సినిమా రంగంలో తమకంటూ ఒక భరోసా కలిగిన ఆలంబన లేకపోతే వారి జీవితం ఎన్ని ఒడిదుడులకు గురవుతుందో, ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజెప్పే కథలు ఎన్నో వినిపిస్తాయి. సినిమా పరిశ్రమలో ఎవరికి ఎవరు కూడా నట జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేస్తూ ఆలంబనగా నిలిచే సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి. అట్లాంటి పరిస్థితులను ప్రతిబింబించే ఒక చీకటి తెరల సితార కథ ఇది.
1951లో వచ్చిన పాతాళభైరవి సినిమాలో నేపాళ మాంత్రికుడు నగర వీధులలో తన మాయలు ప్రదర్శిస్తూ హఠాత్తుగా ఒక అందమైన ఆడపిల్లను సష్టిస్తాడు. మహా జనానికి మరదలు పిల్ల అని ఆ అందమైన అమ్మాయికి పేరు పెట్టి నాట్యం చేయిస్తాడు. ”వగలోయి వగలు! తళుకు బెళుకు వగలు! లలలూ లలలూ!!” అంటూ అందంగా ఆడుతూ పాడుతుంది. ఆ నృత్య తార పేరు లక్ష్మీకాంత. ఆమె జీవితం హృదయాలను కదిలించే ఒక విషాద గాధ. పాతాళభైరవికి ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళితే…
1932. బళ్లారి వీధుల్లో రెండేళ్ల చిన్నారి ఒంటరిగా ఏడుస్తూ బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ నడుస్తోంది. అప్పుడే ఆ వైపు వచ్చిన ఒక వద్ధురాలు ఒంటరిగా ఉన్న ఆ పాపను చూసింది. పాప ముద్దుగా అందంగా ఉంది. చుట్టూ చూసింది. ఆ పిల్ల తాలూకు వ్యక్తులు ఎవరు ఆ చుట్టూరా లేరనే విషయం ఆమెకు అర్థమైంది.
చివరికి ఆ పాపను తీసుకుని ఒక చెట్టు కింద వేచి చూసింది. ఆ పాపకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వస్తారేమోనని. కానీ ఆ పాపతో సంబంధం ఉన్న వారెవరూ ఆమెకు కనిపించలేదు. సాయంత్రానికి ఆమె ఆ పాపను ఇంటికి తీసుకువెళ్లింది. ఆ పాపను ఇక తానే పెంచుకోవాలనుకుంది. ఆ పాప ముఖంలో ఒక ప్రకాశవంతమైన మెరుపు ఉందని, లక్ష్మీ కళ ఉట్టి పడుతుందనిపించి ఆ పాపకు ‘లక్ష్మీకాంత’ అని పేరు పెట్టింది.
లక్ష్మీకాంత పాత బళ్లారి ఉన్నత పాఠశాలలో చదువుకుంది. పాఠశాలలోని అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది. ఇంతలో 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. బళ్లారిలో పరిస్థితి మొత్తం వేగంగా మారుతోంది. అప్పుడే ఆమె ప్రఖ్యాత నాటక, సినీ కళాకారుడు బళ్లారి రాఘవను కలుసుకుంది. వివిధ నాటకాల ద్వారా నిధులు సేకరించి యుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడానికి అతని బృందంలో చేరింది. ఆ ప్రదర్శనలలో ఆమెకు నృత్యాలు చేసే అవకాశం కూడా లభించింది. అప్పుడే ఆమెను పెంచిన వద్ధురాలు దురాశతో తన నేపథ్యం గురించి చెప్పి, తన పెంపకానికి పరిహారంగా, నృత్యం, ఇతర వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బును ఇవ్వమని అడిగింది. ఒక దశలో లక్ష్మీకాంతను వేశ్యా వృత్తిలోకి దించాలని ఆమె ప్రయత్నం కూడా చేసింది. కానీ లక్ష్మీకాంత ఆమె కుయత్నాన్ని పసిగట్టి ఆమె ప్రయత్నాన్ని కొట్టి పారేసింది.. ఆ తరువాత లక్ష్మీకాంత నత్య గురువు సత్యనారాయణ వద్దకు వెళ్ళింది. ఆయన ఆమెకు నత్యంలోని ప్రాథమిక మెళకువలు నేర్పించారు. ఆమె తన కథను ఆయనకు చెప్పి, సహాయం చేయమని కోరింది. వారిద్దరూ కలిసి ప్రపంచ ప్రఖ్యాత నర్తకుడు, గురువు కలకత్తాలో ఉన్న ఉదరు శంకర్‌కు ఒక దరఖాస్తు రాశారు. తనకు నాట్యం నేర్చుకోవాలనే అభిరుచి ఉందని, తమ వద్ద విద్యార్థిగా చేర్చుకోవాల్సిందిగా ఆ దరఖాస్తులో విజ్ఞప్తి చేశారు.
ఉదరు శంకర్ అప్పటికే ప్రతిష్టాత్మకంగా సంగీత నృత్య ప్రధాన చిత్రం ‘కల్పన’ను మద్రాసులో నిర్మిస్తున్నానని, మద్రాసుకు రమ్మని ఆమెకు తిరుగు జాబు రాశాడు. దాంతో ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది.
చాలా కొద్దికాలం తర్వాతనే 1944లో ఉదరు శంకర్ మద్రాస్ వచ్చి కల్పన సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆయన చెప్పినట్లుగా ఆమె బళ్లారిని విడిచి మద్రాసుకు చేరుకుంది. కల్పన చిత్రాన్ని జెమిని స్టూడియోలో నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా నిర్మాణ సమయంలోనే ఎస్.ఎస్. వాసన్‌కు తను తర్వాత తీసిన సూపర్ హిట్ చిత్రం ‘చంద్రలేఖ’ చిత్రానికి బీజవాపన జరిగింది.
లక్ష్మీకాంత అక్కడికి చేరుకున్న తర్వాత ఉదరు శంకర్ తీసిన ఈ హిందీ చిత్రంలో పరిచయమైన ట్రావెన్‌కోర్ సోదరీమణులు లలిత, పద్మినిలు అలాగే పి.కె. సరస్వతిలను కలుసుకుంది. ఈ సినిమా నిర్మాణానికి చాలా కాలం పట్టింది, కానీ చివరికి 1948లో విడుదలైంది. ఈ చిత్రం, తన నృత్య బృందంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ గురువు గారి జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఆ బృందంలో లక్ష్మీకాంత షిమ్కీ అనే మహిళా సహచరిగా నటించింది. ఉదరు శంకర్ అందరినీ పరీక్షించి, షిమ్కీ పాత్రలో లక్ష్మీకాంత నటిస్తుందని నిర్ణయించుకున్నారు. అది ఆమెకు లభించిన గొప్ప గౌరవం. అవకాశం కూడా. తనకు ఇచ్చిన పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. ఆ సినిమా విడుదలై పరాజయం పాలైంది. కానీ ఇప్పుడు దానిని ఒక కళాఖండంగా పరిగణిస్తున్నారు. సినిమా పూర్తయిన తర్వాత, దాని నటీనటులు తమంతట తామే బ్రతకాల్సి వచ్చింది. ట్రావెన్‌కోర్ సోదరీమణుల చరిత్ర అందరికీ తెలిసిందే. పి.కె. సరస్వతి ఎక్కువగా తమిళ సినిమాలకే పరిమితమయ్యారు. కల్పన సినిమా ఆర్థికంగా పరాజయం పాలైనా భారతీయ సినిమా రంగంలో ఒక క్లాసిక్‌గా చరిత్రకి ఎక్కింది. లక్ష్మీకాంత డాన్స్‌లో ఉన్న గ్రేస్‌ను చూసిన ఉదయ శంకర్ ఆమెను తమ నాట్య బృందంతో విదేశాలకు తీసుకువెళ్తానని చెప్పగా ఆమె పెంపుడు తల్లి అంగీకరించలేదు. దాంతో లక్ష్మీకాంత మద్రాసులోనే స్తిరపడిపోయింది.
ఆ తరువాత జూపిటర్ ఫిల్మ్స్ వారు లక్ష్మీకాంతను తమ పర్మినెంట్ ఆర్టిస్టుగా నియమించుకున్నారు, కానీ దానివల్ల ఆమెకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఎందుకంటే వారి ఒప్పందం ప్రకారం ఆమెకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వలేదు. కానీ వారు ఆమెకు మోహిని, విజయకుమారి, అభిమన్యు, వేలైకారి మొదలైన చిత్రాలలో నత్య పాత్రలు ఇచ్చారు. అప్పుడే ఆమెకు ‘మన దేశం’ (1949′ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇది ఎన్.టి. రామారావు తొలి చిత్రం. ఆమెది వంగరతో కలిసి నటించిన ఒక హాస్య పాత్ర. దానితో ఆమె గుర్తింపు పొందింది. 1950లో వచ్చిన తెలుగు చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (తమిళ డబ్బింగ్‌లో ‘గ్రామ పెణ్’)లో ఆమె విలన్ ప్రియురాలి పాత్ర పోషించింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో మరింత గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆమె తమిళ చిత్రం ‘కష్ణ విజయం’లో ఒక అందమైన దెయ్యం పాత్రను చేసింది.
ఆ తర్వాత లక్ష్మీకాంత ‘మాయలమారి’ (1951)లో నటించింది. ‘పాతాళ భైరవి’ (1951) లో ‘లలలూ’ పాటకు ఆమె చేసిన నత్యం తెలుగు సినిమా రంగంలో స్థిరపడడానికి దోహదపడింది. ఈ సినిమా హిందీ వెర్షన్ తీసినప్పుడు ఈ పాటను దర్శకుడు కేవీ రెడ్డి రంగులలో చిత్రీకరించడం విశేషం. ఆ తర్వాత తెలుగులో’ నిర్దోషి, తమిళంలో ‘నిరపరాధి’ (1952), ‘ఒక రాత్రి/ ఒరే ఇరవు’ (1951) వంటి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాలలో నటించింది. ఆమె నర్తించిన ‘అయ్య స్వామి’ పాటకు నత్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. దీని తర్వాత, ప్రముఖ కొరియోగ్రాఫర్ చోప్రాతో కలిసి ‘నవజీవనం’లో ఆమె చేసిన నత్యం ఉంది. ఆమె ఎంతగా విజయం సాధించిందంటే, ఆమెకు వరుసగా తెలుగు, తమిళ చిత్రాలైన ‘వాలి సుగ్రీవ (1950), సౌదామిని (1951), అగ్ని పరీక్ష (1951), మాపిళ్ళై, సత్య శోధనై, నల్ల కాలం, పోర్టర్ కందన’్, జెమిని వారి ‘అపూర్వ సహోదరులు’ మొదలైన వాటిలో అవకాశాలు వచ్చాయి. దురదష్టవశాత్తు సినిమాల్లో కొన్ని పరాజయం పాలైనవి.
1951లో త్రిపురనేని గోపీచంద్ ‘ప్రియురాలు’ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంతను టైటిల్ పాత్రలో తీసుకున్నారు. ఆమె అద్భుతమైన అందంతో ఉండేది. షావుకారు జానకి చెల్లెలు, అందాల భామ అయిన కష్ణకుమారి అతడిని తన కోసమే ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, కొత్త హీరో అయిన జగ్గయ్య ఆమె కోసం పిచ్చిగా పడిపోవడంలో ఆశ్చర్యం లేదు.
ఆ చిత్రం పరాజయం పాలైంది. అప్పటికే హీరోయిన్ అయినందున, లక్ష్మీకాంతకు డ్యాన్స్ పాత్రలు చేయవద్దని తప్పుడు సలహా ఇచ్చారు. 1953లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రపంచం’లో జి. వరలక్ష్మితో పాటు లక్ష్మీకాంత కూడా మరొక హీరోయిన్‌గా నటించింది.
ఆమె ఆ తర్వాత ‘అంతే కావాలి’, ‘ఇద్దరు పెళ్ళాలు’, ‘బాల సన్యాసమ్మ కథ’ వంటి తెలుగు చిత్రాలలో అడపాదడపా పాత్రలు చేసింది. ‘పోనా మచ్చాన్, తిరుంబి వందన్ / వెళ్ళిన బావ తిరిగి వచ్చాడు (1954), ‘నాన్ పెట్ర సెల్వం’ వంటి తమిళ చిత్రాలలో తమిళ చిత్ర నిర్మాతలు ఆమెకు మంచి పాత్రలు ఇచ్చారు.
ఈ సమయంలో శూన్యంగా ఉన్న ఆమె వ్యక్తిగత జీవితం నటుడు చంద్రశేఖర్‌ను కలిసినప్పుడు మెరుగుపడింది. ఆయన ‘ప్రియురాలు’, ‘నిర్దోషి’, ‘పేరంటాలు’, ‘సంక్రాంతి’, ‘మేనరికం’, ‘లక్ష్మమ్మ కథ’, ‘చక్రపాణి’ వంటి చిత్రాలలో నటించారు. ఇద్దరూ సహ జీవనం చేశారు. కానీ వారిద్దరి కెరీర్లు కుప్పకూలిపోవడంతో వారి సహజీవనం కూడా స్వల్పకాలికంగానే ముగిసింది. ఆ తర్వాత 1955లో ఒక పహిల్వాన్‌ను నమ్మి అతని సహచర్యంలో బతకడానికి నిర్ణయించుకున్నది. కానీ దురదష్టం ఏమిటంటే అతను ఆమెతో ఒక సినిమా తీయించడానికి ప్రయత్నాలు చేసి డబ్బులు అంతా ఖర్చయ్యేలా చేశాడు. ఇంతలో ఆమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా పరాజయం పాలవడంతో సినిమా అవకాశాలు తగ్గడం మొదలైంది. కొద్దికాలం మలయాళ సినిమాల్లో కూడా నటించింది ఆమె. ఇవన్నీ ఇలా ఉండగా తను ప్రేమించి, ఆదరించిన వ్యక్తి ఒకానొక రోజు ఆమె ఇంట్లో ఉన్న సొమ్ముతో పరారైపోయాడు. ఏమి చేయాలో పాలుపోక ఆమె తానే కథానాయికగా సినిమాలు నిర్మించడానికి ప్రయత్నించింది. ఆ సినిమాలు పూర్తికాకపోవడంతో ఆమె డబ్బు నష్టపోయింది. చివరికి బతుకుతెరువు కోసం ఆమె కొన్ని ఆవులను కొనుక్కుని పాల వ్యాపారం చేసింది. తగినంత లౌక్యం లేకపోవడంతో ఆమె నష్టపోయి, తన పశువులన్నింటినీ అమ్మేసింది. ఆమె నివాసం ఒక గుడిసెలోకి మారింది.
చివరగా… ఆ తర్వాత ఆ నోట ఈ నోట విన్నదేమిటంటే లక్ష్మికాంత ఆర్థిక పరిస్థితి చితికిపోయిన దశలో ఆమె వైజయంతిమాల ఇంటికి వెళ్లి ఆమె కొడుకుకి ఆయాగా పనిచేసిందని అన్నారు. అనంతరం అనుమానాస్పద పరిస్థితులలో ఆమె ఆ ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఒంటరిగా అనాధగా జీవితం ప్రారంభించిన లక్ష్మీకాంత ఒంటరిగానే పాండిచ్చేరిలో ఆఖరి రోజులను గడుపుతూ 2014లో చనిపోయింది. పాపం… లక్ష్మీకాంత!
(రెఫరెన్స్ కర్టసి: లక్ష్మీ ప్రియ )
– హెచ్ రమేష్ బాబు,
గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత
7780736386



