వడాయి గూడెం సర్పంచ్ నీలా శిరీష..
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
మండలంలోని వడాయిగూడెం (రాయగిరి) గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 518 లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేద ప్రజల గృహాలను, ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాలను నిషిద్ధ జాబితా (22-ఏ ) నుండి వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచ్ నీల శిరీష డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కి గ్రామ పంచాయతీ తరపున ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నీల శిరీష మాట్లాడుతూ వడాయిగూడెం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 518 లో సుమారు 467 ఎకరాల విస్తీర్ణం కలదని, ఇందులో గత 70-80 సంవత్సరాలుగా వందలాది మంది పేద కుటుంబాలు ఇండ్లు నిర్మించుకుని జీవిస్తున్నారని తెలిపారు. వీరందరికీ గ్రామపంచాయతీ ద్వారా ఇంటి నెంబర్లు, విద్యుత్ కనెక్షన్లు, నల్లా కనెక్షన్లు ఉన్నాయని, ప్రతి ఏటా వీరు క్రమంతప్పకుండా ఇంటి పన్నులు కూడా చెల్లిస్తున్నారని వివరించారు. బ్యాంకు రుణాలు కూడా పొంది ఉన్నారని పేర్కొన్నారు.
అయితే, రెవెన్యూ రికార్డులలో ఈ సర్వే నెంబర్ మొత్తం పొరపాటున “భూదాన్ భూమి”గా తప్పుగా నమోదు కావడం వల్ల, ప్రస్తుతం ఇక్కడ ఉన్న నివాస గృహాలతో పాటు గ్రామానికి చెందిన దేవాలయాలు, పాఠశాలలు, మహిళా సంఘ భవనాలు, మరియు గ్రామ పంచాయతీ ప్రభుత్వ భవనాలు కూడా నిషిద్ధ జాబితా (22-ఏ ) లోకి వెళ్లాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివల్ల సామాన్య ప్రజలు తమ ఇండ్లను రిజిస్ట్రేషన్ చేసుకోలేక, అత్యవసర సమయాల్లో బ్యాంకు రుణాలు పొందే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కష్టపడి కట్టుకున్న ఇంటిపై చట్టబద్ధమైన హక్కులు లేక గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
కావున, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని, ఈ సర్వే నెంబర్ 518 లోని నివాస గృహాలకు, ప్రభుత్వ భవనాలకు నిషిద్ధ జాబితా (22-ఏ ) నుండి విముక్తి కల్పించి, పేద ప్రజలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించడం ద్వారా న్యాయం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చుక్కల శంకర్ యాదవ్, వార్డు సభ్యులు బబ్బూరి సభిత శంకర్ గౌడ్,పబ్బాల ఉమా రమేష్,చుక్కల దుర్గయ్య యాదవ్, కోట సుధాకర్, కోట సుధావాణి, బబ్బూరి భరత్ గౌడ్ లు పాల్గొన్నారు.


