నవతెలంగాణ-హైదరాబాద్: గత రెండు దశాబ్దాలుగా సాధించిన లింగ సమానత్వ పురోగతి ప్రస్తుతం తీవ్ర ముప్పులో పడిందని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతుండటమే దీనికి ప్రధాన కారణమని విడుదల చేసిన ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2026’ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 69.2 శాతం లింగ సమానత్వం సాధించినప్పటికీ, పూర్తిస్థాయి సమానత్వం సిద్ధించడానికి మరో 120 ఏళ్లు పడుతుందని జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ హెచ్చరించింది. కాగా, ఆ సూచికలో భారతదేశం 131వ స్థానంలో నిలిచింది. మొత్తం 145 దేశాల జాబితాలో కేవలం 14 దేశాలు మాత్రమే భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి. దేశంలో మహిళల సమానత్వం, భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నివేదికలోని కీలక అంశాలు:
* తీవ్రమైన వ్యత్యాసాలు: వ్యాపార, రాజకీయ రంగాల్లో అగ్ర నాయకత్వ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇంకా చాలా తక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సీఈఓ (CEO) పోస్టుల్లో మహిళలు 20 శాతం కంటే తక్కువగానే ఉన్నారు. అలాగే, మహిళలు నిర్వహించే మంత్రిత్వ శాఖల్లో కేవలం 10 శాతం మాత్రమే కీలకమైనవిగా ఉన్నాయి.
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): ఏఐ రంగంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, ఏఐ ఇంజనీర్లలో మహిళల సంఖ్య 20 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
* ఐస్‌లాండ్ అగ్రస్థానం: వరుసగా 17వ ఏడాది ఐస్‌లాండ్ 93 శాతం సమానత్వంతో మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, నార్వే, నమీబియా, యూకే తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
* అగ్రరాజ్యాలకు దిగజారిన ర్యాంకులు: అమెరికా గత ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలు దిగజారి 47వ ర్యాంకుకు పడిపోయింది. అమెరికా కేబినెట్‌లో మహిళా మంత్రుల సంఖ్య తగ్గడమే దీనికి కారణం.
టాప్ -10 దేశాలు
131వ స్థానంలోనే భారత్ :
మొత్తం 145 దేశాల జాబితాలో భారత్ 131వ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ ఆమోదిత సగటు 69.2 శాతంతో పోలిస్తే, అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో లింగ సమానత్వ శాతం కేవలం 64.5 శాతంగానే ఉండి ఆందోళన కలిగిస్తోంది. భారత్ కంటే వెనుక కేవలం 14 దేశాలు మాత్రమే ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పాపువా న్యూగినియా, కువైట్, ఒమన్, ఖతార్, తజికిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, మాలి, అల్జీరియా, కాంగో వంటి కొన్ని దేశాలు మాత్రమే ఈ సూచికలో భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలను కొలిచే సబ్-ఇండెక్స్‌లో భారత్ స్కోరు 41.2 శాతంగా ఉంది. ఇది గతేడాది కంటే 0.5 శాతం పెరిగినప్పటికీ, 2013లో భారత్ సాధించిన అత్యుత్తమ స్కోరు కంటే 3.5 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.
* ఉపాధి, ఆర్థిక భాగస్వామ్యం: భారత్‌లో విద్యాభ్యాసంలో సాధించిన ప్రగతి వల్ల కొంత పురోగతి కనిపించినప్పటికీ, ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యం గత 20 ఏళ్లుగా పెద్దగా మారలేదు. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల ఉప-సూచికలో (Sub-index) భారత్ స్కోరు 41.2 శాతంగా నమోదు కాగా, ఇది గతేడాది కంటే 0.5 శాతం పెరిగినప్పటికీ, 2013లో నమోదైన గరిష్ఠ స్కోరు కంటే ఇంకా 3.5 శాతం తక్కువగా ఉంది.
* పదవులు, ప్రాతినిధ్యం: ప్రొఫెషనల్, టెక్నికల్ ఉద్యోగాల్లో మహిళల శాతం 49.9 శాతానికి చేరుకోగా, శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లలో మహిళల వాటా కేవలం 13.1 శాతంగానే ఉందని నివేదిక తెలిపింది.
* రాజకీయాల్లో మహిళలు: పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం 16.1 శాతానికి పెరిగినప్పటికీ, కేంద్ర కేబినెట్‌లో మహిళా మంత్రుల భాగస్వామ్యం 2019లో ఉన్న 30 శాతం గరిష్ఠం నుండి ప్రస్తుతం 5.9 శాతానికి పడిపోయింది.
మరోవైపు, ఆసియా ఖండంలో పొరుగున ఉన్న చైనా ఏడు స్థానాలు ఎగబాకి 96వ ర్యాంకు సాధించగా, ఆఫ్రికా ఖండానికి చెందిన నమీబియా 4వ స్థానం దక్కించుకోవడం విశేషం. ప్రపంచ ఆర్థిక వేదిక మేనేజింగ్ డైరెక్టర్ సాదియా జహిదీ మాట్లాడుతూ… “లింగ సమానత్వం అనేది ఆర్థిక వృద్ధికి ప్రాతిపదిక. ప్రభుత్వాలు, యజమానులు సరైన విధానాలను మరింత వేగంగా అమలు చేయాలి” అని పిలుపునిచ్చారు.



