Saturday, June 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్

- Advertisement -

ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో కీలకపాత్ర ఇప్పటికే పోలీసుల అదుపులో పలువురు
నవతెలంగాణ శేరిలింగంపల్లి
ప్రభుత్వ భూమి కబ్జా చేయాలనే కుట్ర కేసులో ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడిని తమిళనాడులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని సర్వే నెం.18లో ఉన్న సుమారు 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులు సృష్టించారు. ఈ నకిలీ జీవోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గత నెల 23న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.990/2026 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో నిమ్మల కుటుంబ సభ్యులు, రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రవీణ్‌ ‌కుమార్ ఉన్నారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం పోలీస్ కస్టడీ మంజూరు అయింది. వీరి నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు పరస్పర కుట్ర పన్ని ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు తేలింది. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు అధికారిక పత్రాలు, నకిలీ రికార్డులు సృష్టించినట్టు వెల్లడైందన్నారు.

బొల్లా బ్రహ్మనాయుడు సుమారు రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. అందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, ఇప్పటికే అరెస్టయిన నిందితుడు రాధాకృష్ణకు రూ.4 కోట్లు, ఇతర సంబంధిత వ్యక్తులకు మరో రూ.4 కోట్లు చెల్లించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ నిధులను నకిలీ జీవోలు, నకిలీ ప్రభుత్వ అనుమతులు, తప్పుడు పత్రాల తయారీ ద్వారా భూమిపై అక్రమ హక్కులు సృష్టించేందుకు వినియోగించినట్టు గుర్తించారు. భూ కబ్జా కుట్రలో బొల్లా బ్రహ్మనాయుడు ప్రధానంగా వ్యవహరించినట్టు తేలింది. దాంతో నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ అధికారుల పేర్లు, సంతకాల దుర్వినియోగం, అలాగే కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు తీవ్రత, దర్యాప్తు దశ, ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -