Friday, April 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభద్రాచలం భవిష్యత్తు, భద్రతకు భరోసా ఏది?

భద్రాచలం భవిష్యత్తు, భద్రతకు భరోసా ఏది?

- Advertisement -

పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో పాటు, గోదావరికి కొంచెం వరద వచ్చినా తెలంగాణాలోని ఏయే ప్రాంతాలకు ఎంతెంత ముంపు వుంటుందో 2023లో నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. భద్రాచలం పట్టణం తీవ్రంగా నష్టపోతుంది. దుమ్ముగూడెం, అశ్వాపురం, చర్ల, మణుగూరు, పినపాక, వాజేడు, ఏటూరు నాగారం వరకు ఈ ప్రభావం తరతమ స్థాయిలలో వుంటుంది.
పోలవరం ప్రాజెక్టు వల్ల సాధించదలచుకున్న ప్రయోజనాల పట్ల ఎవరికీ వ్యతిరేకతలేదు. కానీ ఇవే ప్రయోజనాలను అత్యంత తక్కువ నష్టంతో నిర్మికుంచుకునే అవకాశం వున్న ప్రత్యామ్నాయ డిజైన్‌ను నీటి పారుదల రంగ నిపుణులు ఇరవై రెండేండ్ల క్రితమే ప్రభుత్వాల ముందుంచారు. వీటన్నిటినీ తోసిపుచ్చి అత్యంత వినాశకర, భారీ విధ్వంసకర డిజైనుతో ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. భారతదేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు వల్లా జరగనంత నష్టం, విధ్వంసం జరగబోతున్నది. ఈ భారీ విధ్వంసం బాధితులు నివశించే ప్రాంతాలలోని ఏడు ఏజెన్సీ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణా నుండి కేంద్ర మంత్రివర్గ ఆర్డినెన్స్‌ ద్వారా బదిలీ చేసేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ ఏపీలోని ముందు ప్రజల పునరావాసం బాధ్యత మాది కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ అక్కడి పాల వర్గ పార్టీలు ముందు బాధితుల పక్షాన నిలబడటానికి సిద్ధంగా లేవు.

ఇక తెలంగాణాలోని భద్రాచలం చారిత్రక పట్టణ ఉనికిని పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల ప్రమాదంలో పడకుండా దాన్ని ఎలా రక్షించుకోవాలనేది అక్కడి ప్రజల ముందున్న ప్రధాన సవాలుగా నిలిచింది. ముంపు మండలాల పేరులో ఈ ప్రాంతాన్ని ముక్కలు చేసేటప్పుడు భద్రాచలం పట్ల కేంద్ర ప్రభుత్వం దానికి భవిష్యత్తు లేనివిధంగా అత్యంత దారుణంగా దెబ్బ కొట్టింది. గోదావరి నది భద్రాద్రికి అర్థ చంద్రాకారంలో ఒక వైపు సరిహద్దుగా వుంటుంది. మరోవైపు మొత్తం ఆంధ్రలో కలపబడిన సరిహద్దు ప్రాంతం వుంటుంది. ఆ సరిహద్దు గీత పట్టణంలోని చర్ల రోడ్డు, గోళ్లగట్ట (ఐటిడిఎ) రోడ్డు, కూనవరం రోడ్డు వైపు చొచ్చుకొని వచ్చి పట్టణ అభివృద్ధికి ఒక సెంటు భూమి కూడా మిగలకుండా చేశారు బీజేపీ కేంద్ర పాలకులు. వాళ్లు తెలవక ఈ తప్పు చేసివుంటే, తమ నిజాయితీని నిరూపించుకోడానికి ఈ పన్నెండేళ్ల కాలంలో దానిని సరిదిద్దు కునేవారు. శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవాదాయ భూములు తొమ్మిది వందల అరవై ఎకరాలు కూడా సరిహద్దు గీత వద్ద అవతల వుంచారు. ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నా కేంద్ర పాలకులు నేరపూరిత నిర్లక్ష్యాన్నే కొనసాగిస్తున్నారు.

భద్రాద్రికి దెబ్బమీద దెబ్బ
2016లో తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అనేది ఎప్పటి నుంచో ప్రతిపాదనల్లో వుంది. భద్రాచలానికి 2014లోనే సెంటు భూమి లేకుండా విభజన చేసిన ఫలితంగా, భద్రాద్రి జిల్లా అనే మొదట పేరు పెట్టినప్పటికీ ఇక్కడ కలెక్టరేట్లు, ఇతర భవనాలు, అభివృద్ధి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి స్థలం లేదనే పేరుతో జిల్లా కేంద్రంగా కొత్తగూడేన్ని చేశారు. కొత్తగూడెం ప్రజల విజ్ఞప్తి మేరకు భద్రాద్రి జిల్లాను ‘భద్రాద్రి కొత్తగూడెం’ జిల్లాగా పేరు మార్పుచేశారు. ఈ విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏజెన్సీ ప్రాంతానికి, ఐటీడీఏ ఆఫీసు కేంద్రంగా ఉన్న భద్రాచలం జిల్లా విడిపోయినప్పుడు జిల్లా కేంద్రం కాకుండా పోయింది. ఇందుకు కారణం సెంటుభూమి లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ ద్రోహమే.
1986 గోదావరి వరదల ప్రవాహం అంచనాలతో జరిగిన కరకట్ట నిర్మాణానికి ప్లాన్‌ జరిగింది. పోలవరం బ్యాక్‌వాటర్‌ నేపథ్యంలో ఆ కరకట్ట వల్ల భద్రాదికి భద్రత ఉండదని తేలిపోయింది. పోలవరం ఇంకా పూర్తికాలేదు. కేవలం చిన్న టెంపరరీ కాపర్‌ డ్యామ్‌ మాత్రమే కట్టారు. ఆ మాత్రం ఆనకట్టకే బ్యాక్‌వాటర్‌ ఎఫెక్ట్‌వల్ల భద్రాచలంలో వరద పోటెత్తింది. ఆంధ్రప్రదేశ్‌ భూభాగం పరిధిలోని ఎటపాక నుండి నీళ్లు కరకట్ట మీదుగా రాజుపేట తదితర కాలనీలు దాటి భద్రాచలంలోకి వరదవచ్చింది.

ఎటపాక మండలం తెలంగాణలో లేదు కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగం అక్కడి వారిని పట్టించుకునే అవకాశం లేదు. అప్పుడు దాని జిల్లా కేంద్రం పాడేరు కాదు, రంపచోడవరం.
ఇటీవల భద్రాచలానికి రూ.500 కోట్లు ఇస్తున్నామని శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటిం చింది. ఇందులో పట్టణ అభివృద్ధికి ఎంత? దేవాలయ అభివృద్ధికి ఎంత అనేది క్లారిటీ ఇవ్వవలసిన ఉంది. కరకట్ట నిర్మాణం, దాని నిధుల ఊసేలేదు. గోదావరి నదిని వరదలను తట్టుకొని నిలబడి పట్టణాన్ని కాపాడే పటిష్టమైన, దుర్భేద్యమైన కరకట్ట నిర్మాణం జరగకపోతే గోదావరి పక్కనే ఉన్న దేవాలయం కోసం పెట్టిన నిధులు వృథా అయిపోతాయి. శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవాలయం భద్రతా, ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి పట్టణాన్ని రామాలయాన్ని కాపాడే కరకట్ట నిర్మాణం వెంటనే చేపట్టాలి. అందుకవసరమైన నిధులు వెంటనే కేటాయించి నిర్మాణం పనులు మొదలుపెట్టాలి. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఉంది. కాబట్టి దానివల్ల ఏర్పడుతున్న నష్టాలకు కేంద్రం నిధులు కేటాయించడం కనీస బాధ్యత. శ్రీరాముడి పేరును తన రాజకీయ ప్రయోజనాల కోసం నిత్యం వాడుకునే బీజేపీ భద్రాద్రికి జరిగే నష్టాల విషయంలో తన బాధ్యతను విస్మరించి తప్పించుకుని తిరుగుతున్నది. కేంద్రం నిధులు రాబట్టడానికి, ఐదు పంచాయతీలు ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్‌, ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఉమ్మడి జిల్లా ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలి. లేకుంటే ప్రజలు ఉత్తుత్తి వాగ్దానాలు అనుకుంటారు. ఇటీవల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాసారని మీడియాలో వచ్చింది. ఇలా లేఖ రాయడం అభినందనీయమే. అయితే ఒక రాష్ట్రమంత్రి ఒక కేంద్ర మంత్రికి లేఖ రాయడం అనేదాన్ని కేంద్రం ఎలా పట్టించుకుంటుందో దాని గురించి తెలియని వారెవరు? లేఖ రాసిన తుమ్మల గారికి కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో అవగాహన ఉన్నవారే. కాబట్టి లేఖతో సరిపెట్టకుండా వెంటనే తెలంగాణ అసెంబ్లీలో ఐదు గ్రామాలను భద్రాచలం మండలంలో కలపాలనీ, ఇది పరస్పరం ప్రయోజనం ఉంటుందని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. చట్టబద్దమైన ఒత్తిడిగా మారుతుంది. ఏపీకి ఇచ్చిన ఏడు మండలాలలోని ఒక ఎటపాక మండలానికి చెందిన ఐదు గ్రామాలను మాత్రమే అడుగుతున్నారు. రాముని పట్టణానికి ఐదు ఊర్లు ఇవ్వడానికి ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వం వ్యతిరేకించాల్సిన కారణాలేమీ ఉండవు. వారికి దీనివల్ల కలిగే నష్టం లేదు. భావోద్వేగ అంశాలు లేవు. పరస్పర ప్రయోజనాలే ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడాలి. ఈ అయిదు గ్రామాలను బదిలీ చేయననడానికి కారణాలు ఏమిటో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, ప్రతిపక్ష నేత జగన్‌ చెప్పగలగాలి. ఇదంతా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే చిటికలో పని. ఎందుకంటే ఏడు మండలాలను ఒక కలంపోటుతో ఒక్క నిమిషంలో తెలంగాణ నుండి విడగొట్టగలిగినోళ్లు అయిదు ఊర్లు ఇప్పించలేనివారా? ఇందులో కేంద్రం పాత్ర కీలకం. ఏపీలోని చంద్రబాబు, జగన్‌, పవన్‌ అందరూ బీజేపీ చెబితే వినేవాళ్లే. కావల్సింది కేంద్రానికి చిత్తశుద్ధి. అయోధ్య రామాలయం కోసం గ్రామాలకు గ్రామాలు, వేల ఎకరాలు సేకరించారు. భద్రాచలాన్ని ఎందుకు పట్టించుకోరు. భద్రాద్రి రాముడు అంటే కేంద్ర పాలకులకు ఎందుకు చులకన? విభజన సమయంలో చేసిన తప్పును దిద్దుకోవాల్సింది అదే ప్రభుత్వం కాదా? అవసరమైతే భద్రాచలం ఎంపీ, ఎమ్మెల్యేలు ఢిల్లీలో, హైదరాబాద్‌లో నిరాహారదీక్షలో కూర్చోవాలి.

ఇవన్నీ జరగాలంటే భద్రాచలం కేంద్రంగా విశాలమైన ఐక్యతతో పెద్ద ప్రజా ఉద్యమం అవసరం ఏర్పడితే వెనుకాడ కూడదు.
సీపీఐ(ఎం)- నాటి భద్రాచలం శాసనసభ్యులు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య తెలంగాణలోనే భద్రాచలం కొనసాగాలనీ, ఐదు పంచాయితీలు ఇవ్వాలని నిరాహారదీక్ష చేసి ఉన్నారు. పోలవరం ముంపనుకు వ్యతిరేకంగా డిజైన్‌ మార్చాలని ఇక్కడ లాఠీలకు తలపోటీలిచ్చి, తుపాకి గుండ్ల దెబ్బలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర భద్రాచలం గడ్డకు ఉంది. ఈ పోరాటాల్లో ఎర్రజెండా అగ్రభాగాన నిలబడిన చరిత్ర ఇక్కడి ప్రజలు మర్చి పోలేని వాస్తవం. ఇపుడున్న ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. భద్రాచలానికి ఎదైనా కాలేజీ, ఎదైనా అభివృద్ధి నిధులు, నిర్మాణాలు చేపట్టాలంటే ఇప్పుడున్న భూభాగంలో సెంటు భూమి దొరకదు. వెంటనే అయిదు పంచాయతీలు ఇస్తే ఆ గ్రామాలు కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
కేవలం 17 కిలోమీటర్లు రైల్వేలైన్‌ పాండురంగాపురం నుండి సారపాకవరకు పొడిగిస్తే, భద్రాద్రివాసులకు రైల్వే సౌకర్యం లభిస్తుంది. పాత రోజుల్లో కొత్తగూడెం వరకు రైల్వే లైన్‌ వేసినపుడు అక్కడి రైల్వే స్టేషన్‌ను ”భద్రాచలం రోడ్‌” అని పేరు పెట్టి సరిపెట్టారు. భద్రాచలం నుండి వాజేడు, ఏటూరి నాగారం వరకు ఉన్న ఎనిమిది మండలాల్లో పోలవరం బ్యాక్‌ వాటర్‌ ఎఫెక్టువల్ల భూములను నివాసాలుగా ఉన్న గ్రామాలను గుర్తించాలి. వారికి తగిన ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి, ములుగు జిల్లాల ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలి.
ఏపీలో కలిసిన ఏడు ముంపు మండలాల ప్రజల సమస్యలను, పునరావాసాన్ని అక్కడి పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అక్కడి ప్రజలు వారి జీవన్మరణ సమస్యతో ఉనికి కోసం పోరాడుతున్నారు. వాళ్లే ఇంత సంక్షోభంలో ఉంటే భద్రాచలంను కూడా ఏపీలోనే ముంపు ప్రాంతంలో కలిపేయొచ్చు కదా అని బాధ్యత లేకుండా వెటకారంగా కొందరు మాట్లాడుతున్నారు. ఏదిఏమైనా తెలంగాణ రాష్ట్రంలోని బాధిత ప్రజలు ప్రాంతాల సమస్యల కోసం అసెంబ్లీలో చర్చ జరగాలి. తీర్మానం చేయాలి. కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకోవాలి. ఇందుకోసం ప్రజా ఉద్యమాలే శరణ్యం.

బండారు రవికుమార్‌
9121080160

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -