నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన ‘డీలిమిటేషన్’ బిల్లును తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ప్రతులను ఆయన దహనం చేశారు. గతంలో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ప్రతిఘటన ఢిల్లీని దహించివేసిందని, ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టడం ద్వారా మరో జ్వాలను రగిలించానని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని ఆయన అన్నారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం’గా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత మాజీ సీఎం కరుణానిధి నివాసంపై మొదటి నల్ల జెండాను ఎగురవేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేవలం జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాజకీయ పలుకుబడి తగ్గిపోతుందని ఆయన అన్నారు
డీలిమిటేషన్ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్
- Advertisement -
- Advertisement -



