Sunday, April 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివీగిన బిల్లు, తొలగిన ముసుగు

వీగిన బిల్లు, తొలగిన ముసుగు

- Advertisement -

మహిళా రిజర్వేషన్‌ అమలుకోసం రాజ్యాంగ సవరణ 131 ముసుగులో వచ్చిన పునర్విభజన కపటనాటకం లోక్‌సభలో వీగిపోయింది. తాము రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకం కాదనీ, పునర్విభజనను కృత్రిమంగా ముడిపెట్టడం వల్లనే వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్షాలు ఎంతచెప్పినా వాటిని విడదీయడానికి కేంద్రం మొండిగా నిరాకరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయిందని కొందరు చెబితే, ప్రతిపక్షం నెగ్గిందని మరికొన్ని మీడియాలు చెబుతున్నాయి. బిల్లును ఓడించారని మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిపక్షాలపై శాపనార్థాలు పెడుతూ నిష్క్రమిస్తే మోడీజీ మొహం చూడండని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తమాషా చేశారు. ఆమెకు మళ్లీ నిరాశ వంటి సెంటిమెంటల్‌ కాప్షన్స్‌తో మీడియా ఊదరగొడుతుంటే పైన మోడీ నుంచి రాష్ట్రంలో టీడీపీ వైసీపీల వరకూ ఆవేదన గుమ్మరిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసన ర్యాలీ నడిపితే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భారీ ట్వీట్‌తో ప్రతిపక్షాలపై విమర్శ ఎక్కుపెట్టారు.

షరామా మూలుగా పాలకవర్గ మేధావి వర్గం ఇది చారిత్రిక తప్పిదమని తిట్టిపోస్తుంటే ఏది ఎలా వున్నా మహిళల కోసమైనా బలపర్చివుండాల్సిందని కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. ప్రతిపక్షం బిల్లును చంపేసిందని (కిల్స్‌) అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా శీర్షికనిచ్చింది. బిల్లును ఓడించడం ప్రతిపక్షాలకు సిగ్గుచేటని మంత్రులు దూషిస్తుంటే తాము ప్రజా స్వామ్యంపై దాడిని నిలవరించగలిగామనీ, రాజ్యాంగ వ్యవస్థను రక్షించగలిగామని ప్రతిపక్షాలు ప్రకటిస్తున్నాయి. ఇక్కడ ఓడించినా మీరు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదని ప్రధానమంత్రి చర్చలో పాల్గొంటూ చేసిన హెచ్చరికే వాస్తవానికి బీజేపీ ప్రధాన వ్యూహం. నయానో భయానో మద్దతు కూడగట్టడం,తప్పితే ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని నిందారోపణలు చేయడం అనే ద్విముఖ వ్యూహంతోనే అది రంగంలోకి దిగింది.

ఎత్తులు చిత్తు

రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతులు మెజార్టీ అవసరమైనా పునర్వి భజన, సీట్లపెంపు విషయంలో మామూలు ఆధిక్యత చాలునని, అదేపనిగా కథనాలు వదలి ఎలాగూ నెగ్గబోతుందనే వాతావరణం కలిగించేందుకు పాచికలు వేసింది. ఓటింగుకు ముందు రోజున 2023 చట్టాన్ని అమలుకు తెస్తున్నట్టు ప్రకటన చేసింది ప్రభుత్వం. 131వ సవరణ బిల్లు వీగిపోయాక చడీచప్పుడు లేకుండా మిగిలిన రెండూ ఉపసంహరించు కుంది. చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కీలకమైన శాసన ప్రతిపాదన వీగిపోవడం ఇదే ప్రథమం. ఇది మారిన బలాబలాల పొందికనూ, రాజకీయ వాతావరణాన్ని కూడా సూచిస్తుంది. వైసీపీ, జెడిఎస్‌ వంటివి తప్ప ఇతర పార్టీలేవీ సూటిగా బలపర్చడానికి సిద్ధపడలేదు. తొలుత కాస్త అనుకూలంగా మాట్లాడిన బీఆర్‌ఎస్‌ కూడా తీరా అసలు పరీక్ష వచ్చేసరికి అడ్డం తిరిగింది. మిగిలిన పార్టీలు రాకున్నా ప్రభుత్వం జరిపిన చర్చలకు హాజరైన సమాజ్‌వాది పార్టీ కూడా వ్యతిరేకించింది.

హిందూ వంటి పత్రికలు, మాజీ బ్యూరోక్రాట్ల సంయుక్త ప్రకటనలు కూడా ప్రభుత్వ వ్యూహం సరికాదనే చెప్పాయి. తమకు అనుకూలమైన ఎన్నికల కమిషన్‌ ద్వారా అస్మదీయులతో పునర్విభజన కమిషన్‌ వేయించుకుని, గెలిచేచోట్ల సీట్లు పెంచుకుందామన్న బరితెగింపుతో బీజేపీ వ్యవహరించడమే అందుకు కారణమైంది. ఎలాంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలు అది ఎవరితో పంచు కోలేదు, ముఖ్యమంత్రులకే తెలియదు. ఏకగ్రీవంగా ఆమోదించ బడిన 2023 రిజర్వేషన్ల చట్టంలో ఈ పునర్విభజన ఊసే లేదు. హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రాలవారీ సీట్ల సంఖ్యతో స్పష్టమైన ప్రకటన చేయడం చూస్తే లోలోపాల కసరత్తు జరిగినట్టే విదితమవుతుంది. సదుద్దేశమే సభ్యులకు కూడా రెండురోజుల ముందే అందించారెందుకని? కనుక ఇది పూర్తిగా కుట్రపూరిత తతంగం.

సాకులు..బాకులు..షాకులు..

చర్చలో పాల్గొన్న హోంమంత్రి ఒక మనిషి ఒకే ఓటు విలువ సూత్రం కోసం పునర్విభజన అవసరమైందని ముక్తాయించారు. చేవెళ్ల నియోజకవర్గం దేశంలోనే పెద్దదిగా వుందని, ఒక్క ఎంపీ అందరికీ ప్రాతినిధ్యం వహించజాలరని అసందర్భ వివరణ ఇచ్చారు. అవేవీ మహిళల రిజర్వేషన్‌కు సంబంధించిన సమస్యలు కావు. 2026 తర్వాత జరిగే పునర్విభజనలో చూసుకోవలసినవి.2021 జనాభా లెక్కలను వాయిదా వేయడం ఒకటైతే తప్పనిసరై ఇప్పుడు జరిపిస్తున్న 2026-27 లెక్కలకు కూడా విలువ లేకుండా చేసే పన్నాగం ఇది. ఇవిఎంలకు సంబంధించిన అవకవతకలు ఎన్నికల సమయంలో జరిగేవి. సర్‌ పేరిట తొలగింపులు గత జాబితాలలో జరిగేవి ఇప్పుడు ఈ ప్రహసనం నియోజకవర్గ ఏర్పాటు దశ నుంచి, ఓటర్ల నిర్ణయం నుంచి మొదలవుతుందన్న మాట. కాస్త తెరిపారచూస్తే ఇందులో నిగూఢ వ్యూహం అర్థమైపోతుంది. ఇక ముందు కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా రాజ్యాంగంలోని 81,82(నియోజకవర్గాల పరిధి,జనాభా లెక్కలు) అధికరణాలతో నిమిత్తం లేకుండా ఇష్టం వచ్చినట్టు మార్చేసేందుకు దారితీస్తుంది. కుల మత లెక్కలతో ఓటర్లను ఇష్టానుసారం మార్చే బీజేపీ హిందూత్వ భావజాలం వేళ్లూనుకుం టుంది. జనాభా లెక్కల ప్రకారం గతంలో కల్పించి 2009 ఎన్నికల నాటికి పునర్విభజన జరిగిన ఎస్సీ,ఎస్టీ సీట్లను ఇష్టానుసారం మార్చేసేందుకు తాళాలిచ్చినట్టవుతుంది.

కనుక ఇందులో అనేక అనర్థాలు వున్నాయి.పోనీ మహిళలకు ఏమైనా అదనంగా ప్రయోనం కలుగుతుందా అంటే శూన్యం. 2023 చట్టాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడున్న 543లోక్‌సభ స్థానాలలోనూ మూడోవంతు వారికి కేటాయించేందుకు అన్ని పార్టీలూ సంసిద్ధత తెలిపినా,. ఇన్ని కబుర్లు చెబుతున్న ఈ ప్రభుత్వం ఎందుకు సిద్ధపడలేదు? వారి ఉద్దేశం, వ్యూహం వేరే గనక! ఆ వ్యూహంలో భాగంగా రాజ్యాంగ వ్యవస్థలనూ సూత్రాలను నేలమట్టం చేస్తున్న దారుణానికి పరాకాష్టగా ఈ అనధికార అక్రమ పునర్విభజన తీసుకొచ్చారు. కనుక అది ఓడిపోవడం ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణలో ముందడుగు. ఇందుకోసం ప్రతిపక్షాలన్నీ అరమరికలు లేకుండా ఒక్కతాటిపైకి రావడం మరింత శుభసూచకం. 2024 ఎన్నికలలోనే బీజేపీకి కనీస మెజార్టి రాలేదని గుర్తుంచుకుంటే ఈ ఓటమి ప్రాధాన్యత, ఈ ఎత్తుగడల మర్మం మరింత బాగా బోధపడతాయి. మోడీకి తిరుగులేదని, ఆయన ఆధిపత్యం అప్రతిహతమని అదేపనిగా చెబుతూ అవకాశవాదంతో లొంగిపోయే వారికి ఈ పరిణామం ఒక గుణపాఠం. ఉన్న స్థానాల్లోనే మూడోవంతు ఇవ్వడం ప్రస్తుతం ఉత్తమ పరిష్కారం,జనాభా లెక్కల తర్వాత మళ్లీ చర్చ చేసి పెంచుకోవచ్చు,

బాబు,జగన్‌ ప్రహసనం/వంతపాట/యుగళగీతం
ఎన్‌డిఎ భాగస్వామ్య పార్ట్టీలు సరే ఎలాగూ బలపరుస్తాయి. అయినా దేశంలో వ్యక్తమైన ప్రతికూలత వల్ల వారు కూడా ఆత్మసంతృప్తి కోసం ఏవో చేశామనిపించారు. చంద్రబాబు నాయుడు అమిత్‌షాతో మాట్లాడటం అలాంటిదే. 2001లో వాజ్‌పేయి హయాంలో నియోజకవర్గాల పునర్విభజనను 2026 వరకూ వాయిదా వేసిన నిర్ణయంలో టీడీపీ భాగస్వామి గనక అప్పటి హామీలకేమీ భంగం కలగకూడదని ఆయన చెప్పారట, షా అదేమీ లేదని హామీఇచ్చారట. ఇక వారి పార్లమెంటరీ పార్టీ నాయకుడైన లావు కృష్ణదేవరాయలు తమకు 2023 చట్టం ప్రకారం చేసినా ఇప్పుడు పునర్విభజనతో 850 స్థానాలకు పెంచినా అభ్యంతరం లేదని మరో వివరణ. ఈ చారిత్రాత్మక సన్నివేశాన్ని చూసేందుకు తెలుగు మహిళలు భారీ సంఖ్యలో ఢిల్లీ తరలిరావడం బీజేపీని మించిపోయింది. సభలో మాట్లాడిన వారి సభ్యులు తమ నాయకులను పొగడ్డం, జగన్‌పాలనపై విసుర్లతో సరిపోయింది. ఉన్న స్థానాల్లో మూడోవంతు మహిళలకు ఇచ్చినా లేక పెంచి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదంటూనే లావుకృష్ణదేవ రాయలు పునర్విభజన వల్ల నష్టం లేదని సమర్థించారు.

2026 జనాభా లెక్కలు తీసుకుంటేనే, జనాభా తగ్గింది గనక సీట్లు తగ్గుతాయని నష్టమని వాదించారు. విచిత్రంగా జగన్‌ నుంచి జయప్రకాశ్‌ నారాయణ వరకూ ఇదే వల్లెవేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్లును వెనక్కు కొట్టినట్టే దేశం, ప్రజాస్వామిక శక్తులు 2027 లెక్కలు చేతికివచ్చాక సరికొత్త ప్రాతిపదికపై నిర్ణయానికి రాలేమా? ఇప్పుడు ఈ పరిణామాన్ని గట్టిగా వ్యతిరేకించిన దక్షిణాది రాష్ట్రాలు భవిష్యత్తులోనూ పోరాడలేవా? 1971లో ఇచ్చిన హామీ ప్రకారం జనాభా తగ్గించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకం వుండాలని పోరాడే బదులు వున్నదానికి సిద్ధపడిపోతున్న ఈ వాదన ఏమిటి? ఇంకా విపరీతమేమంటే వైసీపీ సభ్యులు సభలో టీడీపీ వారి తప్పులను గురించి చెప్పడంతో ఆగక అన్ని ప్రాంతాలకూ ఒకే సంఖ్యలో సీట్లు వుండేలా చూడాలని వాదించారు. రాజ్యాం గంలో అలా వీలవుతుం దా? వారు జిల్లాలలను ఆ విధంగానే ఏర్పాటు చేశారా? రప్పా రప్పాలు రెడ్‌బుక్‌లతో పరస్పరం నిరంతరం కలహించుకునే ఈ పార్టీలు మోడీ ముందు ఒకే విధంగా మారిపోయి వంతపా డటం హాస్యాస్పదం.

రేవంత్‌, కేటీఆర్‌ స్పందనలు
మొదట్లో బీఆర్‌ఎస్‌ కూడా యాభై శాతం సీట్లు పెరుగుతాయనే సంతోషంపై కేంద్రీకరిం చింది. చంద్రబాబు, జగన్‌, కేటీఆర్‌ ఆ రాబోయే సీట్లకు సన్నద్ధం చేసేలా మాట్లాడారు కూడా. పవన్‌ కళ్యాణ్‌ బలం పెంచుకోవడానికి అధ్యయనం జరపాల ని పురమాయించారు. వైసీపీ మీడియా వివరమైన కథనాలిచ్చింది. ఈ ఉత్సాహంలో రాజ్యాంగ ఉల్లంఘన అంశాన్ని అసలు పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో సభ్యులు లేరు గనక రాజకీయ మద్దతు మాత్రమే ఇచ్చినా బీజేపీపై విమర్శల వచ్చాక తెప్పరిల్లి తప్పుపట్టింది, ఇక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర విభజనను భారత్‌-పాక్‌ విభజనతో పోల్చడం కూడా తీవ్ర విమర్శకు కారణమైంది. జనాభా తగ్గింపులో జయప్రదమైన దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సూచికలకు అదనపు ప్రోత్సాహకాలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను కూడా తేజస్వి అవహేళన చేశారు. పాకిస్తాన్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తుతూనే ఈ రెండో అవహేళనను మాత్రం సమర్థించింది. ఏతావాతా ఈ ప్రాంతీయ పార్టీలు తమ అవసరాలకోసం తప్ప లౌకిక ప్రజాస్వామిక కోణంలో దీర్ఘకాలిక అంశాలపై దృష్టి పెట్టకపోవడం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఇప్పుడు చంద్రబాబు ఎన్‌డిఎ పిలుపుపై నిరసన ప్రదర్శనలు చేస్తుంటే, జగన్‌ లండన్‌ పర్యటనకు బయిలుదేరి వెళ్లారు. రేవంత్‌రెడ్డి దక్షిణాది ముఖ్యమంత్రుల సభలు జరుపుతామని ప్రకటించారు. మోడీ సర్కారు మొన్నటి దెబ్బతో పాఠం నేర్చుకుంటుందా కొత్త పాచికలతో విన్యాసాలు చేస్తుందో చూడాలి. మే 4న ఎన్నికల ఫలితాలొచ్చాకే పరిణామాలు వేగం పుంజుకుంటాయి.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -