– డిఆర్డిఓ జయదేవ్ ఆర్య..
నవతెలంగాణ – రాయపోల్
ప్రతి గ్రామంలో 100 మందికి ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను కనీసం 100 మందికి పెంచే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య అధికారులను ఆదేశించారు. శనివారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తేనే కూలీలకు నిరంతర ఉపాధి కల్పించవచ్చని తెలిపారు.గ్రామాల వారీగా అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ఉపాధి హామీ పనులను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ, మురుగు కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, రహదారి పక్కన మట్టి పనులు వంటి పనులను చేపట్టడం ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ, కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను క్రమం తప్పకుండా సేకరించి, డంపింగ్ షెడ్‌లకు తరలించాలని సూచించారు. మురుగు నీటి కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, దోమల వ్యాప్తిని నివారించే చర్యలు తీసుకోవాలని తెలిపారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బోర్లు, ట్యాంకులు, పైపులైన్లను సకాలంలో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఓ జనార్ధన్, ఎంపిఓ శివకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



