Sunday, April 19, 2026
E-PAPER
Homeజాతీయంపాత బిల్లునే అమలు చేయండి

పాత బిల్లునే అమలు చేయండి

- Advertisement -

మహిళా రిజర్వేషన్‌పై ప్రతిపక్షాల డిమాండ్‌
ప్రధాని మోడీకి లేఖ రాయాలని నిర్ణయం
న్యూఢిల్లీ :
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయిన ప్రతిపక్షాలు ప్రధాని మోడీకి లేఖ రాయాలని నిర్ణయించాయి. గతంలో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన పాత బిల్లును అమలు చేయాలనే డిమాండ్‌కు సిద్ధమయ్యాయి. పార్లమెంటులో సీట్ల పెంపుతో సంబంధం లేకుండా తక్షణమే పాత మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయాలని కోరుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు కలిసి ఇప్పటికే ఇండీ కూటమిగా ఏర్పడిన విషయం విదితమే. ప్రతిపక్ష నేతలంతా కలిసి మహిళా రిజర్వేషన్‌ బిల్లు వ్యవహారంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతున్నారు. కేంద్ర తప్పిదాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో అన్ని పార్టీలూ కలిసి ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రెస్‌ మీట్‌ నిర్వహించి కేంద్ర వైఖరిని ఎండగట్టడంతోపాటు బిల్లును అమలులోకి తేవాలని డిమాండ్‌ చేయబోతున్నాయి. అలాగే, రిజర్వేషన్‌ బిల్లు పేరుతో బీజేపీ భారతీయ రాజకీయ చిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శిస్తున్నాయి. సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33 శాతం మహిళా కోటా అమలు చేయాలని కోరుతున్నాయి. సీట్ల పెంపు ద్వారా రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని, రిజర్వేషన్‌ పాలసీ ఉద్దేశమే మారిపోతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతు న్నాయి. సభలో కొత్త రిజర్వేషన్‌ బిల్లు ఓడిపోవడంతో పాత బిల్లుపై పట్టుబట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2029 ఎన్నికల్లో లోక్‌సభలో మహిళా కోటా అమలుకు అనుగుణంగా, 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభలో సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచుతూ డీలిమిటేషన్‌ బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు సభలో 298 ఓట్లు అనుకూలంగా, 230 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. కావాల్సిన ఓట్ల సంఖ్య 352. దీంతో బిల్లు 54 ఓట్ల తేడాతో వీగిపోయింది. దీంతో మహిళా కోటాకు మళ్లీ అడ్డంకి ఏర్పడినట్టయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -