Friday, April 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికావాల్సింది మనువాదం కాదు.. మానవ వాదం

కావాల్సింది మనువాదం కాదు.. మానవ వాదం

- Advertisement -

కొన్ని శతాబ్దాలుగా బ్రాహ్మణిజం (వైదిక) తన ఔన్నత్యం గూర్చి ఏయే గొప్పలు చెప్పుకుంటూ కొనసాగుతూ ఉందో – అవే కొన్ని ఇక్కడ ఊటంకించడం జరిగింది. ఇందులో ఎవరి మనోభావాలో దెబ్బతీ యాలన్న ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు. అవాస్తవాల్ని ఇంతగా ప్రచారం చేయడం తగునా? అని ఈ తరం పౌరులు స్వేచ్ఛగా విశ్లేషించుకుంటున్నారు. అంతే! సనాతనం పేరుతో బ్రాహ్మణులు తమ గురించి, తమ విలువ గురించి, తమ సామర్థ్యం గురించి తామే రాసుకుని ప్రచారం చేసుకున్నవి ఇలా ఉన్నాయి –
బ్రాహ్మణుని పుట్టుక – విష్ణు అంశం. బ్రాహ్మణుని బుద్ధి- అన్ని సమస్యలకు సమాధానం. బ్రాహ్మణుని వాక్చాతుర్యం- వేద వైభవ జ్ఞానం. బ్రాహ్మణుని దృష్టి – సమభావం. బ్రాహ్మణుని ఆశయం – సర్వలోక క్షేమం. బ్రాహ్మణుని లక్ష్యం – దేశ హితం. బ్రాహ్మణుని ముఖ్య ఉద్దేశం – సర్క సంకట నాశనం. బ్రాహ్మణుని అనుగ్రహం – భవసాగర సాధనం. బ్రాహ్మణుని నిత్యానుపానం – సర్వలోక క్షేమం. బ్రాహ్మణుని నిధి – భగవద్సన్నిధి. బ్రాహ్మణుని దర్శనం – సర్వ మంగళకరం. బ్రాహ్మణుని ఆశీర్వాదం – వైభవానికి ఆలవాలం. బ్రాహ్మణుని చల్లనిచూపు – మోక్షమార్గానికి దారి. బ్రాహ్మణుని అస్త్రం – శాపం. బ్రాహ్మణుని శాస్త్రం – మనుగడకు మార్గం. బ్రాహ్మణునికి దానం – సహస్ర పాపాల సంహారం. బ్రాహ్మణునికి దక్షిణమ్‌- సర్వపాపక్షయం. బ్రాహ్మణుని ఘర్జనం – సర్వభూత సంహారం. బ్రాహ్మణుని కోపం – సర్వనాశనం.
బ్రాహ్మణుని తాపం – నీ జీవిత సంకటం.
బ్రాహ్మణునికి సన్మానం – నీ అభివృద్ధికి సోపానం.
బ్రాహ్మణునికి అవమానం – నీ అభివృద్ధి నాశనం.
ఇలాంటి సూక్తులు చాలా చాలా ఉన్నాయి. మచ్చుకి కొన్ని మాత్రమే ఉదహరించాను.
గతంలో ఇవి సమాజాన్ని భయపెట్టడానికి పనికొచ్చాయి. కాలూ, చేయి కదపకుండా వారు తమ జీవన భృతిని, గౌరవ మర్యాదల్ని సాధించుకోవడానికి ఇలాంటి భావాల్ని వ్యాప్తి చేశారు. అంతేకాదు, మామూలు మనుషుల కన్నా తాము ఉన్నతులమని ప్రకటించుకుని, సమాజంపై ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని వెనక ఉన్న సంస్థా అధికారం కోసం బ్రాహ్మనిజానికి భజనలు చేస్తూ, ఆధిపత్యం కొనసాగి స్తున్నది చూస్తూనే ఉన్నాం. ఇందులో ఏ ఒక్కటి హేతుబద్ధంగా లేదు. గతంలో ఇవి నిరూపించబడలేదు. ఇప్పుడూ నిరూపించబడవు. అన్నింటికి అన్నీ అతిశయో క్తులు, అవాస్తవాలు తప్పు – ఏ ఒక్కటీ నిజం కాదు! అయితే, వీటివల్ల ఒక చిన్న ఉపయోగం ఉంది. వీటిని వ్యతిరేకించేవారి పెదాల మీద ఇవి చిరునవ్వుల్ని పూయిస్తాయి!!
కాలక్రమంలో దైవభావనకు ప్రాముఖ్యం తగ్గి, వైజ్ఞానిక అవగాహనకు ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ మతాల డొల్లతనం బయటపడుతూ వచ్చింది. దైవభావన ఒక విశ్వాసం అంతే! అది నిజం కాదు. బ్రాహ్మణిజం దృష్టి- సమభావం అయితే, జనాన్ని నాలుగు వర్గాలుగా ఎందుకు విభజించినట్టూ? అధిక సంఖ్యాకుల్ని విద్యకు దూరం పెట్టి, వారిని బానిసత్వంలోకి నెట్టిందెందుకు? బ్రాహ్మణుని లక్ష్యం – దేశ హితం అయితే.. శతాబ్దాలుగా ఈ దేశంలో లక్షల యుద్ధాలు ఎందుకు జరిగాయి? బ్రాహ్మనిజమనే కాదు, ఏమతమూ చొరవ తీసుకుని యుద్ధాల్ని ఆపి, శాంతి స్థాపించిన దాఖలాలు ఈ ప్రపంచ చరిత్రలోనే లేవు కదా?
నమ్మశక్యం కాని అతిశయోక్తులు ఎన్నెన్నో బ్రాహ్మణి జం ప్రచారం చేస్తూ ఉంటుంది. దాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఇది సనాతన ధర్మం అని చెప్పుకుం టుంది. అసలు ఆ పదం ఎక్కడి నుంచి దొంగిలించారో చెప్పరు. సత్యాలు వెలుగులోకి రాకుండా కప్పి పెడతారు. వచ్చినవి ఏవైనా ఉంటే అవి అర్ధసత్యాలై ఉంటాయి. ఎవరైనా నమ్మాలంటే, వారు వారి ఇంగిత జ్ఞానాన్ని నిద్రబుచ్చి మాత్రమే నమ్మాలి! అందుకే చూడండి- ఇంగీతం ఉన్నవారెవరైనా ఈ కింది విషయాల్ని నమ్ముతారేమో?

– బ్రహ్మ తన శరీరాన్ని రెండుగా చేసుకుని, ఒక భాగాన్ని పురుషుని గాను మరొక భాగాన్ని స్త్రీగాను మలుచుకుని.. అంటే ఆస్త్రీ పురుషుల కలయికతో విరాట్‌ను కన్నాడు అని చెపుతారు. అసలు అంతటి ప్రయాస ఎందుకూ? ఆయనే సృష్టికర్త గదా? మహిమ గలవాడు గదా? శరీరాన్ని స్త్రీ పురుష భాగాలుగా విడగొట్టుకుని, మళ్లీ, వాటిని శారీరకంగా కలిపి, సంతానాన్ని కనడం – అదంతా ఎందుకూ? నేరుగా మహిమతో పుట్టించొచ్చు గదా?
– ఎలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోగూడదో ఇలా చెప్పారు. రోమాలు ఎక్కువగా ఉండి, పిల్లి కాళ్లుండి, అవయవాలు పెద్దగా ఉన్న కన్యను పెండ్లి చేసుకోరాదు. అలా పుట్టించింది ఆ బ్రహ్మదేవుడే కదా? తప్పు ఆయనది కదా? తప్పు చేయని కన్యకు శిక్ష ఎందుకూ? ఇంకా నక్షత్రాల పేర్లు, నదులపేర్లు, పక్షుల పేర్లు, పాముల పేర్లూ గల కన్యల్ని పెళ్లి చేసుకోరాదట. ఈ విషయంలో కూడా తప్పు కన్యలది కాదు గదా? పుట్టినప్పుడు పెద్దవాళ్లు కదా పేరు పెట్టేది. ఈ నిబంధనల్లో అసలు న్యాయమే కనిపించడం లేదు.
– ఇక శూద్రుల గురించిన నిబంధనలు చూడండి. ఇవి బహుళ ప్రచారంలో ఉన్నవే! శూద్రుడు రాజ్యం చేసేచోట ఉండరాదు. శూద్రుడు దరిదాపుల్లో ఉన్నప్పుడు వేదాలు చదవగూడదు.
– విద్యా విహీనుడు అన్నం, బంగారం, భూమి, గోవు, వస్త్రం వంటి వాటిని ధరించగూడదు. బంగారం, భూమి వంటివి విలువైనవి. చదువూ తెలివిలేని వాడు వాటిని సరిగా చూసుకోలేడు. లేదా కాపాడుకోలేడు- అని అనుకుందాం. తినడానికి బుక్కెడు అన్నం, కట్టుకోవడానికి ఇంత గుడ్డ అందరికీ తప్పకుండా కావల్సినవి కదా? చదువు రాని వాడు అసలు బతక గూడదనా ఏం సూచిస్తోంది ఈ బ్రాహ్మణిజం?
– పదిమంది కలిసి వండిన అన్నాన్ని తినగూడదు – అని ఉంది. ‘టూ మెనీ కుక్స్‌ స్పాయిల్‌ ద డిష్‌’ అని మనం ఇంగ్లీషులో చెప్పుకుంటాం కదా? దీన్ని అప్పుడే మన సనాతనులు గ్రహించుకున్నారన్నమాట?

– యజ్ఞయాగాల కోసం పశువుల్ని బలి ఇస్తే అది జీవహింస కిందికి రాదు – అట! వీరి అహింసా సిద్ధాంతం ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే మనకు ఈ జన్మ సరిపోదు. (పునర్జన్మ లేదని మనకు కచ్చితంగా తెలిసినా – దీన్ని అర్ధం చేసుకోవడా నికైనా మనకు మరో జన్మ అవసరం అనిపిస్తోంది కదా?)
– ద్విజుడు అంటే బ్రాహ్మణోత్తముడు పశువుల మాంసం విధిగా తినాలి! – అని కూడా రాసి పెట్టుకున్నారు. శతాబ్దాల పాటు శుభ్రంగా తింటూనే వచ్చారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొందరు తింటూనే ఉన్నారు. కొందరు ఎందుకు మానేశారో చెప్పుకోవాలంటే చరిత్రంతా తోడాల్సి వస్తుంది.
– అధిక కులానికి చెందిన స్త్రీ ఒక హీన జాతి పురుషునితో జత కడితే కఠిన శిక్ష ఉంటుంది. అధిక కులానికి చెందిన స్త్రీ, తన కంటే అధిక జాతి పురుషుడితే జతకడితే ఆమెకు దండన, శిక్ష వంటివి ఏవీ ఉండవు.
– బ్రాహ్మణ స్త్రీ శూద్రునితో జతకడితే, ఆ శూద్రుడి అంగమే ఖండించాలి-అని రాసుకున్నారు. కానీ బ్రాహ్మణ స్త్రీకి ఏ శిక్షా వేసుకోలేదు. మొత్తానికి మొత్తంగా చూస్తే, శిక్షలన్నీ శూద్రులకు, నిమ్నవర్గాలకే ఉన్నాయి. ఉన్నత వర్గాలకు లేవు.

– సంతానం లేనప్పుడు ఏ స్త్రీ అయినా, భర్త అంగీకారంతో, మరిదితో పుత్రుణ్ణి కనొచ్చు. ఒకవేళ భర్త చనిపోతే ఆమె మరిదిని పెండ్లి చేసుకోవచ్చు. ఇలాంటివి మన పురాణాలలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. అవన్నీ వైదిక మత ప్రచారంలో భాగంగానే రాసుకున్నారు.
– స్త్రీ స్వతంత్రగా ఏ నిర్ణయం తీసుకోగూడదు. ఏ కార్యా నికీ పూనుకోగూడదు. ఈ నిబంధన వల్లనే కాబోలు స్త్రీలందరినీ శూద్రుల కింద జమకట్టారుకదా?
– ఇక భర్త వేరే స్త్రీతో ప్రేమలో పడి ఆమెతో జతగూడినా భార్య భర్తను తిట్టగూడదు. దేవుడిగా భావించాలి. ఈ సూత్ర ప్రకారమే కాబోలు, వైదిక మతంలో దేవుళ్లకు లెక్కలేనంత మంది ప్రియురాళ్లు, భార్యలూ ఉంటారు.
– శూద్రులు గనక బ్రాహ్మణులను ముట్టుకున్నా, లేక చేయిచేసుకున్నా ఆ శూద్రుల అవయవాలు నరికేయాలి! అదే పని బ్రాహ్మణులు చేస్తే గనక వారికి శిక్షలుండవు. శూద్రులు నోరు మూసుకుని, కుక్కిన పేర్లలా పడిఉండాలి. ఇలా వారు అసంబద్ధమైన విషయాలెన్నో ప్రచారంలోకి తెచ్చి, సమాజంపై తమ భావజాలపు ఆధిపత్యం సాగించారు.

ఒకనాడు బ్రాహ్మణిజం ఎలా వ్యాప్తిలోకి వచ్చిందో, దాని ప్రభావం సమాజం మీద ఇప్పటికీ ఎలా ఉందో అర్థం చేసుకోవ డానికి ఈ విషయాలు కొంత వరకు పనికొస్తాయి. అయితే, ఎవరూ తమతమ మనోభావాలు దెబ్బతీసు కోకుండా సమదృష్టితో అవలోకించుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి వైజ్ఞానిక దృష్టి కోణంలో మానవ జాతి అంతా ఒకటే – అన్నది ఇప్పటి మన ఆధునిక భావన!! మనమిప్పుడు ఆదృష్టి కోణంలోనే చూడాలి!
మానవజాతి ఔన్నత్యాన్ని నిలబెట్టుకునే దిశలో ప్రపంచ మేధావులంతా వైజ్ఞానికంగా ఆలోచిస్తున్న క్రమంలో – భారతీయులు తమ గొంతులు కలపాల్సి ఉంది. మానవజాతి అంతా ఒకటి కాదని ఘంటాపథంగా చాటింపు వేసిన ఈ సనాతన – వైదిక – బ్రాహ్మణ హిందూత్వ మతం ముఖ్యంగా స్త్రీలు, పురుషులు సమానులు కాదంటున్న ఈ ఆలోచనా ధోరణి ఇంకా ఎంతవరకు అవసరం? ప్రపంచ దేశాలలో కూడా విభజనలు న్నాయి. కానీ అవి ఇలాంటివి కావు. తెలుపు నలుపు; ధనిక – పేద వంటివి. కానీమన దేశంలో మనువాదులు చేసిన వర్గీకరణ మాత్రం చాలా హేయంగా ఉంది. మనసుపెట్టి ఒక్కొక్క విషయం మను షుల్లా ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ దేశంలోని సామాజిక కార్యకర్తలందరూ, సంఘ సంస్కర్తలందరూ ఈ అసమానతలు పోగొట్టడానికే శతవిధాల ప్రయత్నిస్తూ వచ్చారు. కొంతలో కొంత మార్పు కనిపించినా, ఆ భేదభావం, ఆవిద్వేషం ఆ చిన్నచూపు పూర్తిగా సమసిపోలేదు. అందుకు అధికారంలో ఉన్న నేటి ప్రభు త్వాలు కూడా ఒక ముఖ్యకారణం. అందువల్ల మనం అధికారాన్ని కూడా ధిక్కరిస్తూ కృషి చేయాల్సి వస్తోంది. మత విశ్వాసాల్ని వదిలి, ప్రపంచ మానవులందరూ కలిసికట్టుగా మానవవాదాన్ని నిలుపుకుంటూ ఉజ్వల భవిష్యత్తుకు దారులు వేసుకోవాల్సి ఉంది. ప్రజాబలం ముందు ఎంతటి ప్రభుత్వాలైనా దిగదుడుపే.
– నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సలహా సంఘ పూర్వ సభ్యుడు, జీవశాస్త్రవేత్త.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -