‘‘నిర్ణయాలన్నీ ముగ్గురం కలిసి తీసుకున్నాం, ముగ్గురం కలిసే తీసుకున్నాం, ముగ్గురం, ముగ్గురం’’
‘‘ఇదేమీ బాగాలేదండీ మాటిమాటికీ ఇదే కలవరింత. అటు తిరిగి పడుకొండి, నుదుటిమీద ఈ చెమటలేమిటండి ఇంత ఏసీలో? పెంచుతానుండండి’’ గ్యానేష్ కుమార్ శ్రీమతి
****
కళలు అరవైనాలుగని చదువుకున్నాం. అది చాలా పాత మాట ఎంత పాతదంటే ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తోంది అన్నంత. ఆ నాలగుపాదాలకు పైనున్న మోకాళ్లరిగిపోయి, మిగతా కీళ్లు మెత్తబడి ఎన్నోచోట్ల అతుకులు పడి, ఆపరేషన్లు జరిగి వెంటిలేటరు మీద ఉందని మరువరాదు. మీకు ధర్మంపైన నమ్మకంలేదా ఇలా మాట్లాడుతున్నారనుకునేవాళ్లు ఉండవచ్చు కాని వాళ్లకూ లోలోపల అన్నీ తెలుసు. పైకి ధర్మసూత్రాలు, ధర్మమైన మాటలు అంతే. కళల్లో ఎన్నికలు కూడా చేరిపోయి కళలన్నింటిలో అవే ఇప్పుడు శిఖరం మీద ఉన్నాయి. షేర్ మార్కెట్ ధరల్లో ఎక్కువగా ధర పలికే షేర్లలాగా అవి పైకెక్కి కూచున్నాయి.
రాజకీయ మార్కెట్లో ఎన్నికల పాత్ర తెలుసు కాబట్టే దేశ విదేశాల్లో ఇప్పుడు ఆ టెక్నిక్కునే వాడుతున్నారు. అదెలాగో మొదట ట్రంపులవారిదగ్గర చూసి నేర్చుకోవాలి. ఆయన వెనిజులా అధ్యక్షుణ్ణే కిడ్నాప్ చేసి అక్కడ తాను ‘‘ఎన్నిక’’చేసిన నాయకురాలిని అధికారంలో కూచోబెట్టాడు. ఇక తాను అధికారంలోకి ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. ప్రపంచాన్ని నాశనం చేయడంలో ఆయనకు సహకరిస్తున్న భాగస్వామి నెతన్యాహూ ఇరవై అయిదేండ్లు ఇజ్రాయెల్‌ను ఏలినా ఇంకా ఆశ చావక ఎవరు గెలుస్తారు అని అనుమానమొస్తే వాళ్లను ఎన్నికలకు అనర్హులుగా చేసేస్తున్నాడు. ఇవన్నీ కూడా అక్కడి ఎన్నికల సంఘం చలువతోనే చేస్తున్నాడని మరవొద్దు. అక్కడి అత్యున్నత న్యాయస్థానం కల్పించుకొని ఈ పరిస్థితిని నివారించకుంటే మళ్లీ నెతన్యాహూనే ప్రధాని.
స్వేచ్ఛాపూరితమైన, న్యాయమైన ఎన్నికలు జరుగుతున్నాయా అన్న సూచి ఒకటి ఉంది ప్రపంచ వ్యాప్తంగా. అందులో చాలా దేశాలకు నూటికి తొంభై మార్కుల పైన ఉంటే మనకు నలభై తొమ్మిది మార్కులు రావడం మన ప్రజాస్వామ్య ఘనతను చాటుతుంది. ప్రజాస్వామ్యం ఎన్నికలకు సంబంధించిన ఐడియా అనే అంతర్జాతీయ సంస్థ గణాంకాల ప్రకారం దాదాపు సగం దేశాల్లో ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని తెలుస్తోంది. చట్టబద్దంగా ఎన్నికలు జరగడం ప్రమాదంలో పడిందని అది చెబుతోంది. ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా తెలపడం, సమావేశాలు జరుపుకోవడం, ఎన్నికల ముందు, ఎన్నికలప్పుడు, తరువాత ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ప్రమాదంలో పడిందని ఆ సంస్థ ఘోషిస్తోంది.
ప్రపంచదేశాల సరసన మనం నిలుస్తున్నామని నాయకులంటుంటే ఏమిటోనని ఇన్నిరోజులూ అపోహ పడ్డాం. ఇప్పుడర్థమవుతోంది పరిస్థితి. నిజమైన స్వర్ణ, స్వచ్ఛ ఎంతబాగా ఉన్నాయో తెలుస్తోంది. మన క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పతకాలు దండిగా తెస్తున్నారు కాని మన నాయకులు ప్రజలకు తెలియకుండానే ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నారు. మనదేశాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నారు కొన్ని అంశాల్లో. ఈమధ్య జరిగిన ఒక శిఖరాగ్ర సభ తరువాత ప్రపంచనాయకులకు వ్యాపారమే పరమావధిగా మారిందని కొన్ని వ్యాఖ్యానాలు వినిపించాయి. అధికారమే వ్యాపారమైపోయిందని కొందరు చెబుతున్నా వినేవాళ్లు లేరు.
చీఫ్ ఎన్నికల కమిషనర్‌కు మిగిలిన ఇద్దరు కమిషనర్లకు మధ్య జరిగింది బయటపడింది. రితికా చోప్రా బయటపెట్టిన విషయాలు దేశాన్ని ఒక్క కుదుపు కుదిపాయి. ప్రతిపక్షాలు, కాక్రోచ్ పార్టీ కూడా రంగంలోకి దిగాయి. ఇవేవీ నిజం కానట్టు ముగ్గురు కమిషనర్లు నవ్వుతూ ఉన్న ఫొటో మీడియాకిచ్చి అంతా సవ్యంగా ఉంది అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే తీసుకున్నారని చెబుతున్నారు. కొన్ని సంస్థలు దేశంకోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి. అవి ఇప్పుడు పార్టీలకోసం పనిచేస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు వాపోతున్నారు. అందుకే ఇప్పటికీ చాలామంది శేషన్ లాంటోడు మనకు మళ్లీ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్‌గా రావాలండీ అంటుంటారు. గ్యానేష్ కుమార్‌కు కూడా మంచిపేరు తేగల వాళ్లు ముందు ముందు రారని గ్యారెంటీ ఏమైనా ఉందా? దొంగ చనిపోతూ తన కొడుక్కు నీవూ దొంగవేకాబట్టి నాకెలాగోలా మంచి పేరు తెప్పించు అని మాట తీసుకున్నాక జరిగిన కథ మనం విన్నాము. అలా ఇతరులకు మంచిపేరు తెప్పించగల వాళ్లు భవిష్యత్తులో రావచ్చు. ఇది కాల జ్ఞానం కాదు కాలాన్ని అంచనా వేయడం.
కొసమెరుపేమిటంటే, నిజంగానే ముగ్గురూ కలిసి నిర్ణయాలు తీసుకున్నామంటున్నారు గ్యానేష్ కుమార్ గారు. ఒకరు ఆయన మరి మిగతా ఇద్దరు ఇతర కమిషనర్లు కాదు. ఐతే ఆ ‘‘ఇద్దరూ’’ ఎవరన్నది దేశానికంతా తెలుసు.
జంధ్యాల రఘుబాబు
9849753298
ఎన్ని‘‘కళ’’లో...ఎన్ని‘‘కల’’లోగ
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)