Friday, April 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదొంగదారిలో పునర్విభజన కుట్ర చెల్లదు

దొంగదారిలో పునర్విభజన కుట్ర చెల్లదు

- Advertisement -

ఉత్తుత్తి నినాదాల హోరు, లేనిపోని కట్టుకథలు సృష్టించడం నరేంద్రమోడీకి, ఆయన సర్కారుకూ వున్న ప్రధాన లక్షణం. దీనికి అత్యంత దారుణమైన తప్పుడు ఉదాహరణ దాని తాజా వ్యవహారమే. రెండు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఈ పోకడలకు అద్దం పట్టే సరైన ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక్కడ చెప్పే దాన్ని వక్రీకరించేందుకు కాస్త కూడా అవకాశం ఇవ్వరాదంటే మొదటే ఒక అంశం నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్‌ వుండాలని ఈ దేశంలోని వామపక్షం నిరంతరం చాటి చెబుతున్నది. దేశంలో లింగ సమానత్వం కోసం జరిగే విస్తృత పోరాటంలో భాగంగా ఈ కోర్కెను వామపక్షం చాటుతూ వస్తున్నది. ఈ అంశానికి సంబంధించి సాగిన చారిత్రక పరిణామ క్రమంతో పరిచయం వున్న వారెవరికైనా ఈ ప్రక్రియ ఎలా మొదలైందో తెలుసు. లోక్‌సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మూడో వంతు రిజర్వేషన్‌ వుండాలనే ప్రతిపాద నకు పునాది పడింది గీతా ముఖర్జీ కమిటీతోనే.

ఉద్యమాల ఫలితం 2010 విజయం
భూస్వామ్య వ్యవస్థతో, పితృస్వామ్య పురు షాధిక్యతతో ముడిపడిన మన గత చరిత్ర రీత్యా చూసినప్పుడు ఈ న్యాయమైన డిమాండు పట్ల విముఖత, పచ్చి వ్యతిరేకత కూడా వ్యక్తం కావ డంలో ఆశ్చర్యమేమీ లేదు.స్వాతంత్య్ర పోరాటం ప్రసరించిన అత్యంత శక్తివంతమైన సమానతా ప్రభావం కారణంగా మహిళలకు ఓటు హక్కు అనేది స్వతంత్ర రిపబ్లిక్‌ ప్రారంభం నుంచే గుర్తించబడింది. ఇది చాలా పాశ్చాత్య దేశాలలో వున్నదానికి భిన్నమైన పరిస్థితి. అయితే గమన శీలమైన ప్రజాస్వామిక సమాజాలు స్త్రీ పురుష సమానత, సాధికారత అనే ప్రాతిపదికను పునర్దర్శనం చేయాలని భావించాయి. మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ డిమాండు ఆ కృషికి సహజసిద్ధమైన కొనసాగింపుగానే ముందుకొ చ్చింది. ప్రజాతంత్ర సంస్థలు, ప్రత్యేకించి మహిళా ఉద్యమం చేసిన పోరాటం కారణంగా 2010లో రాజ్యసభ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదిం చింది. ఏమైనా దాన్ని లోక్‌సభలో ఆమోదింప జేసుకోవడం సాధ్య పడలేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని 2023 వరకూ పక్కన పడేశారు. ఆ తర్వాత ఉభయ సభలలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే ఎలాంటి కారణం లేకుండానే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఒక సవరణ తీసుకురాబడింది. జనాభా లెక్కల ప్రక్రియతో, నియోజకవర్గాల పునర్వి భజనతో దాన్ని విచిత్రంగా ముడివేసి కూర్చుంది. అంతేగాక గత మూడు సంవత్సరాలుగా ఈ బిల్లు ఆమలుకు నోచుకోకపోవడంతో రెండింటిలోనూ ఏ మాత్రం కదలిక లేని స్థితి నడిచింది.

ప్రస్తుత మాయోపాయం
ప్రస్తుతం పార్లమెంటు సమావేశం ఒక రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ప్రతిపాది స్తున్నది. కనుక అందుకోసం రాజకీయ రంగంలో విశాలమైన ఏకాభిప్రాయం సాధించడం తప్పని సరి అవసరం. అలాంటి ఏకాభి ప్రాయ సాధన ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రతిపక్షాలతో విస్తారమైన చర్చలు, సంప్రదింపులు జరుపు తుందని ఆశించ బడింది. అయితే అందుకు బదులుగా మనం చూసింది వేరు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఎన్నికలు మధ్యలో వుండగా హఠాత్తుగా ఎక్కడలేని శ్రద్ధ ముంచుకొచ్చినట్టు ప్రదర్శించడం జరుగుతున్నది. ఈ అంశంలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏకాస్త కూడా దృష్టి పెట్టలేదనే సత్యాన్ని కప్పి పుచ్చడానికి, దాటేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఈ విషయంలో విభేదాలకు, భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా ముందే పరిష్కరించుకో వడానికి అఖిలపక్ష సమావేశాలు జరపడానికి బదులు ప్రధానమంత్రి జాతీయ పత్రికలలో ఒక సంపాదక పేజీ వ్యాసం ప్రచురించారు. దాంట్లో ఇలా పేర్కొన్నారు: ‘ప్రజాస్వామిక వ్యవస్థలలో మహిళలకు వారి న్యాయమైన స్థానం కల్పించడం కోసం గత చాలా దశాబ్దాలుగా ఇదివరకటి ప్రభుత్వాలు పదేపదే ప్రయత్నాలు చేశాయి. కమిటీలను వేయడం, బిల్లు ముసాయి దాలు ప్రవేశపెట్టడం తప్ప అవేనాడూ వాస్తవ రూపం దాల్చలేదు’. ఈ విధంగా వ్యాఖ్యానించిన ప్రధాని 2023 సవరణను ప్రస్తావించి తనను తాను అభినం దించుకునే ప్రశంసా భాగం రాసు కున్నారు. అయితే తామే తీసుకొచ్చిన ఆ సవరణను ఇప్పుడు జనగణనతోనూ పునర్వి భజనతోనూ ఎందుకు ముడిపెట్టవలసి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన బేఖాతరు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఆలస్యం చేసేందుకే వీటిని ముడి పెట్టారన్న విమర్శకు సమాధానంగా ప్రభుత్వం జనగణన, పునర్విభజన తగినంత వేగంగానే పూర్తవుతాయని చెప్పింది. 2029 లోక్‌సభ ఎన్నికలలో మూడో వంతు రిజర్వేషన్ల అమలుకు పెట్టుకున్న గడువు దాటిపోయే పరిస్థితి రాదని పేర్కొంది. మోసపూ రితమైన వైఖరి ఇక్కడే కనిపిస్తోంది.

ప్రత్యక్ష నిదర్శనాలు
జనగణన, పునర్విభజన రెండు కూడా సంక్లిష్టమైన, వివాద్పాదమైన, సుదీర్ఘమైన వ్యవహా రాలు. వాటి నిర్ణయ క్రమంలో వ్యక్తమయ్యే నూతన ఆశల కారణంగా సరికొత్త సంఘర్షణా త్మక ప్రశ్నలు ముందుకొచ్చే అవకాశం వుం టుంది. ఆ విధంగా చూస్తే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వుండవలసిన తక్షణ వేగం కనిపించ డం లేదు. పైగా ఆమోదం పొందాల్సిన బిల్లులు, రాజ్యాంగ సవరణల ముసాయిదా ప్రతులను కూడా కేవలం సభా సమయానికి 48 గంటటల ముందే పార్లమెంటు సభ్యులకు అందిం చారు. ఇది చాలా తప్పుడు పద్ధతి, సున్నితమైన ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసేబదులు తనకు అలవాటైన గీతాబోధనను తదుపరి దశలో గుమ్మరిస్తే సరిపోతుందని ప్రధానమంత్రి భావించారా?

ఇప్పుడు ఆ బిల్లులు అందరికీ అందుబాటులో (పబ్లిక్‌ డొమైన్‌లో) వున్నాయి. మహిళా రిజర్వేషన్‌ శరవేగంగా అమలు చేయాలనే ముసుగులో పునర్విభజన కసరత్తును దొడ్డి దోవలో ప్రవేశ పెట్టడం జరిగిందనేది సుస్పష్టంగా తెలిసిపో తున్నది. పునర్విభజనకు సంబంధించిన నిర్దుష్ట వివరాలు పొందుపర్చడమే కాదు. వాస్తవంగా వచ్చే సంఖ్యలు ఏవో కూడా సూచించబడ్డాయి. అంటే పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగ స్వతంత్రతను లేకుండా చేయడమే ఇక్కడ ఉద్దేశమని కూడా స్పష్టంగా తేలిపోతుంది. దాన్ని కేవలం పార్లమెంటు చేసే మామూలు చట్టంలా మార్చేయడం జరుగుతుంది. అది కూడా జనగణన ప్రక్రియ మొదలువుతున్న దశలో.

అయితే దీనివల్ల ప్రాంతీయ సమతుల్యత దెబ్బ తింటుందనే ఘర్షణలు, ఆందోళనా స్వరాలు ఆ వెంటనే కొద్ది గంటలలోనే వినిపించడం మొదలైంది. ఇంత చారిత్రాత్మక ప్రాధాన్యత వున్న బిల్లులను రాజ్యాంగ సవరణలను బుల్‌డోజ్‌ చేసినట్టు రుద్దడం సరైంది కాదు. ప్రత్యేక సమగ్ర పరిశీలన ‘సర్‌’ పేరిట భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ) వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు దెబ్బతిన్నాయి. భారీ సంఖ్యలో పౌరుల రాజ్యాంగ ఓటు హక్కులు ప్రమాదంలో పడిపోయాయి. ఎస్‌సి,ఎస్‌టి జనాభాతో సహా జనగణన వివరాలు లేని పరిస్థితులలో దొడ్డి దోవన పునర్విభజన కసరత్తును ముందుకు నెట్టడం జరుగుతున్నది. అంతకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఓబిసిల వివరాలు కూడా లేవు. అందువల్ల ఇప్పటికే దెబ్బతిన్న సామాజిక చట్రం ఈ తతంగంతో మరింత బదాబదలైపోయే ప్రమాదం పొంచి వున్నది.

తాజా ఉల్లంఘనలు
ఇప్పుడున్న రాజ్యాంగ ఏర్పాటులో లోక్‌సభ స్థానాలు 1971 జనాభా లెక్కల ఆధారంగా కేటాయించబడ్డాయి. ఒక్కో రాష్ట్రంలో తీసుకుంటే 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ పని జరి గింది. ”2026 తర్వాత తీసుకున్న మొదటి జనాభాలెక్కల నుంచి తగు వివరాలు అందు బాటులోకి వచ్చేంత వరకూ” ఈ ఏర్పాటు కొనసా గాలని 82వ అధి కరణం పేర్కొంటున్నది. ప్రస్తుత ప్రతిపాదిత సవరణ ఆ నిబంధనను మొత్తంగా ఎత్తివేస్తున్నది. ఇంతకంటే దారుణం వుండదు. గత పర్యాయం పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడానికి 2002 నుంచి 2008 వరకూ ఆరేళ్లు పట్టింది. 2009 ఎన్నికలలో దాన్ని అమలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఇసిఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒకటి అస్సాంలో మరొకటి జమ్ము కాశ్మీర్‌లో రెండు రాష్ట్ర స్థాయి పునర్విభజనలు జరిగాయి. ఈ రెండు చోట్ల జరిగినవీ వివాద్పా దమే గాక 2002 పునర్విభజన చట్టం నిబంధ నలను ఉల్లంఘించి చేసినవే. ఆ ప్రాంతంలోని ఓటర్ల మతపరమైన గుర్తింపును ప్రధాన చోదకంగా తీసుకుని చేసిన ఈ టక్కరి తంతు బిజెపికి లబ్ధి చేకూర్చే విధంగా జరగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇవేగాక దేశం వివిధ భాగాల్లో అమలు చేసిన అభివృద్ధి నమూనాల వంటి ఇతర తక్షణ సవాళ్లు కూడా వున్నాయి.

ఆ క్లాజు తీసేయాల్సిందే
ఎస్‌.సి, ఎస్‌.టిల హక్కులు నిరాకరించబడ కుండా, ప్రజాస్వామ్య సూత్రాలను నేలమట్టం చేయకుండా చూడాలి. ప్రజాస్వామ్యాన్ని దృఢత రంగా లోతుగా వేళ్లూనుకునే విధంగా చూడాల ంటే 2010 నాటి బిల్లుకు తిరిగి వెళ్లడమే మార్గం. పునర్విభజన, జనగణనలతో ముడి పెట్టకూడదు. 108వ రాజ్యాంగ సవరణ 34వ క్లాజులో జోడించిన ఈ అంశాన్ని తొలగించేస్తే సరిపో తుంది.మహిళా రిజర్వేషన్ల అమలు వెను వెంటనే అమలు చేసేయాలన్న ప్రభుత్వ హడా వుడి విషయంలో ప్రతిపక్షం వెనకబడిందేమీ లేదు. అయితే దొడ్డిదోవన పునర్విభజన అమలు కోసం జరిగే ప్రయత్నాలను మాత్రం కచ్చితంగా వమ్ము చేయాలి.
(ఏప్రిల్‌ 15 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -