హైదరాబాద్‌లో జరిగిన యథార్థ ఘటన ఇది. పేరుమోసిన ఓ కార్పొరేట్ ఆస్పత్రి ముందు ఓ యువకుడు, అతని భార్య, తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాటిచెట్టు మీద నుంచి పడి తీవ్రంగా గాయపడిన ఆ యువకుడి తండ్రిని వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి ఆయన చనిపోయాడు. అప్పటికే రూ.18 లక్షలు చెల్లించినా, మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. ఏం చేయాలో దిక్కుతోచని ఆ కుటుంబం అప్పటికే ఉన్న పొలాన్ని అమ్మేసింది. మిగిలిన బిల్లు కోసం ఊరి భూస్వామి వద్ద వెట్టిచాకిరీ చేయడానికి ఒప్పందం చేసుకుని కొంత డబ్బు తెచ్చి చెల్లించింది. ఇక అమ్ముకోవడానికి ఏమీ లేదు.. చెల్లించ డానికి డబ్బూ లేదు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. దీంతో ‘‘శవాన్ని మీరే ఉంచుకోండి’’ అంటూ కుటుంబం కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మనిషి ప్రాణం దక్కకపోయినా, అతని మృత దేహాన్ని కూడా డబ్బుతో ముడిపెట్టేంత కఠినంగా వైద్యం మారడం ఎంతటి విషాదం! ఒక్క వైద్య అత్యవసర పరిస్థితి ఆ కుటుంబాన్ని ఉన్నదంతా కోల్పోయేలా చేసింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన కుటుంబం చివరకు అప్పులపాలై, బానిసలుగా మిగిలే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్క కుటుంబం విషాదం కాదు. లాభాల లెక్కల్లో నడిచే వైద్య వ్యవస్థ సామాన్యుడిపై మోపుతున్న భారానికి ఒక ఉదాహరణ. ‘‘వైద్యో నారాయణో హరి’’ అని వైద్యుడిని దేవుడిగా భావించే మన దేశంలో, ప్రాణాలను కాపాడాల్సిన వైద్యం నేడు లాభాల వేటలో పడి సామా న్యుడికి అందని భారంగా మారుతోంది. రోగం వస్తే భయపడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు రోగం కంటే దాని చికిత్సకు అయ్యే ఖర్చే కుటుంబాలను ఎక్కువగా భయపెడుతోంది.
ఎఫ్‌డిఏ అధ్యయనంలో విస్తుగొల్పే నిజాలు
మహారాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) వైద్యానికి అవసరమైన వస్తువులు, పరికరాలు, మందుల మార్కెట్ ధరలను, కార్పొరేట్ ఆస్పత్రులు వాటికి వసూలు చేస్తున్న ధరలను అధ్యయనం చేసింది. ఎఫ్‌డిఏ కమిషనర్ శ్రీ తుకారాం ముండే, ఐఏఎస్ అధికారి నిర్వహించిన సర్వే నివేదిక దిగ్భ్రాంతికరమైన విషయాలను బయటపెట్టింది. మార్కెట్‌లో రూ.11 ధర ఉన్న ఐవీ ద్రవ పదార్థాలను నరాల్లోకి ఎక్కించే ట్యూబ్ సెట్‌కు ఆస్పత్రి రూ.325 వసూలు చేసింది. రూ.7 ధర ఉన్న పది ఎంఎల్ సిరంజికి రూ.57, రూ.45 ధర ఉన్న ఆక్సిజన్ మాస్క్‌కు రూ.625 బిల్లు వేసింది. మొత్తంగా కొన్ని వైద్య పరికరాలపై ఆస్పత్రులు ఏకంగా 2,840 శాతం వరకు లాభాలు వేసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ ధరల దోపిడీ నుంచి రోగులను రక్షించేందుకు పారదర్శకత, నియంత్రణ, జవాబుదారీతనం నెలకొల్పా లని ప్రభుత్వాన్ని కోరింది. దీనికి తోడు నేషనల్ హెల్త్ అకౌంట్స్ సంస్థ అంచనాల ప్రకారం వైద్య ఖర్చుల్లో మందులు తదితర అంశాల కోసం ప్రజలు తమ జేబు నుంచి చెల్లించే ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెన్సెస్ 43.2 శాతానికి చేరాయి. అంటే అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం కోసం కుటుంబాలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. సామాన్య ప్రజలకు ఇది పెను భారంగా మారుతోంది.
విదేశీ పెట్టుబడులు..
కార్పొరేట్ ‘వైద్య’ విస్తరణ
గడిచిన దశాబ్ద కాలంలో భారత ఆరోగ్య సంరక్షణ రంగం విపరీతమైన వృద్ధిని నమోదు చేసింది. ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నాయి. దేశీయ కార్పొరేట్ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు (ఎఫ్‌డిఐ) మన కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలాది డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. దీంతో చిన్న చిన్న నగరాల్లో కూడా రోబోటిక్ సర్జరీలు, అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు, అధునాతన ఐసీయూ సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు వేల కిలోమీటర్లు ప్రయాణించి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం ఈ విస్తరణ తెచ్చిన పెద్ద ఊరట అనడంలో సందేహం లేదు. అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నా, వాటి ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పునాదులను కదిలిం చడం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. చికిత్స కోసం అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకోవడం, చివరకు కుటుంబాన్నే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టుకోవడం అనేక కుటుంబాల అను భవంగా మారింది. ప్రజారోగ్యం మార్కెట్ లెక్కలకు పరిమితమైతే, సామాన్యుడికి అనారోగ్యం ఒక సమస్య అయితే, దానికి చికిత్స పొందడం మరో పెద్ద సంక్షోభంగా మారుతుంది. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది అదే.
నాణేనికి మరోవైపు... లాభాలే పరమావధి!
అయితే ఈ పురోగతి వెనుక ఒక తీవ్రమైన సామాజిక సంక్షోభం దాగి ఉంది. బీబీసీ న్యూస్ అధ్యయనం ప్రకారం హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లో కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల కోసం రెండేళ్లలో రూ.2.88 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. మన దేశ వైద్యరంగంలోకి విదేశీ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ సంస్థ కేర్ హాస్పిటల్స్‌లో, జనరల్ అట్లాంటిక్ కిమ్స్ హాస్పిటల్స్‌లో, మోర్గాన్ స్టాన్లీ ఒమేగా ఆస్పత్రిలో, కేకేఆర్ స్టార్ హాస్పిటల్స్‌లో, సింగపూర్‌కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ ఏఐజీ హాస్పిటల్స్‌లో, స్వీడన్‌కు చెందిన మెడీకవర్ మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్‌లో, దుబాయ్‌కు చెందిన ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ కొండాపూర్‌లోని పిల్లల ఆస్పత్రిలో పెట్టుబడులు పెట్టినట్టుగా సమాచారం.
విదేశీ పెట్టుబడిదారులకు గానీ, కార్పొరేట్ యాజ మాన్యాలకు గానీ ప్రజలకు నాణ్యమైన వైద్యం తక్కువ ధరకు అందిం చాలనే సామాజిక స్పృహ ఉండదు. వారి ప్రధాన లక్ష్యం పెట్టుబడులపై అత్యధిక లాభాలను సంపాదించడమే. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రధానంగా లాభాపేక్షతో నడుస్తుండటంతో వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి.ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు కూడా నెలవారీ టార్గెట్లు విధిస్తున్న పరిస్థితి నేడు ఉందనేది బహిరంగ రహస్యం. అనవసరమైన ల్యాబ్ పరీక్షలు, నిర్బంధ స్కానింగ్‌లు, అవసరానికి మించి ఐసీయూలో ఉంచడం, అత్యవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేయడం వంటివి సామాన్యుడి జేబులను గుల్ల చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నిటి ఆయోగ్’ అధికారిక నివేదికల ప్రకారం భారతదేశంలో వైద్య ఖర్చులు భరించలేక యేటా ఏడు శాతం కుటుంబాలు పేదరికంలోకి, తీర్చలేని అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. పొదుపు మొత్తాలు ఖాళీ చేసుకుని, ఇళ్లు, భూములు, బంగారం విక్రయించి రోడ్డున పడుతున్న కుటుంబాలు ఎన్నో. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అనేక రకాల వ్యాధులకు లేదా నిర్దిష్ట చికిత్సలకు పూర్తిస్థాయిలో పరిహారం అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు కూడా రోగులకు శాపంగా మారుతున్నాయి.
బలహీనంగా పబ్లిక్ హెల్త్ సిస్టమ్
భారత్‌లో జీడీపీతో పోలిస్తే ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి కేటాయించే నిధులు 2.1 శాతాన్ని దాటడం లేదు. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. ప్రజారోగ్యం కోసం కనీసం ఐదు శాతం కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. దీనికితోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తీవ్రమైన వైద్యుల కొరత, మౌలిక వసతుల లేమి కారణంగా సామాన్యుడు కూడా ప్రైవేట్ రంగానికే వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలహీనపడుతున్న కొద్దీ ప్రైవేట్ కార్పొరేట్ వైద్యం విస్తరిస్తోంది. చివరకు సామాన్యుడికి ఎంపిక కూడా లేకుండా పోతోంది. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాథమిక ఆరోగ్యాన్ని కాపాడటం, నాణ్యమైన ఉచిత లేదా సరైన వైద్య సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రజల పోషకాహారం, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యాలుగా పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు వైద్య సదుపాయాలకు ఉన్న సంబంధాన్ని స్పష్టం చేశాయి.అంటే ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వాలు చేసే దయ కాదు. అది వాటి సామాజిక బాధ్యత. జీవించే హక్కులో అంతర్భాగం.
ఆరోగ్య విధానంలో ప్రాధాన్యతలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునిక వసతులతో పునర్నిర్మించాలి. తగినంత మంది వైద్యులను, సిబ్బందిని నియమించాలి. మన దేశ జీడీపీలో ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్‌ను కనీసం ఐదు శాతానికి పెంచాలి. అత్యవసర చికిత్సలు, ఐసీయూ ఛార్జీలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల ధరలపై గరిష్ట పరిమితులు విధించాలి. బలమైన ప్రాథమిక ఆరోగ్య రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సమర్థమైన కమ్యూనిటీ, జిల్లా ఆస్పత్రులను అభివృద్ధి చేయాలి. అవసరమైన చోట వైద్య కళాశాలలను నిర్మించాలి. ప్రైవేట్ ఆస్పత్రులకు స్పష్టమైన ధరల నియంత్రణ, బిల్లింగ్‌లో పారదర్శకత, రోగుల హక్కుల రక్షణకు సంబంధించిన కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. వైద్యరంగంలో పెట్టుబడులు రావడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేకపోయినా, ఆ పెట్టుబడులు ప్రజల ప్రాణాలను లాభాల లెక్కల్లోకి నెట్టే పరిస్థితి మాత్రం రాకూడదు.మౌలిక వైద్య సదుపాయాలు పెరగడం శుభపరిణామమే. కానీ ఆ సదుపాయాలు ఉన్నత వర్గాలకే పరిమితమై, సామాన్యుడికి అందని ద్రాక్షగా మారితే దాన్ని నిజమైన పురోగతి అనలేం. వైద్యం ఎంత అత్యాధునికంగా మారినా, దాని ప్రయోజనం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే దానికి అర్థం ఉంటుంది.
ఆరోగ్యం వ్యాపార సరుకు కాదు...
ఒక కుటుంబం అనారోగ్యం వల్ల అప్పుల్లో కూరుకుపోతే నష్టం ఆ కుటుంబానికే పరిమితం కాదు. అది సమాజానికీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ నష్టమే. అందుకే ఆరోగ్యాన్ని మార్కెట్ శక్తులకు పూర్తిగా వదిలేయకూడదు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోకూడదు. ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే బలమైన ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థను నిర్మించడం అత్యవసరం. వైద్య రంగంలో కార్పొరేట్ విస్తరణకు సమాంతరంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయకపోతే, రేపటి రోజుల్లో అనారోగ్యం కంటే దాని ఖర్చే ప్రజలకు పెద్ద భయంగా మారుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా మారాలి. వైద్యాన్ని లాభాల వ్యాపారం నుంచి ప్రజా సంక్షేమ వ్యవస్థ వైపు మళ్లించాలి. అది ప్రభుత్వ విధానాలతోనే సాధ్యమవుతుంది. పౌర సమాజం ఉద్యమాల ద్వారానైనా ఈ హక్కును సాధించుకోవాలి. నాణ్యమైన వైద్యం కోసం గొంతు విప్పాలి. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అదే నిజమైన ఆర్థికాభివృద్ధికి పునాది.
పి.వెంకటరామయ్య, 9553533815







కామెంట్‌లు (0)