పోతులవాయి భూమి వివాదం ఉద్రిక్తం
నవతెలంగాణ – కాటారం:
మండలం పోతులవాయి గ్రామ శివారు సర్వే నెంబర్ 254/2 భూమి వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పిన పొట్ట పోచమ్మ కుటుంబం, అధికారులు దౌర్జన్యంగా తమ నివాసాన్ని కూల్చివేశారని ఆరోపించింది.
బాధితుల ప్రకారం, ఏప్రిల్ 9న పోలీసులు, రెవెన్యూ అధికారులు సర్వే పేరుతో సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చివేశారని తెలిపారు. ఈ సమయంలో బాధితుడిని బలవంతంగా నిర్బంధించి, ప్రజల ముందే అవమానించారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, ఈ భూమిపై ఎలాంటి జోక్యం చేసుకోవద్దని 2025లో తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అధికారులు వ్యవహరించారని బాధితులు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల ధిక్కరణపై ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై బహుజన సమాజ్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, సంబంధిత పోలీసు, రెవెన్యూ అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు
హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించి ఇల్లు కూల్చివేత..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



