ఆయన మరణం తీరనిలోటు : కె.నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ కమ్యూనిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధులు ఏటుకూరి కృష్ణమూర్తి (104) మరణించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని ఉంచారు. ఆ పార్టీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, బంధు మిత్రులు ఆయనకు కడసారి నివాళులు అర్పించారు. ఏటుకూరి కృష్ణమూర్తి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటనీ, ఆయన తన నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన అమరజీవి అని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, జాతీయ కార్యదర్శులు కె.రామకృష్ణ, పల్లా వెంకట్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్పారు. 104 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని ప్రజాసేవ, ఉద్యమాలు, హక్కుల కోసం పోరాటానికి అంకితం చేసిన ఆయన సేవలను స్మరించుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత కందిమళ్ల ప్రతాపరెడ్డి, రాష్ట్ర నాయకులు పి.ప్రేమ్ పావని, ఎన్.జ్యోతి, ఆర్.అంజయ్యనాయక్, సిఆర్ పౌండేషన్ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ రజని, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, నాయకులు కెవిఎల్, బొమ్మగాని నాగభూషణం, కె.ధర్మేంద్ర, నళిని తదితరులు ఉన్నారు. అనంతరం మఖ్దూం భవన్ నుంచి నుంచి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ ఆయన కుమారుడు ఏటుకూరి శ్రీనివాస మూర్తి అంత్యక్రియలను పూర్తి చేశారు.
కృష్ణమూర్తి సేవలు చిరస్మరణీయం : కూనంనేని
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు నేత ఏటుకూరి కృష్ణమూర్తి సేవలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మార్కిస్టు మేధావిగా పేరొందిన తన అన్న ఏటుకూరి బలరామ మూర్తి, తండ్రి సీతారామయ్య ప్రభావంతో చిన్నతనం నుంచే విద్యార్థి ఉద్యమాల్లో, కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో కృష్ణమూర్తి చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుశిక్షలు అనుభవించారని గుర్తుచేశారు. రాయల్ ఇండియా నేవీ సైనికుల పోరాటానికి సంఘీభావంగా ప్రత్యేక పార్టీ సెల్‌ను ఏర్పాటు చేసి బ్రిటిష్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడారనీ, దీంతో కృష్ణమూర్తిని బ్రిటీష్ ఆర్మీ అరెస్టు చేసి లాహోర్ జైలులో ఏడు నెలల పాటు నిర్బంధించిన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సమైఖ్య పరచి వారి హక్కుల కోసం ఎన్‌జీఓ అసోసియేషన్ లో ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్య్ర సమరయోధులను సమైక్య పరచి యూనియన్ ఏర్పాటు చేయడంలో ఆయనది కీలక పాత్ర అని పేర్కొన్నారు.
కమ్యూనిస్టు నేత ఏటుకూరి కృష్ణమూర్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



