధమైనా అమెరికా విధాన నిర్ణేతలకు ఇంకా తలకెక్కలేదు.ఇదే డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో చైనా మీద ప్రారంభించిన ఆర్థిక పోరును తరువాత జో బైడెన్‌ కొనసాగించాడు, తిరిగి ట్రంప్‌ అందుకున్నాడు, అయినప్పటికీ చైనాను లొంగదీసుకోలేకపోయారు. కొద్ది రోజుల్లోనే ఇరాన్‌ను ఓడించి తన ఘనతను చైనాలో ప్రదర్శించాలని తపన పడిన ట్రంప్‌ గత నెలాఖరులో తన పర్యటనను వాయిదా వేసుకున్నాడు.మే నెల రెండవ వారంలో అక్కడకు వెళుతూ మిమ్మల్ని కూడా ఎలా ఇబ్బంది పెట్టగలనో చూడండి అని చెప్పేందుకు హార్ముజ్‌ జలసంధి దిగ్భంధనానికి పూనుకున్నాడు. ఇది కూడా విఫలం అవుతుందని ఇప్పటికే తేలిపోయింది. గత పన్నెండు మాసాల్లో ట్రంప్‌కు అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. విలువైన ఖనిజాల విషయంలో చైనాతో బొక్కబోర్లా పడ్డాడు. అపరాధ పన్నుల విధింపులో వెనక్కు తగ్గాడు. ఇప్పుడు ఇరాన్‌ జలసంధిని ఆయుధంగా మలుచుకొని తలబొప్పి కట్టించుకున్నాడు. తానే దిగ్బంధనానికి పూనుకు న్నాడు. ముందు అన్ని నౌకలను అడ్డుకుంటామని తరువాత నాలుక కరుచుకొని ఇరాన్‌ రేవులకు వచ్చిపోయే వాటినే అన్నాడు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఇరాన్‌ చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించాడు. ఇప్పుడు 14 కోట్ల పీపాల ఇరాన్‌ చమురును కొనుగోలు చేసేందుకు ”అనుమతి” ఇచ్చాడు. తిరిగి మరోసారి అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. రష్యా మీద ఆంక్షలు విధించి అక్కడి నుంచి కూడా చమురు కొనుగోలుకు ”అనుమతి ” ఇవ్వటాన్ని చూశాము. ఎందుకంటే లోకకల్యాణం కోసం అన్నట్లుగా మాట్లాడాడు. చైనాతో సహా అనేక దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ కూడా అందకుండా ఆంక్షలు విధించటాన్ని చూశాము. ఇలాంటి చర్యలతో ఆయా దేశాలు తమ స్వంత కాళ్ల మీద నిలిచేందుకు ప్రయత్నించి ముందుకు పోతున్నాయి. దురహం కారం, మితిమీరిన విశ్వాసంతో మంచి చెడ్డలను బేరీజు వేసుకోకుండా ఇరాన్‌పై దాడులకు దిగి ఇప్పుడు పరువు దక్కించుకొని ఎలా బయటపడాలా అని చూస్తున్నాడు ట్రంప్‌. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం గురించి ఎలాంటి సమీక్ష లేదని అధికారులు చెప్పినట్లు వాషింగ్ట్‌న్‌ పోస్టు పత్రిక రాసింది. ఏతావాతా అనేక మంది చెబుతున్న ఏకైక అంశం ఏమిటంటే అమెరికా, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల వలన అనేక విధాలుగా చైనా లాభపడిందని చెప్పటం కొంత అతిశయోక్తి, కడుపు మంట అయినప్పటికీ పాక్షిక సత్యం కూడా లేకపోలేదు. నమ్ముకున్న దేశాలకు మద్దతివ్వటంలో ఎలాంటి బెదిరింపులకు లొంగలేదని ఇరాన్‌ అంశంలో ప్రదర్శితమైంది. ఇది రానున్న రోజుల్లో అనేక పేద, వర్ధమానదేశాల్లో చైనా పట్ల విశ్వాసం మరింత పెరిగేందుకు తోడ్పడుతుంది!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -