సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ
నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) జనరల్ బాడీ సమావేశం కోరం చిరంజీవి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ హాజరై మాట్లాడారు. ములుగు జిల్లాలో 73 వలస ఆదివాసి గుడాలలో గత నెల రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇష్టానుసారంగా గ్రామాలలో ఆదివాసీల సాగు భూములలో కందకాలు తవ్వుతున్నారని విమర్శించారు. గిరిజనులు గత 20 సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకుని భూములు దున్నుకుంటుంటే వారికి హక్కు పత్రాలు కల్పించకుండా గుడాల మీద దాడులు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
అటవీ హక్కుల చట్టం – 2006 ప్రకారం గతంలో ఈ భూములన్ని 2,3 సార్లు సర్వే చేసినారని, కేవలం ఎస్టి సర్టిఫికెట్లు లేనందున వీరికి హక్కు పత్రాలు రాలేదని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పోడు భూములకు గతంలో హామీ ఇచ్చినట్లుగా ఒక్క ఎకరానికి కూడా హక్కు పత్రాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంకా మిగిలిన 8 లక్షల ఎకరాలకు రాష్ట్రంలో హక్కుపత్రాలు ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. కానీ ఒక ఎకరానికి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబ సభ్యులకు కూడా మేమే హక్కు పత్రాలు ఇచ్చామని చెప్పిన విషయం సాంబశివ గుర్తు చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారందరికీ గిరిజనులకు, గిరిజనేతరులకు కూడా హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ములుగు జిల్లాలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న మంత్రి గారు పాతది వదిలేది లేదు, కొత్తది కొట్టేది లేదు అనే నినాదం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. కానీ నేడు వలస ఆదివాసి గూడెంలో దాడులు జరుగుతుంటే సైలెంట్ గా ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వెంటనే అటవీ హక్కుల చట్ట ప్రకారం వలస ఆదివాసులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని. గిరిజనగుడాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని. ఆదివాసులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని, వీరు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫారెస్ట్ అధికారులు గతంలో నక్సలైట్లను అభివృద్ధి నిరోధకులని వారిపై నిందలు వేసేవారని ఇప్పుడు ఫారెస్ట్ వాళ్లు ఏం చేస్తున్నారు తెలుసా అంటూ పసర నుండి ఏటూరు నాగారం వరకు నాలుగు లైన్ల రోడ్డుకు. తుపాకులగూడెం రోడ్డు నుండి కంతనపల్లి వరకు రోడ్డు మంజూరు. ఏనాడో కట్టిన కంతనపల్లి చెరువును రెండు తరాలు పైచిలుకు దాటిన తుపాకులగూడెం రోడ్డు నుండి ఎలిసెట్టిపల్లి వరకు ఉన్న దారిని నిలుపుదల చేశారంటే ఎంత అవివేకమో దీన్నిబట్టి అర్థమవుతుందన్నారు. బ్రిడ్జి నిర్మాణం చేసేటప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎక్కడ పండుకున్నారని నిర్మాణం పూర్తి అయిన తర్వాత కొంత సీసీ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత నిలుపుదల చేశారు ఈ విధానాన్ని ఏమంటారు అన్నారు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఫారెస్ట్ అధికారులు జిల్లాలో అనేక రోడ్డు మార్గాలు చెరువులు. కుంటలు అనేక అభివృద్ధి పనులను నిలుపుదల చేసిన వారిని అభివృద్ధి నిరోధకులు అందామా లేక గతంలో వారిని నిరోధకులు అందమా? మానవతా దృక్పథంతో వలస ఆదివాసీలకు సిపిఎం పార్టీగా సహాయం చేస్తే తప్పు పడుతున్నారు. గతంలో అనేక శాఖల వాళ్లు. అనేకమంది స్వచ్ఛంద సంఘాల వాళ్లు వంట పాత్రలు. బ్లాంకెట్లు. దోమతెరలు. మంచినీటి బోర్లు. చీకట్లో ఉన్నారని సోలార్ లైట్లు. ఇంకా అనేక రకాల సహాయాలు చేసిన వారిని ఏమంటారు మీరే చెప్పాలని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇప్పటికైనాదాడులు వెంటనే ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగుదారులను సమీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి దావూద్, మండల కార్యదర్శి కావిరి సుధాకర్, రవి, మధు, సురేష్, లక్ష్మణరావు, నర్సింగరావు, మహేందర్, చుక్కయ్య, భద్రయ్య, ఈశ్వర్, నందు తదితరులు పాల్గొన్నారు.


