పోచారం, ఏనుగు మధ్య వర్గీయుల వాగ్వివాదం
ప్రజా పాలన సభలో ఉద్రిక్తత
నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్)
మండలంలో నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక మండల మహాసభలో ప్రోటోకాల్ వివాదంతో ఉద్రిక్తంగా మారింది. ఒక స్థాయిలో ప్రజా ప్రతినిధులు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. గురువారం బీర్కూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సభలో గ్రామ సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలతో వాతావరణం ఉద్రిక్తమైంది. ఇందులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు మరియు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీవుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపు రెండు గ్రూప్ ల వారు వాగ్వాదం పెట్టుకుంటూ సభను గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారు. పలు గ్రామ సర్పంచులు సభ వేదిక కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే మరి కొందరు సర్పంచులు నాయకులు కుర్చీలు తీసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నా సర్పంచులకు పక్కన కూర్చోవడం, రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో, సభ వేదిక టేబుల్స్, కుర్చీలను తొలగించారు.
సభ సాగించాలని మరికొందరు పట్టు పట్టారు. అధికారులు కింద కూర్చొని సభ నిర్వహించారు. బీర్కూర్ లో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచులకు ఆహ్వానించకుండా, ఇతరులను ఆహ్వానించడంతో స్థానిక గ్రామ సర్పంచ్ ధర్మతేజ, అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామ ప్రథమ పౌరుడు అంటే తెలియదా అంటూ అధికారులకు ప్రశ్నించారు. అధికారుల నుంచి సర్పంచ్ చేసిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటివేశారు. చివరికి గ్రామ సర్పంచ్ ధర్మతేజతో పాటు వార్డు మెంబర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు వేదికలపై ఆహ్వానించకపోవడం పట్ల ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తామన్నారు. సభకు హాజరైన సర్పంచులను వేదికపైకి ఆహ్వానించకపోవడం పట్ల బీర్కూర్ మండల సర్పంచ్ ధర్మ తేజ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమను ప్రజాప్రతినిధులుగా గుర్తించకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం అన్యాయమని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ధర్మతేజ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు వేదిక కింద కూర్చొని నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కార్యక్రమం సజావుగా సాగాల్సిన సమయంలో ఈ వివాదం తలెత్తడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సర్పంచులు తమకు తగిన స్థానాన్ని కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్చలు జరిపి కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రయత్నించారు. ఈ సంఘటనతో స్థానికంగా ప్రజాప్రతినిధుల గౌరవం, ప్రోటోకాల్ అమలు అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరుతున్నారు.
అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ 12 గంటలకు ప్రారంభం అయింది. అనంతరం తాగునీటి శాఖ సమస్యలు, పాఠశాలలో అసౌకర్యాలు, కుక్కల బెడద, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై మండల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సభలో రెండు వర్గాల నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది. గ్రామాల్లో ఎన్నో సమస్యలున్న వాటిని మరిచి వ్యక్తిగత ప్రయోజనాల స్వలంబన కోసం రెండు వర్గ నాయకులు ప్రయత్నించినట్లు కనబడింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సవాయి సింగ్, మండల పరిషత్ సూపర్ డెంట్ భాను ప్రకాష్, ఎంపీఓ మహబూబ్, తదితర శాఖ అధికారులు సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




