నవతెలంగాణ – అశ్వారావుపేట
మే నెలలో సేకరించిన పామాయిల్ గెలల ధరను టన్నుకు రూ.23,852 లు గా ఆయిల్ ఫెడ్ పాలక మండలి సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో టన్ను గెలల ధర రూ.23501 లు గా ఉండగా,మే నెలకు రూ.23,852 లు గా నిర్ణయించడంతో టన్నుకు రూ.351 లు పెరుగుదల నమోదైంది. గెలలు సైతం ఏప్రిల్ నెలలో 29076.060 మెట్రిక్ టన్నుల దిగుబడి కాగా మే నెలలో రెండింతలు పెరిగి 50951 మెట్రిక్ టన్నుల గెలలు దిగుబడి వచ్చింది.
గత ఐదు నెలలుగా గెలల ధరలు నెలనెలా పెరుగుతూ రావడం పామాయిల్ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.గెలల దిగుబడులు సైతం పెరగడం, ధరలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఏడాది పామాయిల్ సాగు రైతులకు ఆశాజనకంగా మారింది. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులతో పాటు కొత్తగా పామాయిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా రానున్న వ్యవసాయ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 40 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరించాలని ఆయిల్ ఫెడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.గెలల దిగుబడి, ధరలు ఇదే విధంగా కొనసాగితే పామాయిల్ రైతులు ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉందని రైతు వర్గాలు భావిస్తున్నాయి. కొత్త రైతులు కూడా పామాయిల్ సాగుపై ఆసక్తి చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నెలవారీ గెలల దిగుబడి ధరలు
నెల గెలలు (టన్నులు) ధర (రూ./టన్ను)
జనవరి 9344.220 20456
ఫిబ్రవరి 8316.847 21546
మార్చి 14824.990 23005
ఏప్రిల్ 29076,060 23501
మే 50951 23852
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు గెలల దిగుబడి, ధరలలో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా మే నెలలో గెలల సేకరణ 50951 మెట్రిక్ టన్నులకు చేరడం, ధర టన్నుకు రూ.23,852 కు పెరగడం రైతుల్లో మరి మరింత జోష్ నింపింది.ఏప్రిల్ నెలలో టన్ను పామాయిల్ గెలల ధర రూ.23501 ఉండగా ఆ ధరను అధిగమించి మే లో రూ.23,852 లు గా ఆల్ టైమ్ రికార్డుగా నమోదయ్యింది.ఈ వివరాల ను ఆయిల్ ఫెడ్ పి అండ్ పి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి,డీఓ సబావత్ శంకర్, అశ్వారావుపేట, అప్పారావు పేట పామాయిల్ పరిశ్రమ ల మేనేజర్ లు ఎంఎన్ కార్తీక్,ఎం.నాగబాబులు వెల్లడించారు.



