Magazines

సాగుభారం సగం ‘ఆమె’దే..గుర్తింపులో మాత్రం వివక్షే!

1 రోజు క్రితం

farming
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

భారతీయ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనది. విత్తనం నాటడం నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రతి దశలోనూ మహిళా రైతులు శ్రమిస్తున్నారు. వ్యవసాయంలో వినూత్న మార్పులు తీసుకురావడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం, ఆహార భద్రతకు తోడ్పడటంలో వారి పాత్ర అమూల్యమైనది. దేశంలోని గ్రామీణ మహిళల్లో సుమారు ఎనభై శాతం మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయ వ్యవసాయ శ్రామికశక్తిలో మహిళల వాటా సుమారు 33 శాతం కాగా, తెలంగాణలో అది 52.26 శాతంగా ఉంది. అయినప్పటికీ, వ్యవసాయానికి వెన్నెముకగా నిలుస్తున్న మహిళలకు రైతులుగా తగిన గుర్తింపు, హక్కులు దక్కడం లేదు. ఒక హెక్టారు పొలంలో పురుషుడు సుమారు 1,212 గంటలు పనిచేస్తే, మహిళ 3,845 గంటలు శ్రమిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతటి శ్రమ చేసినా భూమిపై యాజమాన్య హక్కులు ఉన్నవారినే రైతులుగా గుర్తించడం వల్ల మహిళలు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ రుణాలు, సబ్సిడీలు, సాంకేతిక సహాయం వంటి ప్రయోజనాలకు దూరమవు తున్నారు. వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళల్లో 15 శాతం కంటే తక్కువ మందికే భూమిపై యాజమాన్య హక్కులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ వాటా 12 నుంచి 13 శాతం మాత్రమేనని అంచనాలున్నాయి. వ్యవసాయంలో నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు, రైతాంగానికి ప్రతికూలమైన విధానాల కారణంగా పురుషులు ఉపాధి కోసం పట్టణాలకు, ఇతర రంగాలకు వలస వెళ్తున్నారు. దీంతో వ్యవసాయ బాధ్యతలు మహిళలపై మరింతగా పడుతున్నాయి.

దీనినే వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం (ఫెమినైజేషన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌)గా పేర్కొంటారు. మరోవైపు, కుటుంబ పొలాల్లో పనిచేస్తున్న మహిళల్లో 50.5 శాతం మంది వేతనం లేని శ్రామికులుగా నమోదవుతుండగా, పురుషుల్లో ఈ వాటా 21.7 శాతంగా ఉంది. మహిళల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వ్యవసాయంలో నష్టాలు రావడం లేదు. వారికి అవసరమైన వనరులు, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్‌ అవకాశాలు అందుబాటులో లేకపోవడమే ప్రధాన సమస్య. ఈ పరిస్థితిని మార్చేందుకు మహిళలకు భూమి యాజమాన్య హక్కులు లేకపోయినా రైతులుగా అధికారిక గుర్తింపు కల్పించే విధానాలను ప్రభుత్వాలు తీసుకురావాలి. వ్యవసాయం, పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలపై ఆధారపడిన మహిళలకు రైతు గుర్తింపు పత్రాలు అందించాలి. తద్వారా వ్యవసాయ రుణాలు, విత్తన సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు, సాంకేతిక సహాయం నేరుగా పొందే అవకాశం కలుగుతుంది. చట్టాలు, పథకాలు రూపొందించడంతోపాటు వాటి అమలులో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలి. మహిళల శ్రమను తగ్గించేలా వ్యవసాయ యంత్రాలను రూపొందించడంతోపాటు, వారికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. వ్యవసాయ రుణాలు, డ్రోన్లు, శాస్త్రీయ సలహాలు, మార్కెట్‌ సదుపాయాలను విస్తరించాలి. మహిళల ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయాలి.

వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కొరత, మధ్యవర్తుల దోపిడీని అరికట్టి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పురుగుమందుల వినియోగం వల్ల మహిళల ఆరోగ్యానికి కలిగే ముప్పును తగ్గించేందుకు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కుటుంబ బాధ్యతలతో పాటు వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న మహిళలు అధిక శారీరక శ్రమకు గురవుతున్నారు. సరైన పోషకా హారం, విశ్రాంతి, ఆరోగ్య సంరక్షణ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ నష్టాల కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వారి భార్యలు అకస్మాత్తుగా వ్యవసాయ బాధ్యతలను చేపట్టి అప్పులు, పెట్టుబడి, మార్కెటింగ్‌ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి మహిళలకు ప్రభుత్వాలు ప్రత్యేక సహాయం, ఆర్థిక భద్రత కల్పించాలి. అక్టోబర్‌ 15 మహిళా రైతు దినోత్సవం సందర్భంగా మహిళల వ్యవసాయ శ్రమను గుర్తించి, వారికి రైతులుగా చట్టబద్ధమైన గుర్తింపు కల్పించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి. మహిళా సాధికారతను కేవలం సంక్షేమ కోణంలోనే కాకుండా వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా చూడాలి. భూమిపై హక్కులు, రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్‌ అవకాశాలు కల్పించినప్పుడే గ్రామీణ పేదరికం తగ్గి, వ్యవసాయం మరింత సుస్థిరంగా అభివృద్ధి చెందు తుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి, వారి శ్రమకు తగిన విలువనిచ్చి, వ్యవసాయ నిర్ణయాల్లో భాగస్వాములను చేసినప్పుడే నిజమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. లేకపోతే మహిళా రైతు దినోత్సవం వేడుకలకే పరిమితమవుతుంది. సాగులో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు గుర్తింపు, హక్కులు, వనరులు కల్పించినప్పుడే వ్యవసాయ రంగంలో సమానత్వం సాధ్యమవుతుంది.


- యలమంచి వంశీకృష్ణ, 990899969

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్