Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంధన భద్రతలో సింగరేణి కీలక పాత్ర పోషించాలి

ఇంధన భద్రతలో సింగరేణి కీలక పాత్ర పోషించాలి

- Advertisement -


సంస్థ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

​నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆకాంక్ష‍ించారు. శనివారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌లో ఆ సంస్థ పనితీరు, భవిష్యత్‌ ‌కార్యచరణపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న 10 నుంచి 15 ఎండ్లకు సరిపడా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు, గనుల శాఖ నిర్వహించే వేలంలో సింగరేణి చురుగ్గా పాల్గొని కొత్త బ్లాకులను దక్కించుకోవాలని సూచించారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రామగుండం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, కొత్త గనులు, వాటి ఉత్పత్తి, అనుమతుల స్థితిగతులపై మంత్రి గనుల వారీగా సమీక్షించారు. పోటీ మార్కెట్లో ప్రభుత్వ సంస్థలు నిలబడాలంటే నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవడంతోపాటు ప్రతీ ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కంపెనీ అభివృద్ధికి, సంస్కరణల అమలుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించుకోవాలన్నారు. సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హమీ ఇచ్చారు. ఆ సంస్థకు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌ హోదా, అటవీ భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎమ్‌డీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామనీ, ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు రవాణా సమస్యలను పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో కరెంటు ఉత్పత్తికి నిరంతర ఇంధన సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ కస్సి, బొగ్గు శాఖ సలహాదారులు వీరా రెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎం.తిరుమలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -