స్థల సేకరణ చేపట్టండి :
అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న బీసీ గురుకులాలకు సొంత భవనాలను నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖపై ఆయన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, ప్రస్తుతం కేవలం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. వివిధ జిల్లాల్లో గురుకుల పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థల సేకరణ చేపట్టాలని మంత్రి వారిని ఆదేశించారు. ఇప్పటికే స్థలం అందుబాటులో ఉన్న గురుకుల పాఠశాలలకు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కతో చర్చించి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.గురుకులాల్లో నిర్దేశించిన మెనూ అమలు చేయాలనీ, మెరుగైన ఉత్తీర్ణత కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని మంత్రి సూచించారు. బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల 6 వేల దరఖాస్తులు అందినట్టు అధికారులు మంత్రికి వివరించారు. కుట్టు మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 30వ తేదీతో ముగియనున్నందున, అర్హులైన బీసీ మహిళలకు పథకం ప్రయోజనం అందేలా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాల మాయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ గురుకులాలకు సొంత భవనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



