Saturday, June 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొక్కలు నాటడం జీవితంలో భాగమవ్వాలి

మొక్కలు నాటడం జీవితంలో భాగమవ్వాలి

- Advertisement -

ప్రజలందరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-కొండపాక
మొక్కలు నాటే ప్రక్రియ.. సామాజిక బాధ్యతగా జరగాలని, ప్రజల జీవితంలో ఒక భాగం కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగ శివారులో ఉన్న అర్బన్ ఆక్సిజన్ పార్క్‌లో ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి తదితరులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ‘చెట్టు విలువ తెలుసా’ అనే పోస్టర్ ఆవిష్కరించారు. మొక్కలు నాటి సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న వేళ పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడానికి అన్ని గ్రామాల్లో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా పండ్ల మొక్కలు ఉండేవని, ప్రస్తుతం మొక్కలు లేకపోవడంతో కోతులు గ్రామాల్లోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయని తెలిపారు. ఢిల్లీలో కాలుష్యంతో నివసించే పరిస్థితి ఉందని, తెలంగాణలో అలాంటి పరిస్ధితి రాకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి ఈవీ పాలసీ తీసుకొచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సున్నా టాక్స్ అమలు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడంలో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలని.. మంచిగా మొక్కలు నాటిన గ్రామాల్లో సర్పంచ్‌లను అభినందించాలని అధికారులకు సూచించారు.

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మొక్కలు పెంచే కార్యక్రమం ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. పర్యావరణం దెబ్బతినడంతో రానురాను ఆక్సిజన్ సిలిండర్లను బ్యాగుల్లో పెట్టుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్లాస్టిక్ వాడటం మూలంగా క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుందని, ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు వెళ్లే జాతీయ రహదారిపై ఈ సంవత్సరం ఒక లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. దానిలో భాగంగా ముందుగా భూంపల్లి-అక్బర్‌పేట క్రాస్‌రోడ్ నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా 20వేల మొక్కలను ఈ నెలలో నాటేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎప్పటికీ వరి పంటలే కాకుండా పంట మార్పిడి చేయాలని మిల్లెట్స్, పప్పు, నూనె దినుసులు పండించాలన్నారు. కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 22 లక్షల మొక్కలను వన మహోత్సవం కార్యక్రమం ద్వారా నాటి సంరక్షించినట్టు తెలిపారు. ఈ సంవత్సరం 17 లక్షల మొక్కలు జిల్లా వ్యాప్తంగా నాటేందుకు నర్సరీల్లో మొక్కలను వృద్ధి చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీ శాఖ అధికారి సంధ్యారాణి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దరిపెల్లి చంద్రం, మర్పడగా సర్పంచ్ ఆకారం బాలరాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి రవీందర్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -