Sunday, July 26, 2026
E-PAPER
Homeఖమ్మంఎల్నినో ప్రభావంతో అంతరపంటల సాగు

ఎల్నినో ప్రభావంతో అంతరపంటల సాగు

- Advertisement -

– లోటు వర్షాలతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖ
– ఈ నెల 27, 28, 29 తేదీల్లో రైతు వేదికల్లో కంటిన్జెన్సీ విత్తన మేళా లు
– పంటల వైవిధ్యీకరణతో నష్టాల నివారణకు ప్రణాళికలు
– ఏడీఏ పెంటేల రవికుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వానాకాలంలో ఇప్పటివరకు నమోదుకావాల్సిన వర్షపాతంతో పోలిస్తే జిల్లాలో 31.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితులు ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతుండటంతో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో గుండాల, ఇల్లందు, జూలూరుపాడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, చండ్రుగొండ మండలంలో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 18 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవడంతో సాగు విస్తీర్ణం తగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో జూలై 27, 28, 29 తేదీల్లో ప్రతి మండలంలోని రైతు వేదికలో కంటిన్జెన్సీ విత్తన మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేళాల్లో గ్రామాల వారీగా ఇప్పటికే సాగు చేసిన పంటలు, ఇంకా సాగు చేయని భూముల వివరాలను సేకరించి, మిగిలిన భూములకు అనువైన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందిస్తారు. ఆ ప్రణాళిక ఆధారంగా అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతారు.

ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత
కంటిన్జెన్సీ ప్రణాళికలో భాగంగా అపరాల్లో కంది, మినుము, పెసర, అలసంద, సెనగ, నూనెగింజల పంటల్లో నువ్వులు, వేరుశెనగ, సన్‌ఫ్లవర్, కుసుమ, చిరుధాన్యాల్లో జొన్న, రాగులు, కొర్రలు, సజ్జలుతో పాటు కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

విత్తనాల సరఫరాకు పలు సంస్థలు
విత్తన మేళా కోసం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్, జాతీయ విత్తన సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కాళోజి నారాయణరావు ఉద్యాన విశ్వవిద్యాలయం, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, జాతీయ మిల్లెట్స్ పరిశోధనా సంస్థ, ఇక్రీసాట్, కేంద్ర మెట్ట పంటల పరిశోధనా సంస్థ, ప్రైవేట్ విత్తన కంపెనీలు విత్తనాలను అందుబాటులో ఉంచనున్నాయి.

రైతుల్లో పెరుగుతున్న అవగాహన
వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు, ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమాల ద్వారా రైతుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరిగిందని అశ్వారావుపేట సహాయ వ్యవసాయ సంచాలకుడు పెంటేల రవి కుమార్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలువురు రైతులు పంటల వైవిధ్యీకరణను స్వీకరిస్తున్నారు.

ప్రస్తుతం రైతులు పత్తిలో అంతర పంటగా పెసర, మినుము, కంది, ఆయిల్‌పామ్‌లో కూరగాయలు, మొక్కజొన్న, అలాగే నేరుగా విత్తే (డీఎస్‌ఆర్) విధానంలో వరి సాగు చేస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న రైతులు వరికి బదులుగా కూరగాయల సాగుపై దృష్టి సారించడం విశేషం.

వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -