ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నా రని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణనష్టంతో పాటు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1992 నుంచి అక్టోబర్ 10ను ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు, దాదాపు 1.2 బిలియన్ల మంది మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. వీటిలో ఆందోళన, డిప్రెషన్ అత్యంత సాధారణమైనవి. సుమారు 470 మిలియన్ల మంది ఆందోళన రుగ్మతతో, 322 మిలియన్ల మంది డిప్రెషన్‌తో, 36 మిలియన్ల మంది బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. సుమారు 27 మిలియన్ల మంది స్కిజోఫ్రీనియాతో, 18 మిలియన్ల మంది ఆహార సంబంధిత రుగ్మతలతో జీవిస్తున్నారు. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు కూడా ఈ సమస్యలకు గురవుతున్నారు. సమర్థవంతమైన చికిత్సా పద్ధతులు ఉన్నప్పటికీ చాలామందికి అవసరమైన మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. కళంకం, వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మానసిక రుగ్మతలు ఉన్నవారి అవసరాలకు ఆరోగ్య వ్యవస్థలు ఇప్పటికీ తగిన స్థాయిలో స్పందించడం లేదు. వనరుల కొరత, నిపుణుల కొరత, చికిత్స అవసరానికి-అందుబాటులో ఉన్న సేవలకు మధ్య భారీ అంతరం ఉంది. సైకోసిస్ ఉన్నవారిలో కేవలం 40 శాతం మంది, డిప్రెషన్‌తో బాధపడుతున్నవారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే అధికారిక మానసిక ఆరోగ్య సంరక్షణ పొందుతున్నారు. కోవిడ్-19 ప్రభావం మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేసింది. ఉపాధి కోల్పోవడం, ఆర్థిక అసమానతలు, ఒత్తిడితో కూడిన జీవన విధానం ప్రజల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. మనదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నప్పటికీ, వారిలో అధిక శాతం మందికి చికిత్స అందడం లేదు. పాఠశాల విద్యార్థుల్లోనూ ఆందోళన, తీవ్రమైన భావోద్వేగ సమస్యలు పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్-2017ను అమలు చేసింది. ఈ చట్టం ద్వారా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్య సేవలు, గౌరవ ప్రదమైన జీవితం, వివక్షకు దూరంగా ఉండే హక్కు, అమానవీయ పరిస్థితుల నుంచి రక్షణ, న్యాయ సహాయం వంటి హక్కులు కల్పించింది. అయితే చట్టం అమలులోకి వచ్చి సంవత్సరాలు గడిచినా రాష్ట్రస్థాయిలో దాని అమలుకు అవసరమైన చర్యలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మానసిక ఆరోగ్య సమీక్షా బోర్డుల ఏర్పాటు, నిరంతర సమీక్షలు, చట్టంలోని నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం. మానసిక ఆరోగ్య సంరక్షణను గ్రామస్థాయికి తీసుకెళ్లాలి. జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం, నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, అడోలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్‌లు, పీర్ ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది స్థాయిలోనే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి, సమస్యలను ముందుగానే గుర్తించే వ్యవస్థను బలోపేతం చేయాలి. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో మానసిక ఆరోగ్య పాఠ్యాంశాలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాలి. ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానసిక ఆరోగ్య వైద్యులను నియమించాలి. ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు, కమ్యూ నిటీ ఆధారిత పునరావాస కార్యక్రమాలను విస్తృతం చేయాలి. మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తులకు కుటుంబ, సామాజిక సంబంధాలను కొనసాగిం చేందుకు, విద్య, ఉపాధి, గృహవసతి, ఇతర అర్థవం తమైన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అవసరమైన మద్దతు అందించాలి. మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు వైద్య సేవల విస్తరణతో పాటు ప్రజల్లో అవగాహన, సామాజిక మద్దతు, వివక్ష నిర్మూలన కూడా అవసరం. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్-2017ను సమర్థ వంతంగా అమలు చేయడం, మానసిక ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడం కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
- యం.అడివయ్య,
9490098713







కామెంట్లు (0)