పట్టణ పేదల సొంతింటి
కలకు తొలి అడుగు
ఏడాదిలో గృహప్రవేశాలే లక్ష్యం : రాష్ట్ర మంత్రి పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం
నవతెలంగాణ- మియాపూర్
పట్ణణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు పడిందని, క్యూర్ పరిధిలో 1,160 ఇండ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్జి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలోని మల్కం చెరువు వెనుక 2.85 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు పీఏసీ చైర్మెన్, ఎమ్మెల్యే గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారానికి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంతో శిలాఫలకం పడిందన్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో పేదల కోసం ఇండ్ల నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు.
ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఫేజ్-1లో 480 ఇండ్లు, ఫేజ్-2లో 680, మొత్తం 1,160 ఇండ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో నాలుగు టవర్లను నిర్మించనుండగా.. ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉంటాయని తెలిపారు. ఒక్కో అంతస్తులో 12 ఫ్లాట్ల చొప్పున నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఒక్కో ఫ్లాట్ సుమారు 525–528 చదరపు అడుగుల విస్తీర్ణంలో బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో నిర్మించనున్నట్టు వివరించారు. లబ్దిదారుని వాటాగా రూ.6 లక్షలు, ప్రభుత్వ సబ్సిడీగా రూ.5 లక్షలు ఉండగా, భూమిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇండ్లలో లబ్దిదారుని పేరుతో అన్ డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు చెప్పారు. భూముల ధరలు భారీగా ఉన్న ఈ ప్రాంతంలో పేదలకు నగరానికి దూరంగా కాకుండా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు దగ్గరగా సొంతింటిని అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిర్మిస్తున్న ఇండ్లు పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తాయని తెలిపారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఆటో రిక్షా, ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్న వారికి కూడా ఇందిరమ్మ టవర్స్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం కారణంగా వారు అనర్హులు కాకుండా నిజమైన అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ట్యాక్సీ డ్రైవర్లకు కూడా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన లక్కీడిప్ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బోగారపు దయానంద్ గుప్తా, యాదవ కో-ఆపరేటివ్ చైర్మెన్ రఘునాథ్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, హౌసింగ్ పీడీ నాయక్, ఆర్డీఓ శ్రీధర్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్యూర్ పరిధిలో 1,160 ఇండ్ల నిర్మాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



