వ్యవసాయ దేశంగా ఉన్న భారత్‌ను నిర్లక్ష్యం చేసి, పేదల అభ్యున్నతిని పక్కన పెట్టి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఎనిమిది దశాబ్దాలుగా అధికారంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీల విధానాల ఫలితంగా దేశంలోని విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ‘దేశం అభివృద్ధి చెందుతోంది, పేదల జీవన ప్రమాణం పెరుగుతోంది’ అని కేంద్ర ప్రభుత్వం తరచూ ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలోని సామాన్య ప్రజలు పరిమిత ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తుంటే, మరోవైపు కొద్దిమంది పారిశ్రామిక దిగ్గజాల సంపద విపరీతంగా పెరుగుతోంది. పెద్ద పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలకు భారీ రుణమాఫీలు, రాయితీలు అందుతున్నాయని విమర్శలు ఉన్నాయి. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంటే, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారు. కొందరి సంపద పెరగడమే దేశాభివృద్ధికి కొలమానం కాదని ప్రభుత్వం గుర్తించాలి.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని, ప్రస్తుతం సుమారు 3.9 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 29 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే, ప్రస్తుతం వ్యవసాయం, పరిశ్రమ, విద్య, వైద్యం రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభాలను పరిష్కరించకుండా, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మారగలం అన్నది ప్రశ్న.‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన ఉండాలి.
దేశ ప్రగతిలో అందరి భాగస్వామ్యం ఉండాలంటే రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు ఆర్థికంగా బలపడాలి. రానున్న పది, ఇరవై ఏళ్ల ప్రణాళికలతో పాటు ప్రస్తుతం కరవుతో అల్లాడుతున్న ప్రజలను ఎలా ఆదుకోవాలన్నదే ఇప్పుడు అత్యవసరం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ 2016 ఫిబ్రవరి 28న బరేలీలో జరిగిన కిసాన్ ర్యాలీలో ప్రకటించారు. ఆ ప్రకటన ఆచరణలోకి రాలేదు. పైగా 2020లో మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు సుదీర్ఘంగా సాగించిన పోరాటాల ఫలితంగా చివరకు ఆ చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ రంగంపై కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతుందన్న ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఇప్పుడు దేశాన్ని మరో పెద్ద సమస్య కరువువేధిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ భారతం కరవు కోరల్లోకి వెళ్తున్నప్పటికీ, కంటి తుడుపు చర్యలు తప్ప సమగ్ర కార్యాచరణ కనిపించడం లేదు. కరవు కాలంలో వలసలను అరికట్టి, రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు ఉపాధి కల్పించే ప్రధాన ఆధారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అలాంటి కీలక సమయంలో ఈ పథకానికి నిధులు పెంచాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం తగ్గించడం ఆందోళనకరం.వ్యవసాయ కార్మిక సంఘాలు కనీసం 200 పని దినాలు కల్పించి, రోజుకు రూ.700 కూలి అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉపాధి కోసం తక్షణమే రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
నిధుల కొరతతో దాదాపు 15 కోట్ల మంది నమోదిత కార్మికులకు తగిన పని కల్పించడం కష్టంగా మారింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల కూలి బకాయిలు పేరుకుపోయాయి. చేతిలో డబ్బు లేక గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారు.కరవు సమయంలో రైతుకు కేవలం విత్తనాలు, ఎరువులు అందించడం సరిపోదు. పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ పరిహారం అందించాలి. సాగు రుణాలపై ఉపశమనం కల్పించాలి. తాగునీరు, పశువులకు మేత, ఉపాధి వంటి అత్యవసర అవసరాలను ప్రభుత్వం తీర్చాలి. కరవు పీడిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలి.అదే సమయంలో రైతులకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం కలిపి కనీస మద్దతు ధర కల్పించాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను చట్టబద్ధం చేయాలి. గిట్టుబాటు ధర లేకపోవడంతో మార్కెట్లో దళారులు, పెద్ద కార్పొరేట్ కొనుగోలుదారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు. రైతులకు రుణ ఉపశమనం, పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.
తెలంగాణలోనూ కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్రంలో 17 శాతం వర్షపాత లోటు నమోదైంది. 235 మండలాల్లో కరవు నెలకొందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల లోటుతో భూగర్భ జలాలు క్షీణించి నీటి ఎద్దడి పెరుగుతోంది.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో కూడా 27 శాతం వర్షపాత లోటు నమోదైంది. తెలంగాణతో పాటు దేశంలోని మరో ఐదు రాష్ట్రాలు కూడా తీవ్ర కరవును ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆలస్యంగా అయినా చర్యలకు సిద్ధమవుతోంది. తక్షణ ఉపశమన చర్యలపై క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తక్కువ నీటితో, స్వల్ప పెట్టుబడితో, తక్కువ కాలంలో పండే పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. అయితే ప్రత్యామ్నాయ పంటల సూచనలతో పాటు సాగుకు అవసరమైన నీరు, పెట్టుబడి, రుణ సౌకర్యం, గిట్టుబాటు ధర, నష్టపరిహారం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సహాయక చర్యలు చేపట్టాలి. మరోవైపు తెలంగాణలో వ్యవసాయ రంగానికి గత బడ్జెట్లో రూ.24,439 కోట్లు కేటాయించగా, 2026-27 బడ్జెట్లో రూ.23,179 కోట్లు మాత్రమే కేటాయించారు. కరవు తీవ్రంగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి సుమారు రూ.1,260 కోట్లు తగ్గించడం ఆందోళన కలిగించే అంశం.
కరవును ఎదుర్కోవాల్సిన సమయంలో వ్యవసాయానికి నిధులు పెంచాల్సింది పోయి తగ్గించడం రైతుల కష్టాలను మరింత పెంచుతుంది.
దేశంలో గ్రామీణ రైతాంగం, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మాత్రం కార్పొరేట్ రంగం చుట్టూనే తిరుగుతున్నాయి. భారతదేశం ఆర్థికంగా బలమైన దేశంగా ఎదగాలంటే కార్పొరేట్ సంస్థల లాభాలు పెరగడం మాత్రమే సరిపోదు. రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, పేదలు సుభిక్షంగా ఉండాలి. వారి కొనుగోలు శక్తి పెరిగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా దీర్ఘకాలిక లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల ప్రకటనలకే పరిమితం కాకుండా కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునే తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. కరవు ప్రాంతాలకు కేంద్ర బృందాలను పంపించి నష్టాలను అంచనా వేయాలి. రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించి వెంటనే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు విడుదల చేయాలి. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు కేటాయించి అదనపు పనిదినాలు కల్పించాలి. దేశంలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పే గణాంకాలకంటే, ప్రస్తుతం కరువుతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఏమి చేస్తుందన్నదే ముఖ్యం. భవిష్యత్‌లో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాలు ఉండాలి. కానీ ఆ లక్ష్యాలకు పునాది వేసేది నేటి ప్రజల జీవన భద్రతేనని గుర్తించాలి.
పి.వి.రావు, 9010153065







కామెంట్లు (0)